లాక్‌డౌన్‌ 21 రోజులకు పనులు

ABN , First Publish Date - 2020-03-27T05:30:00+05:30 IST

ఇది హెల్త్‌ ఎమర్జెన్సీ లాంటి స్థితి. బిజీ షెడ్యూల్‌ నుంచి ఒక్కసారిగా ఖాళీగా మారిపోయింది పరిస్థితి. కొంచెం క్రియేటివ్‌గా..

లాక్‌డౌన్‌ 21 రోజులకు పనులు

ఇది హెల్త్‌ ఎమర్జెన్సీ లాంటి స్థితి.  బిజీ షెడ్యూల్‌ నుంచి ఒక్కసారిగా ఖాళీగా మారిపోయింది పరిస్థితి.  కొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌ను అర్థవంతంగా మార్చుకోవచ్చు.  ఈ ఇరవై ఒక్క రోజులు క్షణాలుగా కూడా మార్చుకోవచ్చు. 

  • బంధు-మిత్రులు, పాత స్నేహితుల నంబర్లు సేకరించి వారితో వీడియో చాట్‌ పెట్టుకోండి. ఆపాత మధుర సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనసు తేలిక పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నెగెటివ్‌ ఆలోచనలు అస్సలు రావు. చాలా మంది కంటే మనం ఎంత మెరుగ్గా ఉన్నామో అర్థమవుతుంది. లోపాలు ఉంటే మున్ముందు సవరించుకునే వెసులుబాటు లభిస్తుంది. 
  • ఇంటిని అందంగా డెకరేట్‌ చేసుకోవాలన్న ఆలోచన పెండింగ్‌లో ఉంటే ఆ పని ఇప్పుడు చేపట్టిండి.
  • హిందీ, ఇంగ్లీష్‌ లేదా ఇతర భాషను నేర్చుకోవాలని లేదా కనీసం అర్థం చేసుకునే స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారా! అయితే వెంటనే ప్రయత్నాలను ప్రారంభించవచ్చు. అందుకు ఆయా భాషలకు సంబంధించిన సినిమాలు సైతం తోడ్పడతాయి. నెట్‌లో ప్రతి భాషకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించుకునే వెసులుబాటు ఉంది. 
  • పెయింటింగ్‌ మీద ఆసక్తి ఉంటే దానిపై ఇప్పడు దృష్టిసారించవచ్చు. గూగుల్‌ ఇందుకు సహాయపడుతోంది. 
  • ఎవరిదైనా చేతి రాత చూస్తే ఒక్క క్షణం అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం కదా. ఇప్పుడు అందుకు అవకాశం వచ్చింది. ఆలోచనకు పదునుపెట్టండి. అసలు చేతి రాత ఒక వ్యక్తి మనస్తత్వాన్ని బైటపెడుతుందంటారు.. తెలుసా మీకు. మీ చేతిరాతను మెరుగుపర్చుకునే ప్రయత్నం ఇప్పుడు చేపట్టండి.
  • ఫొటోగ్రఫీ అంటే మీకు పిచ్చి. పాతకాలం మాదిరిగా రీళ్ళు అవసరం లేదిప్పడు. ఒకమాదిరి డిజిటల్‌ కెమెరా ఉంటే చాలు, పనిపట్టవచ్చు. ఆసక్తికి మెరుగులు దిద్దుకోవచ్చు.
