వైద్యం.. దైన్యం!

ABN , First Publish Date - 2021-09-14T05:30:00+05:30 IST

జిల్లా ప్రజలు జ్వరాలతో గజగజలాడిపోతున్నారు... ప్రతి ఇంటిని వైరల్‌ జ్వరాలు చుట్టుముట్టాయి.

వైద్యం.. దైన్యం!
జీజీహెచ్‌లో బెడ్లు ఖాళీ లేక కింద పడుకున్న రోగులు

జ్వరం వస్తే గజగజ..

పీహెచ్‌సీల్లోని ల్యాబ్‌లో ఒక్క మలేరియాకే పరీక్షలు

డెంగ్యూ అనుమానిత నమూనాలు గుంటూరుకు..

ఆ ఫలితాలు రావడానికి మూడురోజుల సమయం

ఆరోగ్య కేంద్రాల ల్యాబ్‌లలో టెక్నీషియన్ల కొరత

ప్రైవేటు ల్యాబ్‌ల్లో వేలకు వేలు ఖర్చు

సామాన్యుడికి జ్వరం వస్తే జేబులు గుల్లే!

గుంటూరు జీజీహెచ్‌లో బెడ్లూ కరువు

వణికిస్తున్న సీజనల్‌ జ్వరాలు

అప్రమత్తం కాని ప్రభుత్వ యంత్రాంగం



సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. జ్వరాలు వణికిస్తున్నాయి.. ఈ సమయంలో సామాన్యుడికి సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా ఏది కరోనానో.. ఏది మామూలు జ్వరమో తెలియక సతమతమవుతున్నారు. ఇందుకోసం పీహెచ్‌సీలకు వెళితే అక్కడ ఒక్క మలేరియా టెస్టు మాత్రమే చేస్తున్నారు. బయట ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవాలంటే వేలకువేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 14: జిల్లా ప్రజలు జ్వరాలతో గజగజలాడిపోతున్నారు... ప్రతి ఇంటిని వైరల్‌ జ్వరాలు చుట్టుముట్టాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. రోగులకు పారాసిటమాలే దిక్కవుతుంది. సాధారణ రక్త పరీక్షలు అన్నీ పీహెచ్‌సీల్లో అందుబాటులో లేవు. డెంగ్యూ నిర్ధారణకు నమూనాలు గుంటూరుకు పంపుతున్నారు. దీంతో చాలామంది ప్రైవేటు ల్యాబ్‌లలో టెస్టులు చేయించుకుంటున్నారు.  సామాన్యుడికి ఇది పెనుభారంగా మారింది. పీహెచ్‌సీలలో వైద్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. గుంటూరు జీజీహెచ్‌లోనే బెడ్లు రోగులు నేలపై పడుకుంటున్నారంటే.. ఇక మామూలు పీహెచ్‌సీలలో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులపై గ్రౌండ్‌ రిపోర్టు ఇది..

  - తెనాలి మండలంలోని కొలకలూరు, సంగంజాగర్లమూడి పీహెచ్‌సీ సెంటర్‌లలో  ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. కొలకలూరు పీహెచ్‌సీ సెంటర్‌లో మాత్రం  సాధారణ రక్తపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఆర్‌ఎంపీ డాక్టర్లను సంప్రదించి వైద్య సేవలు పొందుతున్నారు. 

- పొన్నూరు మండలం మన్నవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్‌లో మైక్రోలెన్స్‌ పాడైపోయాయి. దీనివల్ల టెస్ట్‌లు చేయటం ఆలస్యం అవుతోంది. పాత పద్ధతిలో టెస్టులు చేయడంతో రోజుకు 20 ఫలితాలు కూడా రావడం లేదు. ఫార్మాసిస్ట్‌ మందులు జాగ్రత్త పరుచుకోవటానికి ప్రత్యేక గదిలేదు. 

 - వేమూరు నియోజకవర్గంలో 11 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో పనిచేసే కొందరు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. చుండూరు మండలం, యడ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రక్త పరీక్షల విభాగం లేదు.  

 - గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో మలేరియాకు ఒక్కదానికే టెస్టులు చేసే కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. గత కొద్దిరోజులుగా ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న జ్వరపీడితుల ఓపీల సంఖ్య పెరుగుతోంది. 

