‘ఆరోగ్య బీమా’లో కీలక మార్పులు

ABN , First Publish Date - 2020-09-27T07:54:13+05:30 IST

ఆరోగ్య బీమా పథకాలకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు అక్టోబరు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పాలసీలతోపాటు...

‘ఆరోగ్య బీమా’లో కీలక మార్పులు

  • అక్టోబరు 1 నుంచి అమలు
  • పెరగనున్న బీమా కవరేజీ, ప్రీమియం

ఆరోగ్య బీమా పథకాలకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు అక్టోబరు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పాలసీలతోపాటు కొత్తగా ప్రవేశపెట్టనున్న పథకాలకూ ఇవి వర్తిస్తాయి. తద్వారా పాలసీదారులకు మరిన్ని వ్యాధులు, చికిత్స విధానాలకు బీమా కవరేజీ లభించనుంది. అంతేకాదు, ఆరోగ్య బీమా పథకాల ప్రమాణాలు మరింత మెరుగవనున్నాయి. అయితే, బీమా కవరేజీ విస్తరణతో పాటు ఈ పాలసీల ప్రీమియం కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరు 1 తర్వాత మార్కెట్లోకి వచ్చిన పాలసీలు ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. అంతక్రితం పథకాల్లోనూ వచ్చే నెల ఒకటి నుంచి కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు.. 



వరుసగా 8 ఏళ్లు ప్రీమియం చెల్లించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారుకు చెందిన  క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదు. పాలసీదారు మోసానికి పాల్పడినట్లు రుజువైనప్పుడు లేదంటే ఆ కవరేజీని పాలసీ కాంట్రాక్టు నుంచి శా శ్వతంగా తొలగించిన పక్షంలోనే మినహాయింపు.

ప్రభావం 

ఈ మార్పుతో బీమా కవరేజీ నాణ్యత పెరుగుతుంది. 8 ఏళ్ల తర్వాత అన్ని క్లెయిమ్‌ల (మోసా లు మినహా)ను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతేకాదు, మోసానికి పాల్పడినట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కూడా బీమా కంపెనీదే. 



క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న వారి క్లెయిమ్‌లను బీమా కంపెనీలు మొత్తం గా తిరస్కరించడానికి వీల్లేదు. 

ప్రభావం

మూర్ఛ, గుండె జబ్బు, హెపటైటిస్‌ బీ, కాలే య వ్యాధి, ఎయిడ్స్‌, మతిమరుపు వంటి 16  క్లిష్టమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారి క్లెయిమ్‌లను ఇకపై బీమా కంపెనీలు పూర్తిగా తిరస్కరించలేవు. ఇప్పటివరకు ఈ వ్యాధులుఉన్నవారికి ఆర్యోగ బీమా పథకం కొనుగోలు చేసే అర్హత కూడా ఉండేది కాదు. ఇకపై వీరికున్న వ్యాధి మినహాయించి మరేదైనా అనారోగ్యం పాలైనప్పుడు బీమా కవరేజీ పొందే సౌలభ్యం ఉంటుంది. 



‘ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డిసీజ్‌’ (పాలసీ కొనుగోలుకు ముందునుంచే ఉన్న వ్యాధి)పై మరింత స్పష్టత 

ప్రభావం

బీమా పథకం కొనుగోలు చేసేనాటికి గుర్తించిన వ్యాధి లేదా అనారోగ్యాలన్నింటినీ ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డిసీజ్‌ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. అంతేకాదు, గరిష్ఠంగా 48 నెలలు లేదా అంతకంటే తక్కువ నెలల (పాలసీలో నిర్దేశించిన ప్రకారం) వెయిటింగ్‌ పీరియడ్‌ ముగిసిన వెంటనే ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డిసీజ్‌కూ బీమా కవరేజీ కల్పించాల్సి ఉంటుంది. 



ఆధునిక చికిత్స విధానాలకూ బీమా కవరేజీ కల్పించాల్సి ఉంటుంది.

ప్రభావం

ఇకపై బీమా కంపెనీలు డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌, ఓరల్‌ కీమోథెరపీ, యూటరిన్‌ అర్టరీ ఎంబాయిలైజేషన్‌, బలూన్‌ సినూప్లాస్టీ, ఇమ్యునోథెరపీ, రోబోటిక్‌ సర్జరీ వంటి ఆధునిక చికిత్సల ఖర్చుల క్లెయిమ్‌లను సైతం పరిష్క రించాల్సి ఉంటుంది.  



ఐసీయూ చార్జీల్లో దామాషా లెక్కన మినహాయించుకునేందుకు బీమా కంపెనీలకు ఇకపై అనుమతి ఉండదు. ఐసీయూను ఒకే కేటగిరీగా పరిగణించాలని ఐఆర్‌డీఏఐ తన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 

ప్రభావం: ఐసీయూ చార్జీల్లో బీమా కంపెనీ దామాషా పద్ధతిన మినహాయించిన మొత్తాన్ని పాలసీదారు తన జేబులోంచి చెల్లించాల్సిన బెడద తప్పుతుంది. 



నిర్దేశిత గ్రేస్‌ పీరియడ్‌ (అదనపు గడువు)లోగా ప్రీమియం చెల్లించిన వారికే పాలసీ వెయిటింగ్‌ పీరియడ్‌ ముగింపుతో లభించే ప్రయోజనాలు వర్తిస్తాయి.

ప్రభావం: గ్రేస్‌ పీరియడ్‌ ముగిసే లోపు ప్రీమియం చెల్లించలేకపోతే పాలసీ రద్దవడంతో పాటు పాలసీలో కొన్ని వ్యాధులకు నిర్దేశించే వెయిటింగ్‌ పీరియడ్‌ ముగింపుతో లభించే ప్రయోజనాలను ఉపయోగించుకోలేరు. తర్వాత కాలంలో పాలసీని పునరుద్ధరించుకున్నా.. గత ప్రయోజనం రద్దయి.. కొత్త వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రారంభమవుతుంది. బీమా కంపెనీలు వెయిటింగ్‌ పీరియడ్‌లో నిర్దిష్ట వ్యాధులకు క్లెయిమ్‌లను అనుమతించవు. సాధారణంగా హెల్త్‌ పాలసీల్లోని నిర్దేశిత అనారోగ్యాలకు వెయిటింగ్‌ పీరియడ్‌ 2-4 ఏళ్లపాటు ఉంటుంది. 


Updated Date - 2020-09-27T07:54:13+05:30 IST