వచ్చే నెలలో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌

ABN , First Publish Date - 2022-01-22T06:37:05+05:30 IST

రాష్ట్రంలో హెల్త్‌ ప్రొపైల్‌ను రూపొందించడం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌గా సిరిసిల్ల, ములుగు జిల్లాలను ఎంపిక చేసినట్లు, ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

వచ్చే నెలలో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌
కేంద్ర మంత్రులకు రాసిన లేఖలను చూపుతున్న మంత్రి కే తారకరామారావు

  - సిరిసిల్ల, ములుగు జిల్లాలు ఎంపిక 

  - కొవిడ్‌ నియంత్రణకు సర్వం సన్నద్ధం 

-  థర్డ్‌వేవ్‌లో  తీవ్రత లేదు

- జిల్లాలో ‘మన ఊరు.. మన బడి’

 - మార్చి 31లోగా దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక 

- మంత్రి కే తారకరామారావు 

- కలెక్టరేట్‌లో వివిధ శాఖల సమీక్ష 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రాష్ట్రంలో హెల్త్‌ ప్రొపైల్‌ను రూపొందించడం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌గా సిరిసిల్ల, ములుగు జిల్లాలను ఎంపిక చేసినట్లు, ఫిబ్రవరిలో లాంఛనంగా  ప్రారంభించనున్నట్లు  పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.  శుక్రవారం   జిల్లా  కలెక్టరేట్‌ సముదాయంలో వైద్య ఆరోగ్య శాఖ, విద్య, ఎస్సీ కార్పొరేషన్‌, మున్సిపల్‌ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డేతోపాటు అయా శాఖల జిల్లా అధికారులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతీ వ్యక్తి హెల్త్‌ రికార్డ్‌ డిజిటలైజేషన్‌ చేయడమే ప్రాజెక్టు  ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ  సన్నద్ధంగా ఉన్నాయని,  పాజిటివ్‌ వచ్చినా రెండో దశలో ఉన్న తీవ్రత థర్డ్‌వేవ్‌లో లేదని అన్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండోదశలో ఉన్న తీవ్రత ఈసారి కనిపించడం లేదని,  ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. వేములవాడలో వంద పడకల ప్రారంభించిన తర్వాత  సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిపై భారం తగ్గిందని అన్నారు. రెండో దశలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన వైద్య సిబ్బందిని నియమించినట్లు, అవసరమైతే  ఈ సారి కూడా  అదే పద్ధతిన  సిబ్బందిని కోవడానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌,  కలెక్టర్‌కు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు.  వేములవాడలోని ఆస్పత్రిలో ఫిబ్రవరిలో సీటీ స్కాన్‌ మిషన్‌, ఆక్సిజన్‌ లిక్విడ్‌ ట్యాంక్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు.  వ్యాక్సినేషన్‌లో సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందన్నారు. ఫస్ట్‌డోస్‌ వంద శాతం, రెండో డోసు 86 శాతం పూర్తయ్యిందని, 14 శాతం కూడా పూర్తిచేయాలని ఆదేశించారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్‌ల బూస్టర్‌ డోస్‌  ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పోలీస్‌, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల్లో 3784 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 880 మందికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 1.55 లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే చేయడానికి 479 బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  రానున్న ఐదు రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అనే పరిస్థితి నుంచి ‘నేను సర్కారు దవాఖానాకు పోతాను’ అనే విశ్వాసాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం సామాన్యుల్లో నింపిందన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంపై సిబ్బందిని అభినందించారు.  . 

 మూడు దశల్లో పాఠశాలల అభివృద్ధి 

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేబినేట్‌లో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని,  రాష్ట్రంలో 26 వేల పాఠశాలలకు రూ.7289 కోట్లు మంజూరు చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలో 510 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పించనున్నట్లు చెప్పారు.  ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్‌ బోధన అందుబాటులోకి వస్తుందన్నారు. 

దళితులకు భరోసా

దళిత బంధుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31లోపు నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలను సంప్రదించి అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఫ్రిబవరి, మార్చిలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.  దీని ద్వారా దళిత సమాజంలో పథకంపై స్పష్టత, ఒక విశ్వాసం వస్తాయన్నారు. డబ్బులు వృఽథా కాకుండా నిరంతరం ఉపాధిని ఇచ్చే యూనిట్లపై అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. 

సిరిసిల్ల బల్దియాలో అభివృద్ధి పనులపై ఆరా 

సిరిసిల్లమున్సిపల్‌ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. మండెపల్లిలో సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు   పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు.   ఫిర్యాదులు ఉంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి రగుడు జంక్షన్‌ వరకు ఫోర్‌లైన్‌ను త్వరగా ప్రారంభించి జూన్‌లోగా పూర్తి చేయాలన్నారు. రాజీవ్‌నగర్‌లో రూ .3 కోట్ల వ్యయంతో 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కొత్త చెరువు సుందరీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఉన్న స్థలంలో ఇండోర్‌ స్పోర్ట్స్‌ స్టేడియం, కలెక్టరేట్‌ సమీపంలో జాతీయ స్థాయి స్టేడియం నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. 300 ఎకరాల్లో నిర్మించబోయే ఆక్వాహబ్‌కు భూ సేకరణ పూర్తి చేయాలన్నారు.   సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, డాక్టర్‌ మురళీధర్‌రావు, డాక్టర్‌ మహేష్‌రావు, డాక్టర్‌ మీనాక్షి, డాక్టర్‌ మహేష్‌, తదితరులు ఉన్నారు.



Updated Date - 2022-01-22T06:37:05+05:30 IST