హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2022-09-29T06:28:41+05:30 IST

అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా నిర్మించలేని వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎస్సార్‌ పేరు ఎలా పెడుతుందని టీడీపీ అనకాపల్లి ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, నియోజకవర్గం పరిశీలకుడు బొర్రా నాగరాజు ప్రశ్నించారు.

హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఆందోళన
రిలే నిరాహారదీక్షలో మాట్లాడుతున్న పీలా గోవింద

ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసింది

షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడుతుంటే చోద్యం చూస్తున్న మంత్రి అమర్‌

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు పీలా గోవింద, బొర్రా నాగరాజు ధ్వజం


అనకాపల్లిఅర్బన్‌, సెప్టెంబరు 28: అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా నిర్మించలేని వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎస్సార్‌ పేరు ఎలా పెడుతుందని టీడీపీ అనకాపల్లి ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, నియోజకవర్గం పరిశీలకుడు బొర్రా నాగరాజు ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం నెహ్రూచౌక్‌లో నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతున్నదని, పోలీసులను అడ్డంపెట్టుకుని విపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. పరిశ్రమల శాఖ మంత్రి అయిన అమర్‌నాథ్‌, తన సొంత జిల్లాలో చక్కెర కర్మాగారాలు మూతపడుతుంటే చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే మూడు రాజధానుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులుంటే 20 కోట్లకుపైగా జనాభా వున్న ఉత్తరప్రదేశ్‌కు ఎన్ని రాజధానులు ఉండాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు మెడికల్‌ కాలేజీల మాత్రమే మంజూరయ్యాయని, అంతకంటే ఎక్కువ మంజూరైనట్టు నిరూపణ చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, లేకుంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని మంత్రి అమర్‌నాథ్‌కు గోవింద సత్యనారాయణ సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, బీసీ సాధికార కన్వీనర్‌ మళ్ల సురేంద్ర, నాయకులు బీఎస్‌ఎంకే జోగినాయుడు, మాదంశెట్టి నీలబాబు, పచ్చికూర రాము, సబ్బవరపు గణేష్‌, పోలారపు త్రినాథ్‌, ఎల్లంకి సత్తిబాబు, అక్కిరెడ్డి రమణబాబు, మరపురెడ్డి సత్యనారాయణ (ఎంఎస్‌ఎన్‌), మువ్వల అప్పలనాయుడు, దాడి జగన్‌, ఆకుల నానాజీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T06:28:41+05:30 IST