 - సత్తెనపల్లి మండలం ఫణిదం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ల్యాబ్‌ ఉన్నప్పటికీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేడు. ఉన్న ఆరోగ్యసిబ్బందికే కొద్దిరోజులు శిక్షణ ఇప్పించి వారిచేత రక్తపరీక్షలు చేయిస్తున్నారు. రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఒక్క మలేరియా పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు.  

- మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోజుకు సుమారు 500 ఓపీలు వరకు వస్తున్నాయి. ఇందులో సుమారు 200 మంది జ్వరపీడితులే ఉంటున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఒక్కరే ఉన్నారు. కారంపూడి మండలంలోని గాదేవారిపల్లె పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌, రెండు అటెండరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

- బాపట్ల, కర్లపాలెం, పిట్టవానిపాలెం మండలాలలో సీజనల్‌ వ్యాధులు విస్తృతంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా ప్రబలుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన పరీక్షలు ఆరోగ్యకేంద్రాల్లోని ల్యాబ్‌లలో అందుబాటులో లేవు. దీనివల్ల ప్రైవేటు ల్యాబరేటరీలను ఆశ్రయించాల్సి వస్తోంది.

 - చిలకలూరిపేట మండలం కావూరు, నాదెండ్ల మండలంలో గణపవరం, నాదెండ్ల, యడ్లపాడు మండలంలో యడ్లపాడులో మొత్తం 4 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీలలో సరైన ల్యాబ్‌ సౌకర్యాలు లేవు. యడ్లపాడు పీహెచ్‌సీలో షుగర్‌, మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. చికెన్‌గున్యా, వైరల్‌ జ్వరాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడంలేదు. వాటికి సంబంధించిన పరీక్ష కిట్‌లు కూడా అందుబాటులో లేవు. 

  - పెదకూరపాడు నియోజక వర్గంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేట్‌ వైద్యశాలల్లోనే జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. క్రోసూరు పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చే రోగులు బయట పరీక్షలు చేయించు కోవాల్సి వస్తుంది.  

- మంగళగిరి తాలూకా ఆసుపత్రితో పాటు పెదవడ్లపూడి, నూతక్కి, తాడేపల్లి, దుగ్గిరాలలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు వున్నాయి. వీటిలో ల్యాబ్‌లు, టెక్నీషియన్లు అందుబాటులో వున్నప్పటికీ... డెంగ్యూ నిర్ధారణ పరీక్షలను మాత్రం చేయడం లేదు. మలేరియాశాఖ సిబ్బంది అనుమానితుల రక్తనమూనాలను సేకరించి గుంటూరు వైద్యకళాశాలకు పంపించి పరీక్షా ఫలితాలను మరుసటిరోజుకు తెప్పిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆగస్టు నుంచి ఇప్పటివరకు మొత్తం అధికారికంగా 38 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.. 

 - రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో లాబ్‌ టెక్నీషియన్‌ బదిలీపై నగరం వెళ్ళారు. ఇప్పటి వరకు లాబ్‌ టెక్నీషియన్‌ను నియమించలేదు. దీంతో ప్రైవేటు లాబ్‌లకు వెళ్లి వందలాది రూపాయలు వెచ్చించి చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

- వినుకొండ ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులైన మలేరియాకు మాత్రమే రక్తపరీక్షలు జరుగుతున్నాయి. గతంలో ఒక ప్రైవేటు సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో రక్తశాంపిల్స్‌ తీసుకొని కామెర్లు కాని, మిగతా పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నూజెండ్ల మండలంలో రక్తపరీక్షలు చేసే టెక్నీషియన్‌ శిక్షణలో ఉండటం వల్ల ల్యాబ్‌ మూతపడింది. ఈపూరు మండలంలో టైఫాయిడ్‌కు, డెంగ్యూ పరీక్షలు కూడా చేయడం లేదని రోగులు చెబుతున్నారు. 

