Advertisement
Advertisement
Abn logo
Advertisement

కారణాలు కడుపులోనే..

‘హోటల్‌ భోజనం పొట్టకు చేటు!’. అనుకునే రోజులు పోయాయి!. పొగలు కక్కే చికెన్‌ ముక్కలు, పిజ్జాలు, బర్గర్లు నోరూరిస్తుంటే....ఇంటి భోజనంతో సరిపెట్టుకోవడం ఎవరి తరం?. అయితే ఇలాంటి ఫాస్ట్‌ ఫుడ్‌తో ఆరోగ్యం కూడా అంతే ఫాస్ట్‌గా అటకెక్కుతుంది అంటున్నారు వైద్యులు!


తేలికగా జీర్ణమై శోషణ చెంది, శక్తి అందించేదే ఆరోగ్యకరమైన పౌష్టికాహారం. ఇంట్లో వంట అలాంటిదే! మేలురకం వంట నూనెలు, తాజా కూరగాయలు, శుభ్రమైన వంటగదిలో వండిన వంటకాలు ఆరోగ్యకరమైనవి. కానీ హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. పదే పదే ఒకే నూనెలో వేయించడం, నిల్వ చేసిన కూరగాయలు, మాంసం వాడడం, కృత్రిమ రుచులు జోడించడం, ప్రాసె్‌సడ్‌ ఫుడ్‌ వాడకం ఇక్కడ సర్వసాధారణం. అలాగే చీజ్‌, బటర్‌, మయొనీస్‌, కెచప్స్‌, సోయా సాస్‌, అజినమోటో లాంటి రుచిని పెంచే పదార్థాలు వాడడం, చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలను ఆహారానికి జత చేయడం ఫాస్ట్‌ ఫుడ్‌లో భాగం. ఇవన్నీ ఆరోగ్యానికి, మరీ ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు చేటు చేసేవే! ఇలాంటి ఆహారంతో పలు రకాల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరం, నొప్పి, విరోచనాలు, వాంతులు... ఇలా చెప్పుకుంటూపోతే  బోలెడన్ని సమస్యలు. అయితే ఇవన్నీ ఏదో ఓ సందర్భంలో ప్రతి ఒక్కరినీ వేధించేవే అయినా, నిర్లక్ష్యం చేస్తే తిరిగి సరిదిద్దలేని శాశ్వత సమస్యలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి  జీర్ణసంబంధ సమస్యల మీద ఓ కన్నేసి ఉంచాలి. ఈ సమస్యలకు రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే...


ఆ నూనెల మూలంగా...

జంక్‌ ఫుడ్‌లో వాడే పదార్థాలు, అవి తయారయ్యే విధానం... రెండూ ఆరోగ్యానికి హాని కలిగించేవే! రెస్టారెంట్లు, హోటళ్లలో ఒకే నూనెను పదే పదే మరిగిస్తూ ఉంటారు. అలా మరిగించడం మూలంగా ఆ నూనెల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ తయారవుతాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి జీర్ణవ్యవస్థతో పాటు గుండెకూ చేటు చేస్తాయి.


ఆ బ్యాక్టీరియా వల్లే...

అశుభ్రమైన పదార్థాలు, అశుభ్రమైన పరిసరాల్లో ఈ బ్యాక్టీరియా ప్రబలుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలను కలుగజేసే సూక్ష్మజీవి ఇదొక్కటే! గ్యాస్ట్రిక్‌, డియోడినమ్‌ అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ కేన్సర్‌ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా పొట్టలో చేరితే అవసరానికి మించి ఎక్కువగా యాసిడ్‌ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాంతో యాసిడ్‌తో సంబంధం ఉన్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కడుపులో మంట, కడుపు ఉబ్బరం, త్రేన్పులు కనిపిస్తాయి.


పేగు పూసిందా?

ఎక్కువ శాతం జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలన్నీ జంక్‌ ఫుడ్‌ మానుకున్న కొన్ని రోజుల్లోనే అదుపులోకి వస్తాయి. కేవలం హెలికోబ్యాక్టర్‌ పైలోరీతో ఏర్పడిన ఇన్‌ఫెక్షన్‌ ఒక్కటే ఒకసారి సోకితే, దీర్ఘకాలం పాటు చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పేగు పూత (ఐ.బి.డి) ఒకసారి తలెత్తితే జీవితాంతం మందులు వాడవలసి ఉంటుంది.


కడుపు ఉబ్బరమా?

ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ (ఐ.బి.ఎస్‌) జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యే అయినా ఆహారశైలి వల్ల కాకుండా, ఒత్తిడి లాంటి మానసిక కారణాల మూలంగా తలెత్తుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు లాంటివి ప్రధానంగా కనిపిస్తాయి. వీరిలో పొట్టలో కదలికలు తక్కువగా లేదా ఎక్కువగా ఉంటాయి. కడుపులో నొప్పి కూడా ఉంటుంది. జీవనశైలి మార్పులతో ఈ సమస్యను అదుపు చేసుకోవచ్చు.


ఇలా ఎందువల్ల?

