Abn logo
Apr 26 2021 @ 14:18PM

కరోనాను ఇలా జయిద్దాం

రోగనిరోధక వ్యవస్థ బలోపేతంలో బి, సి, డి విటమిన్లు కీలకం

ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాల్లో వెల్లడి

ఇమ్యూనో మాడ్యులేటరీ ఏజెంట్‌గా డి విటమిన్‌ ఖ్యాతి

వాపును కలిగించే సైటోకైన్ల సంఖ్య తగ్గింపులో కీలకం

సైటోకైన్‌ తుఫాన్‌ను సమర్థంగా అడ్డుకునే బి విటమిన్లు

మధ్యతరగతివారిలో,సంపన్నుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువ

వారిలో బి, డి విటమిన్ల లోపమే అందుకు ప్రధాన కారణం

శాకాహారుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రతకు కారణం బి 12 లోపమే


నిత్యం 3 లక్షలకు పైగా కేసులు.. వేలాది మరణాలు.. ప్రాణవాయువు అందక అల్లాడిపోతున్న ప్రాణాలు.. నిండిపోతున్న ఆస్పత్రులు.. చితిమంటలు ఆరని శ్మశానాలు! రెండో ప్రభంజనంలో కరోనా కరాళ నృత్యానికి ఉదాహరణలివి!! అయినా.. రోజూ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా.. జీవనయానం కొనసాగించక తప్పని పరిస్థితి. అందుకే.. గతంలో మాదిరిగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్లు విధించే ఆలోచనలో ప్రభుత్వాలు లేవు. భరించే స్థితిలో ప్రజలూ లేరు. విధిస్తే మనుగడ సాగించే స్థితిలో ఆర్థిక వ్యవస్థ కూడా లేదు. అందుకే రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నా.. అవి రాత్రిపూట కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్లు వంటివాటికే పరిమితమవుతున్నాయి. వైరస్‌ భయం ఉన్నా.. జీవనోపాధి కోసం, ఇతర అవసరాల కోసం ప్రజలు బయటకు రాక తప్పని పరిస్థితి. దానివల్ల గత ఏడాదితో పోలిస్తే వైరస్‌ బారిన పడే ముప్పు ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు. అయితే.. మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటి జాగ్రత్తలతో వైరస్‌ బారిన పడకుండా కొంతవరకూ రక్షణ పొందవచ్చు. వైరస్‌ బారిన పడినవారిలో దాదాపు 80-85 శాతం మందికి ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదు. వారికి వైరస్‌ వచ్చిందీ పోయిందీ కూడా తెలియట్లేదు. డి విటమిన్‌, బి 12 విటమిన్‌ లోపం లేనివాళ్లు ఈ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మీరు కూడా ఆ 85శాతం మందిలో ఉండాలంటే.. డి విటమిన్‌, బి 12 విటమిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే.. ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. రోజూ వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థ బలోపేతంలో బి, సి, డి విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయని తెలిసిందే. ఆ విటమిన్ల లోపం ఉన్నవారిలో కరోనా ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు చాలా అధ్యయనాల్లో తేలింది. సెకండ్‌ వేవ్‌లో వైద్యనిపుణులు ప్రధానంగా గుర్తించిన అంశం ఏమిటంటే.. పేదలతో పోలిస్తే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతివారు, సంపన్నులు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. వారిలో కూడా.. డి విటమిన్‌, బి12 విటమిన్‌ లోపం ఉన్నవారిలోనే కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం డి విటమిన్‌ లోపం. ఆయా వర్గాల వారి వృత్తి, ఉపాధుల రీత్యా ఎండలో తిరగడం తక్కువ కాబట్టి.. డి విటమిన్‌ స్థాయులు వారిలో తక్కువగా ఉండడం సహజంగా మారింది. బి12 విటమిన్‌ లోపం ఉండే శాకాహారులకు ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.


సైటోకైన్‌ స్టార్మ్‌ అంటే?

ఏదైనా వైరస్‌ లేదా విషం చేరితే శరీరం వెంటనే స్పందించి రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది. వెంటనే యాంటీబాడీస్‌, బి సెల్స్‌, టి సెల్స్‌ సంయుక్తంగా వైర్‌సపై యుద్ధం ప్రకటిస్తాయి. వచ్చింది పాత వైరస్‌ అయితే ఉన్న యాంటీబాడీస్‌ సరిపోతాయి. కొత్త వైరస్‌ అయితే.. దాన్ని ఎదుర్కొనే యాంటీబాడీ్‌సను శరీరం ఉత్పత్తి చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ ఈ యుద్ధం చేయడంలో కీలకపాత్ర పోషించేవి సైటోకైన్లు. ఇవి చాలా సూక్ష్మ ప్రొటీన్‌ కణాలు. ముప్పును ఎదుర్కోవడానికి ఇమ్యూన్‌ సెల్స్‌ ఏ స్థాయిలో విడుదల కావాలో నిర్ణయిస్తూ ఉంటాయి. ఇవి అదుపుతప్పితే రక్తంలో సైటోకైన్స్‌ స్థాయులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ దశలో ఇమ్యూన్‌ సెల్స్‌ మన శరీరంలోని అవయవాలపైనే దాడి చేయడం మొదలెడతాయి. ఫలితంగా కీలక అవయవాలు వాపునకు గురవుతాయి. క్రమంగా అవయవాలు విఫలమవుతాయి. చివరికి ప్రాణాలు పోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండాలి. అందుకు బి విటమిన్లు(అన్నీ), డి విటమిన్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా సైటోకైన్‌ల సంఖ్యను డి విటమిన్‌ తగ్గిస్తుందని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు గత ఏడాది చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సైటోకైన్‌ స్టార్మ్‌ వల్ల ఏర్పడిన వాపు పెరిగే కొద్దీ శరీరంలో బి6 విటమిన్‌ హరించుకుపోతుంటుందని.. కాబట్టి ఆ సమయంలో వారికి బి6 విటమిన్‌ ఇస్తే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ సమతుల్యంగా ఉంటుందని వారు వివరించారు.


హ్యాపీ హైపోక్సియా.. పెను విషాదం!

కరోనా సెకండ్‌వేవ్‌లో చాలా మంది యువతలో కనిపిస్తున్న ఆందోళనకర లక్షణం.. హైపోక్సియా. అంటే.. శరీరంలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయులు పడిపోవడం. ఆస్పత్రికి వస్తున్న యువతలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఆక్సిజన్‌ శాచురేషన్‌ 94 నుంచి 100 మధ్య ఉంటుంది. అది 90 కన్నా దిగువకు పడిపోతే ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. కరోనా బారిన పడిన కొందరిలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ దాదాపు 80కి వచ్చేసినా కూడా వారు మామూలుగానే ఉంటున్నారు. ఈ స్థితిని ‘హ్యాపీ హైపోక్సియా’ అంటారు. తమకు ఈ సమస్య ఉన్నదని బాధితులకుతెలిసేలోగానే.. వారి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చూస్తూచూస్తుండగానేపరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు విరుగుడు.. నాణ్యమైన పల్స్‌ ఆక్సీమీటర్‌. మందుల దుకాణాల్లో రూ.1500 నుంచి రూ.2000 ధరలో పల్స్‌ ఆక్సీమీటర్లు దొరుకుతాయి. కరోనా పేషెంట్లు వాటితో తరచుగా తమ ఆక్సిజన్‌ స్థాయులను గమనించుకుంటూ ఉండాలి. 94 కన్నా తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తద్వారా ప్రాణాలు నిలుస్తాయి. ‘‘యువతలో రోగనిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల.. హైపోక్సియా వల్ల వచ్చే సమస్యలను వారి శరీరం కొంత మేర ఎదుర్కోగలుగుతుంది. శాచురేషన్‌ స్థాయులు 80గా ఉన్నా.. వారు సౌకర్యవంతంగానే ఉంటారు తప్ప తమ సమస్య గురించి తెలుసుకోలేరు. హ్యాపీ హైపోక్సియా సమస్య యువతలోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే. అదే వృద్ధుల్లో, నడివయసువారిలో శాచురేషన్‌ 92 దిగువకు వస్తే శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది.’’ అని నిజామాబాద్‌కు చెందిన ప్రభుత్వ వైద్యుడొకరు తెలిపారు. హ్యాపీ హైపోక్సియా వల్ల వారు చివరి నిమిషంలో ఆస్పత్రికి వస్తున్నారని.. వారిని కాపాడడం కష్టంగా మారుతోందని, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌.. అయినా..

చాలా మందిలో కరోనా సోకిన లక్షణాలు ఉంటున్నాయి. కానీ, ఆర్టీపీసీఆర్‌లో నెగటివ్‌ వస్తోంది. వైరస్‌ మ్యుటేషన్ల వల్లనే ఇలా జరుగుతోందని.. ఉత్పరివర్తనం చెందిన వైర్‌సలను ప్రస్తుత ఆర్టీపీసీఆర్‌ టెస్టులు గుర్తించలేకపోతున్నాయని కొందరు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, టెస్టులో నెగెటివ్‌ వచ్చినా.. లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నెగెటివ్‌ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరొకసారి పరీక్ష చేయించుకోవాలి. ఆ ఫలితం వచ్చేదాకా ఇంట్లోనే విడిగా (ఐసోలేషన్‌) ఉండాలి.

బోలెడన్ని అధ్యయనాలు...

గత ఏడాది జూన్‌లో సింగపూర్‌ జనరల్‌ హాస్పిటల్‌ శాస్త్రజ్ఞులు కరోనా సోకిన పలువురు వృద్ధులకు విటమిన్‌ డి, మెగ్నీషియం, బి12 సప్లిమెంట్లు ఇచ్చి చూశారు. మరికొందరికి వాటిని ఇవ్వకుండా చికిత్స చేశారు. సప్లిమెంట్లు ఇచ్చినవారిలో ఇన్ఫెక్షన్‌ వేగం, తీవ్రత తగ్గి, ఆక్సిజన్‌ తీసుకోవాల్సిన, ఇంటెన్సివ్‌ కేర్‌లో చేరాల్సిన అవసరం రాలేదని గత ఏడాది నిర్వహించిన ఆ అధ్యయనంలో తేలింది. శ్వాసనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో ‘ఇమ్యూనో మాడ్యులేటరీ ఏజెంట్‌’గా పేరొందిన డి విటమిన్‌ బాగా ఉపయోగపడుతోందని వారు తెలిపారు. అది శరీరంలోని కీలక అవయవాల్లో వాపును ప్రోత్సహించే సైటోకైన్స్‌ను తగ్గిస్తుందన్నారు. విటమిన్‌ డి పనితీరును మెగ్నీషియం పెంపొందిస్తున్నట్టు గుర్తించారు. బి12 విటమిన్‌ రోగనిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు. ‘‘కొవిడ్‌ చికిత్సలో వైర్‌సను నిర్మూలించడంపైనే దృష్టిపెడుతున్నారు. సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ నియంత్రణ(కీలక అవయవాలు వాపునకు గురికావడం) వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకు డి, బి12, మెగ్నీషియం దోహదం చేస్తాయి’’ అని వారు స్పష్టం చేశారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు ఈ విటమిన్‌ చికిత్సతో కరోనా మరణాలను నియంత్రించవచ్చని, రోగుల పరిస్థితి విషమించకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన జాతీయ ఆరోగ్య సేవల సంస్థ(ఎన్‌హెచ్‌ఎస్‌) కిందటి సంవత్సరం చేసిన అధ్యయనంలో భాగంగా.. 500 మంది కొవిడ్‌ పేషెంట్ల నుంచి రక్తనమూనాలను పరీక్షించింది.


డి-విటమిన్‌ తక్కువగా ఉన్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత, మరణించే ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. బి12 విటమిన్‌.. వైరస్‌ ప్రొటీన్లలో ఒకదానికి అతుక్కుని, ఆ వైరస్‌ తనను తాను రెట్టింపు (రెప్లికేషన్‌) చేసుకోకుండా ఆపుతున్నట్టు అభిప్రాయపడింది. గతేడాది అక్టోబరు 20న ‘క్లినికల్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం’ జర్నల్‌లో ఒక ఆసక్తికర అధ్యయనం ప్రచురితమైంది. 216 మంది కొవిడ్‌ పేషెంట్ల రక్తనమూనాలను పరీక్షించగా.. 80శాతానికి పైగా డి విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ పరిశోధకులు 10 దేశాలకు (చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, యూకే) సంబంధించిన కరోనా పేషెంట్ల సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించగా.. విటమిన్‌ డి తక్కువ ఉన్నవారిలో రోగనిరోధకవ్యవస్థ అతిగా స్పందించడాన్ని గమనించారు. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్లనే సైటోకైన్‌ స్టార్మ్‌ వచ్చి ప్రాణాలకు పెనుముప్పు కలుగుతోంది.


- సెంట్రల్‌ డెస్క్‌