    



జీజీహెచ్‌లో నేలపైనే రోగులు

గుంటూరు(జీజీహెచ్‌): గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ బాధితుల పరిస్థితి  దయనీయంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలువుదోపిడీకి తట్టుకోలేక ఇక్కడికి వస్తే కనీసం బెడ్డు దొరకడం లేదు. బెడ్లు చాలక స్ర్టెక్చర్లపైనే పడుకోబెడుతున్నారు.. అవీ చాలక పోవడంతో కొంతమందికి నేలే దిక్కయింది. జనరల్‌ మెడిసిన్‌ 102, 103 వార్డులను జ్వర పీడితులకు కేటాయించారు. మూడు రోజులుగా రోగుల సంఖ్య పెరుగుతున్నా మరో వార్డును  కేటాయించలేదు. కొందరు బాధితులు ఆదివారమే చేరినప్పటికీ మంగళవారం ఉదయం వరకు కూడా బెడ్లు కేటాయించలేకపోయారు. మిగిలిన కొన్ని వార్డుల్లో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

 

  వైరల్‌ మందుల కొరత 

 జిల్లాలో ఓ పక్క వైరల్‌ ఫీవర్లు కుదిపేస్తుంటే వ్యాపారులు కొందరు మందులు బ్లాక్‌  చేస్తున్నారు. ముఖ్యంగా మలేరియాకు వాడే ఫాల్‌సిగో-50ఎంజీ టాబ్లెట్లు రెండు రోజులుగా గుంటూరులో దొరకడం లేదు. వైద్యులకు కూడా అత్యధిక ధర చెల్లిస్తే తప్ప దొరకని పరిస్థితి.  డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దీనిపై దృష్టి సారించాలని వైద్యులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నిలిచిన పరీక్షలు

 కీలకమైన వైరల్‌ ఫీవర్లు జిల్లాలో పట్టిపీడిస్తున్న వేళ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లలో మరో సమస్య వెంటాడుతోంది. వారం రోజుల వరకు అపోలో ఫార్మసీ సిబ్బంది వైద్య పరీక్షలు చేసేవారు. వారి ఒప్పందం ముగిసిపోవడం, ప్రభుత్వం పొడిగించకపోవడంతో వారు వెళ్లిపోయారు. అదే సమయంలో ప్రభుత్వం కేటాయించిన సిబ్బంది మంగళవారం వరకు విధుల్లో చేరలేదు. దీంతో జిల్లాలోని 90 శాతం అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లలో రక్తపరీక్ష కోసం శాంపిల్‌ తీసే నాథుడు కూడా లేదు. 

 మలేరియా ఒక్కటే...

కొన్ని ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో కేవలం మలేరియాకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. డెంగ్యూ నిర్ధారణకు కనీసం మూడురోజుల సమయం పడుతోంది. పీహెచ్‌సీ నుంచి మెడికల్‌ కళాశాలకు వచ్చి మరలా ఫలితాలు వచ్చేటప్పటికి సమయం గడవడం వలన రోగి నీరసించి పోతుండటంతో ప్రైవేటు బాట పట్టి గుల్లయిపోతున్నారు. జీజీహెచ్‌లో ఎలీశా మెథడ్‌ మాత్రమే చేస్తారు.  


కానరాని ఆరోగ్యశ్రీ

డెంగ్యూ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సను అందించేందుకు ఒక్క నెట్‌వర్క్‌  ఆసుపత్రి కూడా ముందుకు రావడం లేదు. పేరుకే ఆరోగ్యశ్రీ ఉందని చెప్పడమే కానీ చికిత్సకు వచ్చేసరికి ప్రతి చోటా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని కొందరు, ఇచ్చే టారిఫ్‌ చాలడం లేదని మరికొందరు చెబుతున్నారు. దీంతో పేదలు ఆరోగ్యశ్రీకి వెసులుబాటు లేక, డబ్బులు కట్టుకోలేక ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు లేక విలవిలలాడిపోతున్నారు. 

 

 ప్రైవేటుకు వెళితే.. 

 ప్రభుత్వ వైద్యశాలల ల్యాబ్‌లలో పరీక్షలు లేవని, ప్రైవేటుకు వెళితే రోగికి తడిచిమోపడవుతోంది. ప్రైవేటులో కరోనా టెస్టుకు రూ.2,500, డెంగీ ర్యాపిడ్‌ టెస్ట్‌ 2,000, మలేరియా, టైఫాయిడ్‌కు రూ.500, బ్లడ్‌ కల్చర్‌ టెస్టులకు ప్లేట్‌లెట్లు, ఆర్‌బీసీ, ఎల్‌ఎఫ్‌టీ  వంటివాటికి రూ.5000 మొత్తం దాదాపు రూ.10వేలవుతోంది. డెంగీకి, కరోనాకు ఒకే వైద్యం చేయరాదని నిపుణులు చెబుతుండడంతో జ్వరం వస్తే అన్ని టెస్టులు చేయించుకోవలసి వస్తోంది. 

Updated Date - 2021-09-14T05:30:00+05:30 IST