ఆరోగ్యం ఊసులేని అభివృద్ధి నమూనా!

ABN , First Publish Date - 2021-02-23T06:28:34+05:30 IST

రాష్ట్రప్రజలు సంతోషంగా ఉండాలంటే, మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా ఆరోగ్యంగా ఉండాలి. కరోనా వైరస్ లాంటి ఉపద్రవాలు తలెత్తినా...

ఆరోగ్యం ఊసులేని అభివృద్ధి నమూనా!

రాష్ట్రప్రజలు సంతోషంగా ఉండాలంటే, మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా ఆరోగ్యంగా ఉండాలి. కరోనా వైరస్ లాంటి ఉపద్రవాలు తలెత్తినా తట్టుకుని నిలబడగలగాలి. రాష్ట్ర జీడీపీ పెరుగుదల, తలసరి ఆదాయం పెరుగుదల, నగరాల పెరుగుదల గురించి ప్రభుత్వాలు ఎంత గొప్పలు చెప్పుకున్నా, మానవవనరుల అభివృద్ధి ప్రమాణాలతో చూసినప్పుడు రాష్ట్రం ఇంకా చాలా వెనుకబడి ఉంది. రాష్ట్ర ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. 


2019 జూన్ 30, 2019 నవంబర్ 14 మధ్య కాలంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5వ రౌండ్ ఫలితాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 35.7శాతం, పట్టణ ప్రాంతాలలో 28.1శాతం 5ఏళ్ళ లోపు పిల్లలలో ఎదుగుదల నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లేదు. గ్రామీణ ప్రాంతాలలో 35శాతం, పట్టణ ప్రాంతాలలో 25.8శాతం ఇదే వయసు పిల్లలలో వయసుకు తగిన బరువులేక బలహీనంగా ఉన్నారు. 


గ్రామీణ ప్రాంతాలలో 72.8 శాతం, పట్టణ ప్రాంతాలలో 64.7శాతం, 6 నుంచి 59 నెలలలోపు పిల్లలలో రక్తహీనత ఉంది. 15–19 సంవత్సరాల మధ్య వయసు బాలికలలో గ్రామీణ ప్రాంతాలలో 72.8శాతం, పట్టణ ప్రాంతాలలో 64.7శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అదే 15–-49 సంవత్సరాల మధ్య వయసు మహిళల్లో ఇది వరుసగా 58.9శాతం, 55.2శాతంగా ఉంది.


పదిహేనేళ్లు పైబడిన పురుషులలో మందులు వాడుతున్న మధుమేహ బాధితుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 16.6శాతం ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 21.4 శాతంగా ఉంది. స్త్రీలలో ఈ సంఖ్య వరుసగా 13.9 శాతంగా, 18.4శాతంగా ఉంది. ఇదే వయసు పురుషులలో మందులు వాడుతున్న రక్తపోటు బాధితుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 28.9శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 36.8శాతంగా ఉంది. స్త్రీలలో ఈ సమస్య వరుసగా 24.7 శాతం, 29.1 శాతంగా ఉంది. 


తగినంత పౌష్టికాహారం లభించకపోవడం, శారీరక శ్రమకు క్రమంగా దూరం కావడం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వైవిధ్యమైన ఆహారం అందుబాటులో లేకుండాపోవడం, కేవలం వరి బియ్యం, గోధుమ మాత్రమే ఆహారంలో ప్రధాన పాత్ర పోషించడం దీనికి మరో కారణం. 


పంటల ఉత్పత్తులలో పెరుగుతున్న విష రసాయనాల వినియోగం కూడా మనుషులు, ఇతర జీవ జాతుల అనారోగ్యానికి ముఖ్యమైన కారణం. విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు ఆహారాన్ని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. రసాయన ఎరువుల వినియోగం పెరగడం వల్ల భూములు నిస్సారం కావడంతో పాటు, మొత్తంగా నీటి వనరులు కూడా కలుషితమైపోయాయి. ముఖ్యంగా యూరియా వాడకం పెరగడం వల్ల భూగర్భ జలాలతో సహా చుట్టూ ఉన్న నీటి వనరులన్నీ విషపూరితమైపోయాయి. నీటిలో పెరిగిన నైట్రైట్ కాన్సర్‌కు కారణమవుతోంది. కాన్సర్ కారకమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసెట్ లాంటి కలుపు మందు ఇంకా మార్కెట్టులో దొరుకుతూనే ఉంది. వివిధ దేశాలలో నిషేధించిన పురుగు, తెగుళ్ళ మందులను మన రాష్ట్రంలో డీలర్లు యథేచ్ఛగా అమ్ముతూనే ఉన్నారు. రైతులు తెలియక వాడుతూనే ఉన్నారు. కమీషన్ల మోజులో ఉన్న కొందరు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు వీటి అమ్మకాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం కూడా తాను రూపొందించే 'వ్యవసాయ పంచాంగం' నిండా విష రసాయనాలనే ఇంకా సిఫారసు చేస్తూనే ఉంది. 


గ్రామీణ ప్రజలలో కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల ప్రజల ఆహారంలో వైవిధ్యం లోపించింది. స్థానికంగా పప్పుధాన్యాల, నూనెగింజల, కూరగాయల, పండ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల పౌష్టికాహారం గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా అందుబాటులో లేకుండాపోయింది. పాడి పశువుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో పాల పదార్థాల వినియోగం కూడా తగ్గిపోయింది. మాంసం వినియోగం పెరిగినప్పటికీ, కోడిగుడ్ల ఉత్పత్తిలో వినియోగిస్తున్న గ్రోత్ హార్మోన్లు, యాంటి బయాటిక్ ఇంజక్షన్లు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. వంట నూనెల తయారీలో, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో, నిల్వలో వాడుతున్న రసాయనాలు కూడా మనుషుల ఆరోగ్యాలను కబళిస్తున్నాయి. 


రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా పెరిగింది. సర్వే ప్రకారం పదిహేనేళ్ళు పైబడిన పురుషులలో గ్రామీణ ప్రాంతాలలో 49శాతం, పట్టణ ప్రాంతాలలో 33.9శాతం మంది మద్యం దుర్వ్యసనానికి గురయ్యారు. మహిళలలో ఈ అలవాటు వరుసగా 9శాతం, 2శాతంగా ఉంది. ప్రజల ఆరోగ్యాలను ధ్వంసం చేయడంలో ఈ మద్యం అలవాటు కీలక పాత్ర పోషిస్తున్నది. మరీ ముఖ్యంగా ప్రజలకు సరైన పోషకాహారం లభించని సమయంలో ఈ అలవాటు ఆరోగ్యాలను త్వరగా క్షీణింపచేస్తున్నది. స్త్రీలపై హింసను పెంచుతున్నది. రాష్ట్రంలో వితంతు పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 2020 డిసెంబర్ నాటికి 14,26,686కు చేరడంలో మగవాళ్ళ మద్యం ఆధారిత అనారోగ్య మరణాలు కూడా ముఖ్య కారణమే. మనుషుల ఆలోచనాశక్తిని చంపేయడంలో మద్యం కీలకమైనది. ఎన్నికల ఫలితాల కోసం, కొన్ని పార్టీల సభల భారీ నిర్వహణ కోసం మద్యం మీద, డబ్బుల పంపిణీ మీద ఆధారపడుతున్నాయి. 


ప్రజలలో మద్యం అలవాటు పెరగడానికి రాజకీయ పార్టీలే కారణం. అధికార పార్టీలకు ప్రజలు మత్తులో పడి ఉండటమే సుఖం. పైగా రాష్ట్ర పాలనకు కూడా ఈ మద్యం ప్రియులు తగినంత ఆదాయాన్ని అందిస్తారని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. 2019–2020 జనవరి నాటికి మద్యం ద్వారా వచ్చిన ఆదాయం రూ.12,600 కోట్లు ఉంది. 2020–21 సంవత్సర బడ్జెట్టులో ఈ మొత్తాన్ని రూ.16,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొనసాగుతున్నది అవినీతి, అప్పులు, మద్యం, ప్రజలపై అన్ని రకాల హింస తదితరాలపై ఆధారపడిన పాలన, అభివృద్ధి నమూనాయే. 


ప్రభుత్వాల విధానాలలో మార్పు రాకుండా ఈ పరిస్థితి మార్చడం కష్టం. స్పష్టమైన విధానాలు, ప్రజానుకూల చట్టాల అమలు, శాస్త్రీయ దృక్పథం, ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత, తగినన్ని బడ్జెట్ కేటాయింపులు లేకుంటే పరిస్థితిలో మార్పు రాదు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు, నాయకులు ఆస్తులు పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకోకుండా, ప్రజల ప్రయోజనాల కోసమే విధానాలు, బడ్జెట్లు రూపొందిస్తే మార్పు మొదలవుతుంది. నిరంకుశ పాలననే ప్రస్తుత ప్రభుత్వాలు తమ వైఖరిగా మలచుకున్నాయి. సమాజం మొత్తంగా ఒక నిస్తేజానికి గురై ఉంది. మధ్యతరగతి, బుద్ధిజీవుల వర్గాలు అవకాశవాదం, మతతత్వం, భయంలో కూరుకు పోయి ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వాల పాలనా తీరు, పాలకులు కొనసాగిస్తున్న అభివృద్ధి నమూనా పేద, శ్రమజీవులకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ఈ దాడికి ఎక్కువ గురవుతున్నది. 


ప్రజలు మద్యం, పొగాకు అలవాటు నుంచి బయట పడకుండా, వ్యవసాయం విష రసాయనాల నుంచి విముక్తం కాకుండా ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగు పడవు. ప్రజల నిజమైన జీవనప్రమాణాలు పెరగనప్పుడు, కేవలం పెరిగే సగటు తలసరి ఆదాయాల గురించి మురిస్తే లాభం లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగకుండా, సాధారణ ప్రజలకు ఆదాయాలు పెరగకుండా ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతిపై మాత్రమే ఆధారపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే, అది అభివృద్ధే కాదు. పాలకుల ప్రస్తుత అభివృద్ధి నమూనా మారాలన్నా ప్రజలలో ఆలోచనా శక్తి, ప్రశ్నించే స్వభావం, పోరాడే శక్తి పెరగాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2021-02-23T06:28:34+05:30 IST