కడప దాటని దోమ తెరలు

ABN , First Publish Date - 2020-12-04T06:30:29+05:30 IST

మలేరియా ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రసాయన దోమ తెరలు ఇంకా లబ్ధిదారులకు అందకుండా ఉన్నాయి.

కడప దాటని దోమ తెరలు
కడప గోదాంలో ఉంచిన అనంత జిల్లా దోమతెరలు

15 రోజులైనా జిల్లాకు రాని రసాయన దోమతెరలు 

ఎదురు చూస్తున్న 178 గ్రామాల్లోని 75100 కుటుంబాలు

జిల్లా వైద్యశాఖ తీరుపై విమర్శలు

అనంతపురం వైద్యం, డిసెంబరు 3: మలేరియా ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రసాయన దోమ తెరలు ఇంకా లబ్ధిదారులకు అందకుండా ఉన్నాయి. మలేరియా వ్యాపింపజేసే దోమల నుంచి రక్షణ కోసం గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా రసాయన దోమతెరలు అందజేశారు. వీటి ప్రభావం మూడు సంవత్సరాల వరకూ ఉంటుంది. 2017లో 178 గ్రామాలలో 67900 దోమతెరలు సరఫరా చేశారు. ఇప్పుడు మూడేళ్లు కావడంతో అదే 178 గ్రామాల్లో 75100 కుటుంబాలకు దోమతెరలు మంజూరు చేశారు. జిల్లాలోని ముట్టాల, ఆలమూరు, రుద్రంపేట, ఎంపీఆర్‌ డ్యామ్‌, ఇప్పేరు, జల్లిపల్లి, గొందిరెడ్డిపల్లి, ఆకులేడు, వెంకటాపురం, ఎద్దులపల్లి రామగిరి, చుక్కలూరు, పెడబల్లి, తల్లాకాలవ, రాచినేపల్లి, గూనిపల్లి, పాముదుర్తి, మల్లాపల్లి, పాలసముద్రం, పూలేరు, అబ్బేపల్లి, ముత్తవకుంట్ల, నార్శింపల్లి, పేరూరు, రామగిరి, షేక్షాన్‌పల్లి, రాకెట్ల, పందికుంట, వీపీపీతండ ఆరోగ్య ఉపకేంద్రాల  పరిధిలోని 178 గ్రామాలకు ఈ దోమతెరల ను పక్షం రోజుల కిందట మంజూరు చేశారు. వీటిని రాష్ట్ర శాఖ ప్రాంతీయ కార్యాలయం ఉన్న కడపకు పంపించా రు. ఇందులో డబుల్‌ సైజ్‌ దోమ తెరలు 12100, ఫ్యామిలి సైజ్‌ దోమతెరలు 53900, సింగిల్‌ సైజ్‌ దోమతెరలు 9100 ఉన్నాయి. అయితే 15 రోజులు అవుతున్నా ఆ దోమ తెర లు కడప గడప దాటకుండా ఉండిపోయాయి. కడప నుంచి అనంతకు తీసుకురావడానికి అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.  ఓవైపు వర్షాలు కురవడంతో దోమ లు పెరిగాయి. మలేరియా, డెంగీ కేసులు అధికమవుతు న్నాయి. ఇలాంటి పరిస్థితిలో వైద్యాధికారులు  నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం 

దోమతెరలు వచ్చిన విషయం వాస్తవమే. సంబంధిత కాంట్రాక్టర్‌ కడప వరకు పంపించారు. అక్కడ నుంచి మమ్మలను తీసుకుపోవాలని చెప్పారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల కిందట తుఫాన్‌ వల్ల కొంత ఆలస్యం అయింది. ఇప్పటికే డీఎంహెచ్‌ఓతో కూడా మాట్లాడాం. తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

-  డాక్టర్‌ దోశారెడ్డి, జిల్లా మలేరియా నివారణాధికారి

Updated Date - 2020-12-04T06:30:29+05:30 IST