ఈ సమయంలో బరువు పెరగకుండా...

ABN , First Publish Date - 2020-04-18T05:33:27+05:30 IST

‘లాక్‌డౌన్‌’ సమయంలో శారీరక శ్రమ బాగా తగ్గింది. తినడం ఎక్కువైపోయింది. సో... బరువు పెరగకుండా తక్కువ క్యాలరీస్‌ ఉన్న ఆహారం....

ఈ సమయంలో బరువు పెరగకుండా...

‘లాక్‌డౌన్‌’ సమయంలో శారీరక శ్రమ బాగా తగ్గింది. తినడం ఎక్కువైపోయింది. సో... బరువు పెరగకుండా తక్కువ క్యాలరీస్‌ ఉన్న ఆహారం చెప్పండి.

-హిమజ


నిజమే... ఈ పరిస్థితుల్లో బరువు పెరిగే ఛాన్స్‌ ఎక్కువ. తక్కువ క్యాలరీస్‌ ఉండే ఆహారం కన్నా, మొత్తంగా మనం తినే ఆహారమంతా కలిపి 1500-1600 క్యాలరీలకు మించకుండా ఉంటే బరువు 


పెరగకుండా ఉండొచ్చు. దీనికి మంచి స్ట్రాటజీ ఏమిటంటే... రెండు పూటలు మాత్రమే తినడం. మిగిలిన సమయంలో ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం. ఈ డైట్‌ను అనుసరిస్తే బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఉదయం 8 : బ్లాక్‌ కాఫీతో పాటు రెండు వాల్‌నట్స్‌, పది ఎండుద్రాక్షలు తినాలి.

ఉదయం 10 గంటలకు: పప్పుతో రెండు చపాతీలు, ఒక గ్లాస్‌ మజ్జిగ తీసుకోవాలి. చపాతీకి బదులుగా రెండు ఇడ్లీ, సాంబారు లేదంటే రెండు పెసరట్లు తినొచ్చు. రెండు దోశెలు లేదా ఒక కప్పు ఉప్మా మరో ఆప్షన్‌. వీటిని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే బాగుంటుంది.

మధ్యాహ్నం 1 : ఒక గ్లాస్‌ రాగి జావ (మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం కలిపి), గుప్పెడు పల్లీలు తినాలి. రాగి జావ బదులు చిక్కటి మజ్జిగలో ఒక స్పూను సబ్జా గింజలు తీసుకోవచ్చు. లేదంటే డ్రైఫ్రూట్స్‌ నానబెట్టి ఒక కప్పు పాలతో స్మూతీలాగా గ్రైండ్‌ చేసుకుని తాగొచ్చు. నిమ్మరసం, మజ్జిగ, మిర్చి కలిపిన ఉప్మా రవ్వ జావ కూడా బాగుంటుంది.

సాయంత్రం 4 గంటలకు: అరటిపండు సాయంత్రం 6 గంటలకు: ఒక కప్పు అన్నానికి పెసరపప్పు సోరకాయ (ఇతర కూరగాయలు పెసరపప్పులో కలపొచ్చు) కర్రీలో ఒక టీ స్పూను నెయ్యి వేసుకుని తిన్న తర్వాత, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మరసం కలిపిన గ్లాసు మజ్జిగ తీసుకోవాలి.

రాత్రి 9 గంటలకు: పసుపు, మిరియాలు కలిపిన ఒక కప్పు పాలు. ఇలా సింపుల్‌గా ఆహారం తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాగూ ఇంటి పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి, కొంత శక్తి కరిగిపోతుంది. మిగతా క్యాలరీలను వ్యాయామాలతో కరిగించొచ్చు.




డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com

Updated Date - 2020-04-18T05:33:27+05:30 IST