హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-05-06T07:42:46+05:30 IST

కరోనా తీవ్రత కారణంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయని వేలాది మంది పాజిటివ్‌తో భాధపడుతుండగా చాలా మంది మరణిస్తున్నారని ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

మంత్రితో పాటు టీఆర్‌ఎస్‌ నేతల భూములపై విచారణ జరిపించాలి 

పేదలకు వైద్యం అందించలేని సర్కారు గద్దె దిగాలి

మాజీ ఎమ్మెల్యే  ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి 

నిర్మల్‌, మే 5 (ఆంఽధ్రజ్యోతి) : కరోనా తీవ్రత కారణంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయని వేలాది మంది పాజిటివ్‌తో భాధపడుతుండగా చాలా మంది మరణిస్తున్నారని ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నిర్మల్‌లోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తు తం ఆరోగ్య పరమైన క్లిష్టతర పరిస్థితులతో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వేలాది మంది కరోనాతో తల్లడిల్లుతున్నప్పటికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటి వరకు ఇటువైపు దృష్టి సారించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లు అందుబాటులో లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆక్సిజన్‌ను, ఇంజక్షన్‌లను సమకూర్చలేకపోతోందని వివరించారు. సెక్రెటెరీయేట్‌ నిర్మించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని దుయ్యబట్టారు. కాగా ప్రజల దృష్టిని మరలించేందుకు సిఎం కేసీఆర్‌ మంత్రి ఈటెల రాజేంధర్‌పై వేటు వేశారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడడంతోనే మంత్రి ఈటెలపై చర్యలు తీసుకుంటున్నామంటున్న ముఖ్యమంత్రి అలాంటి ఆరోపణలున్న చాలా మంది మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో దాదాపు 15 మందికి పైగా భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వారందరిపై ఇప్పటి వరకు కనీస విచారణలు కూడా జరగడం లేదన్నారు. కేవలం కరోనా రక్షణ చర్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం ఈటెల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఇదిలా ఉండగా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆయన బంధువులు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిం చారు. వందలాది ఎకరాల అసైన్డ్‌ భూములను మంత్రి బందువులు కబ్జా చేస్తున్నప్పటికీ సీఎం ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇకనైనా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు వారి బంధువుల భూకబ్జాలపై విచారణ జరపాలని మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాంశంకర్‌రెడ్డి, డీసీసీ ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చోటా ఆజార్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు , కౌన్సిలర్‌ ఇమ్రాన్‌ ఉల్హ, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు నాందేడపు చిన్ను, దిలావర్‌పూర్‌ మండల జడ్పీటీసీ సభ్యులు తక్కల రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ముత్యంరెడ్డి, మైనార్టీ సెల్‌ నాయకులు కీజర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షులు రాం శంకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ బి.సి సెల్‌ జిల్లా అధ్యక్షులు ధని పోతన్న, ప్రజ్యోత్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T07:42:46+05:30 IST