సిరి సంపదల కన్నా.. ఆరోగ్యం మిన్న

ABN , First Publish Date - 2021-06-22T04:27:20+05:30 IST

సిరి సంపదల కన్నా, ఆరోగ్యమే మిన్న అని సిద్దిపేట జడ్పీచైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ తెలిపారు.సిరి సంపదల కన్నా, ఆరోగ్యమే మిన్న అని సిద్దిపేట జడ్పీచైర్‌పర్సన్‌ సిరి సంపదల కన్నా, ఆరోగ్యమే మిన్న అని సిద్దిపేట జడ్పీచైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ తెలిపారు.

సిరి సంపదల కన్నా.. ఆరోగ్యం మిన్న
కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆయూష్‌ వైద్యులు

సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

యోగా సాధనతో మెరుగైన ఆరోగ్యం : హరీశ్‌రావు


సిద్దిపేటటౌన్‌, జూన్‌21: సిరి సంపదల కన్నా, ఆరోగ్యమే మిన్న అని సిద్దిపేట జడ్పీచైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ తెలిపారు. పాఠశాలల్లో యోగా తప్పనిసరి అని రేపటి తరన్ని రక్షించుకోవడానికి యోగ అధ్భుత సాధనమని ఆమె స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా అసోసియేషన్‌, వ్యాస మహర్షి యోగా సోసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కోమటిచెరువు కట్టపై నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ముంచుకొస్తున్న అనారోగ్య సంక్షోభాలను ధీటుగా ఎదుర్కోవడానికి మానసిక, శారీరక దృఢత్వం అనివార్యమన్నారు. దీనికి యోగ విద్య అధ్భుత సాధమని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యోగా విద్యను ప్రవేశపెట్టామని మరింత పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ భారతీయ ప్రాచీన యోగ విజ్ఞానం ఇప్పుడు మానవ మనుగడకు అనివార్యమన్నారు. రాష్ట్రప్రెస్‌ అకాడమీ సభ్యుడు కొమరవెల్లి అంజయ్య మాట్లాడుతూ యోగసాధన ఆరోగ్య రక్షణకు అనివార్యం అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధికారి నాగేందర్‌, నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ బిన్నీ, సిద్దిపేట జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరమేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట అశోక్‌, వ్యాస మహర్షి యోగ సొసైటీ సారథి నిమ్మ శ్రీనివా్‌సరెడ్డి, ప్రముఖ దంత వైద్యుడు అరవింద్‌, యోగ శిక్షకులు తోట సతీష్‌, సంధ్య, బొజ్జ అశోక్‌, ప్రతినిధులు రాజ్‌కుమార్‌, రాము, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


నిరంతర సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

యోగ నిరంతర సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మానవ మనుగడను సవాల్‌ చేస్తూ ప్రపంచాన్ని  వ్యాధులు వణికిస్తున్న నేపథ్యంలో ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. యోగా జీవితంలో భాగం కావాలని, ప్రతీరోజు యోగ సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చు అని వివరించారు. తాను ప్రతిరోజు యోగా సాధన చేస్తానని తెలిపారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రతిఒక్కరూ ఒక గంట సమయాన్ని యోగాకు కేటాయించాలని మంత్రి సూచించారు. 


ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలి

కొండపాక : ప్రజలంతా తప్పనిసరిగా యోగాభ్యాసం, ప్రాణాయామం తదితర అంశాలను క్రమం తప్పకుండా చేసేలా ప్రజలను చైతన్యం చేయాలని ఆయూష్‌ వైద్యులకు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సూచించారు. ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సిద్దిపేటలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆయూష్‌ విభాగానికి చెందిన మహిళలు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జీవితంలో ఒక భాగంగా యోగ సాధన చేయడం వల్ల రోగ నిరోధకశక్తి పెరిగి, ఎలాంటి వైరస్‌లు, వ్యాధులు సోకకుండా ఆరోగ్యవంతంగా జీవించ వచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా యోగా దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించలేకపోతున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయూష్‌ వైద్యులు దీపాంజలి, జ్యోతి, ఉమారాణి, సుజాత, రజని తదితరులు పాల్గొన్నారు.


యోగాకు గుర్తింపు తెచ్చిన మోదీ

దుబ్బాక/మిరుదొడ్డి: అంతర్జాతీయ  యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు కార్యకర్తలతో కలిసి యోగా గురువు దయాకర్‌గురు ఆధ్వర్యంలో వివిధ యోగా ఆసనాలను సాధన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయవ్యాప్తంగా యోగాకు గుర్తింపు తేవడంతో ప్రధానిమోదీ కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా భావించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి వాక్సినేషన్‌ను ఇస్తుందని ఆయన తెలిపారు.  మిరుదొడ్డిలో యోగా శిక్షకులు రాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలే్‌షగౌడ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, ప్రవీణ్‌, సుభాష్‌ ఉన్నారు. 

 చేగుంట: ప్రతి నిత్యం యోగ సాధన చేసి మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. చేగుంటలో  కల్యాణ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో జీవనమంత్ర యోగ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు  మాట్లాడారు. అనంతరం చేగుంట మండలంలోని పొలంపల్లిలో పేదింటి వధువుకు పెళ్లికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్‌ నాయకులు గోవింద్‌ గణేష్‌ బాలచంద్రన్‌ రాజగోపాల్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-22T04:27:20+05:30 IST