అజీర్తి, వికారం, మలబద్ధకం లాంటి జీర్ణసంబంధ సమస్యలు ప్రతి ఒక్కరిలో అడపా దడపా కనిపించేవే! అయితే అవి అరుదుగా కాకుండా, పదే పదే కనిపిస్తూ ఉంటే జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న సమస్యగానే భావించాలి. లక్షణాల పరంగా రుగ్మతలను కనిపెట్టే ప్రయత్నం చేయాలి. 


ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌

దీన్నే పేగు పూత అంటారు. దీన్లో అల్సరేటివ్‌ కొల్టైటిస్‌, క్రోన్స్‌ డిసీజ్‌ అనే రెండు రకాలుంటాయి. మొదటిది పెద్ద పేగులో వచ్చే సమస్య అయితే, రెండవది చిన్న, పెద్ద పేగులు రెండిటికీ కలిపి ఉండవచ్చు. ఎక్కువ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉన్న పదార్థాలు తినడం మూలంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో శబ్దాలు, నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు, జ్వరం, బరువు తగ్గిపోవడం, రక్తహీనత ఈ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణాలు.


ఛాతీలో మంట

తిన్న వెంటనే ఛాతీలో మంట ఎసిడిటీకి సంబంధించిన లక్షణం! తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, అత్యధికంగా కొవ్వులు లేదా తీపి కలిగిన పదార్థాలు తినడం ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, అన్నవాహికలోకి తన్నుకొని వచ్చే యాసిడ్‌ మూలంగా అన్నవాహిక పైపొరలోని కణాల స్థానంలో కొత్త కణాలు తయారవుతాయి. అవి క్రమేపీ కేన్సర్‌ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. 


కాలేయ ఇన్‌ఫెక్షన్‌

భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం, అశుభ్రమైన పదార్థాలతో వంటకాలు తయారవడం మూలంగా హెచ్‌.పైలోరీ బ్యాక్టీరియా శరీరంలో చేరుకుంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి తేలికగా సోకుతుంది. ఈ బ్యాక్టీరియా ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌’ అనే సమస్యను కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఈ సమస్య కాలేయాన్ని తిరిగి సరిదిద్దలేనంత తీవ్రంగా దెబ్బతీస్తుంది.


పైల్స్‌ అండ్‌ ఫిషర్స్‌

మలబద్ధకం, ఆహారంలో పీచుపదార్థాలు లోపించడం ఇందుకు ప్రధాన కారణం. జంక్‌ ఫుడ్‌లో ఎక్కువగా నూనెలు, మైదా, చీజ్‌, తక్కువ కూరగాయలు ఉంటాయి. దాంతో సుఖ విరేచనం కష్టం అవుతుంది. ఫలితంగా పురీషనాళం చీరుకుపోయి ఫిషర్స్‌, పైల్స్‌ ఏర్పడతాయి. ఆహారంలో మార్పులు చేసుకుంటే సర్జరీ లేకుండానే సమస్యలను తగ్గించుకోవచ్చు. 


విషాహారం

కలుషిత ఆహారం తినడం మూలంగా వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. కడుపులో నొప్పి కూడా ఉంటుంది. ఇందుకు కారణం వైర్‌సలు, బ్యాక్టీరియాలు కలిపి జీర్ణవ్యవస్థను అతలాకుతలం చేయడమే!


స్టమక్‌ అల్సర్‌

హెచ్‌ పైలోరి బ్యాక్టీరియా కారణంగా చిన్న పేగులో లేదా జీర్ణాశయంలో అల్సర్‌ వస్తుంది. తిన్న వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నొప్పి ఉండవచ్చు. వాంతి వచ్చినట్టు అనిపించడం, మరీ ముఖ్యంగా ఉదయాన్నే కడుపులో నొప్పితో నిద్ర మెలకువ రావడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. 


స్టమక్‌ కేన్సర్‌

హెచ్‌. పైలోరి బ్యాక్టీరియా దీర్ఘకాలికంగా శరీరంలో ఉంటే, పొట్ట కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అల్సర్‌తో మొదలై క్రమేపీ కేన్సర్‌గా పరిణమిస్తుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.


సొంత వైద్యం మానుకోవాలి!

సాధారణంగా జీర్ణసంబంధ సమస్యలకు సొంత వైద్యం మీదే ఆధారపడుతూ ఉంటాం. అసిడిటీ, పొట్టలో నొప్పి, విరోచనాలు లాంటి సమస్యలకు మందుల షాపులో మాత్రలు కొని వాడేస్తూ ఉంటాం. కానీ ఎంతో అరుదుగా తప్ప ఇలా సొంత వైద్యం మీద ఆధారపడడం క్షేమం కాదు. నెలలో ఒకసారి లేదా రెండు సార్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతూ ఉంటే, తప్పనిసరిగా వైద్యులను కలవాలి. యాంటీ బయాటిక్స్‌ వాడడం అలవాటు చేసుకోవడం వల్ల యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడి శరీరం మందులకు స్పందించే గుణం కోల్పోతుంది. ఇది మరింత ప్రమాదకరం.


- డాక్టర్‌ కె. సోమశేఖర్‌,

గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌,

హైదరాబాద్‌

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement