ఆరోగ్య సూచీల్లో అగ్రస్థానంలో ఉండాలి

ABN , First Publish Date - 2022-04-04T10:16:50+05:30 IST

ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు..

ఆరోగ్య సూచీల్లో అగ్రస్థానంలో ఉండాలి

  • ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు పెరగాలి
  •  ప్రైవేటులో సిజేరియన్లను తగ్గించాలి
  • ఇక నుంచి నెలవారీ సమీక్ష  
  • 7న ‘ఉత్తమ’ సిబ్బందికి సన్మానం
  • అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆరోగ్యానికి పెద్దపీట వేశామన్నారు. రూ.11,237 కోట్లతో గత ఏడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశాలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, డీఎంహెచ్‌వోలతో మంత్రి హరీశ్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్‌ సెంటర్‌, పీహెచ్‌సీల వారీగా పురోగతిని సమీక్షించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో ఆశా, ఏఎన్‌ఎం, వైద్య అధికారుల నుంచి సమాధానాలు రాబట్టారు.


 వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. ఏఎన్‌సీ తనిఖీలు, కాన్పులు, ఎన్‌సీడీ కార్యక్రమం, వ్యాక్సినేషన్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌  మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా ఇతర ఇబ్బందులేవీ లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారం కూడా అవసరమని చెప్పారు. అందరం కలిసి పని చేయడం వల్లే ఎంఎంఆర్‌ సూచీలో తమిళనాడును అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నామన్నారు. ఇంతటితో ఆగకుండా అన్ని అంశాల్లో మొదటి స్థానానికి చేరడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలకు ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగదు ప్రోత్సాహంతో పాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని హరీశ్‌ తెలిపారు. ఇకపై మూణ్నెల్లకోసారి ఇలాంటి కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే పని చేయని వారిపై చర్యలూ ఉంటాయని హెచ్చరించారు.


ప్రైవేటులో సిజేరియన్లపై దృష్టి

ఏఎన్‌సీ తనిఖీలు సక్రమంగా నిర్వహించాలని, గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెలా అన్ని అంశాల మీద సమీక్ష ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు నివేదికలతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు ఎక్కువగా క్షేత్రస్థాయి సందర్శనలు చేయాలని మంత్రి సూచించారు. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణలు వారానికో జిల్లాకు వస్తారని, ఆకస్మిక తనిఖీలు చేస్తారని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.


ఎన్‌హెచ్‌ఎంపై సమీక్ష

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి హరీశ్‌ వీడియా కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. తల్లీబిడ్డల ఆరోగ్యం, మిడ్‌ వైఫరీ, జాతీయ నాణ్యతా హామీ కార్యక్రమం, బస్తీ దవాఖానాలు, 108, కేసీఆర్‌ కిట్లు, టి-డయాగ్నోస్టిక్స్‌, ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌, టీబీ, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు, తదితర విభాగాల పురోగతిని పరిశీలించారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి వల్ల సీజనల్‌ వ్యాధులు చాలా తగ్గాయన్నారు. రాష్ట్రాన్ని మలేరియా రహితంగా తీర్చిదిద్దాలని ఈసందర్భంగా నిర్దేశించారు.  

Updated Date - 2022-04-04T10:16:50+05:30 IST