  • ఎప్పుడో చిన్నప్పుడు నాన్నతో, లేదా వేరే వాళ్లతో కలిసి గార్డెనింగ్‌ చేసి ఉండవచ్చు. సిటీ లైఫ్‌స్టయిల్‌లో అందుకు మళ్ళీ కుదరకపోయి ఉండవచ్చు. అవకాశం ఉంటే, మీ ఇంటి చుట్టూ ఖాళీ ఉంటే ఇప్పుడు ఆ పని మొదలు పెట్టండి. అదీ కాదు అపార్ట్‌మెంట్‌లో ఉంటే బాల్కనీలో, డాబాపై పెట్టుకునే మొక్కల కుండీల్లో ఉన్న పాత మట్టి తీసి, కొత్తగా చేయండి. మిద్దెపై వ్యవసాయం ఇప్పడో వ్యాపకం. నెట్‌లో దీనికి సంబంధించి చాలా సమాచారం ఉంది. 
  • అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా అత్యవసర సందర్భాల్లో ఉపయోగించుకోవడం కోసం కరాటే, కుంఫూ లాంటి ఏదైనా విద్యను నేర్చుకునే ప్రయత్నం ఇప్పుడు చేయవచ్చు. తెలిస్తే మీ పిల్లలకు నేర్పవచ్చు.
  • రెడీమేడ్‌ దుస్తుల యుగంలో పిల్లలకు వాటిని కుట్టించుకుంటారు అనే విషయం కూడా తెలియడం లేదు.  చొక్కాకు లేదా ప్యాంట్‌కు గుండీలు ఊడిపోతే  కనీసం కుట్టడం కూడా తెలియడం లేదు.  ఈ చిన్న చిన్న పనులు నేర్పిస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  
  • ఎప్పుడూ బోర్డ్‌ గేమ్స్‌ మాత్రమే కాకుండా పాతతరం ఆటలను కొత్తగా ట్రై చేయండి.  గచ్చకాయలు, పులి - మేక, వామన గుంతలు, దాగుడు మూతలు తదితరాలను పిల్లలకు పరిచయం చేయండి.  చిన్నప్పుడు  అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు రాత్రిపూట మీకు ఎన్నో కథలు చెప్పి ఉంటారు. ఇప్పుడు ఆ పని మీరు చేయండి. పనిలో పని జీవితంలో నేర్చుకున్న పాఠాలు చెప్పండి. శని, ఆదివారాల్లో ఆడాల్సింది క్రికెట్‌ ఒక్కటే కాదు అని చెప్పండి. ఇంకా ఉన్న ఆటలు కూడా 
  • వివరించండి. 
  • కొందరికి వంటలు చేయడం, మరి కొందరికి అందులో ప్రయోగాలు చాలా ఇష్టం. ఇప్పడు ఆ పని మొదలుపెట్టండి. అంతే కాదు, మీ పిల్లలకు వాటిని పరిచయం చేయండి. కనీసం ఉప్మా, నూడిల్స్‌, ఆమ్లెట్‌, ఏదైనా ఒక్క కూర అయిన నేర్పించడానికి ప్రయత్నించండి. 


  • యోగా అంతకు మించి మెడిటేషన్‌ ఇప్పుడు మళ్ళీ ప్రాచుర్యం పొందుతోంది. నిజానికి మెడిటేషన్‌తో ఇరిటేషన్‌ తగ్గి కాన్సంట్రేషన్‌ పెరుగుతుంది. ఆ పని మీరు చేయండి. మీ పిల్లలకు నేర్పండి. కొత్తగా ఏవైనా ఉంటే నేర్చుకోండి. 
  • వ్యాయామం ఒంటికి మంచిది. రోజు ఒక అర్ధగంట చేస్తే.. 21 రోజుల లాక్‌డౌన్‌ తరువాత మీరు దానిని వదిలి పెట్టరు.  
  • క్యారమ్స్‌, చెస్‌ ఆడి ఎన్నాళ్ళయింది. కుటుంబ సభ్యులతో ఒకసారి ఆడి చూడండి. 
  • అన్నింటి కంటే పెద్ద పని వార్డ్‌రోబ్‌ క్లీనింగ్‌. ఆ పని పూర్తచేయగలరేమో చూడండి. కిచెన్‌ లేదా వాటిలోని అటకలపై కూడా ఒక చూపు చూడండి. 
  • పాత సినిమాలు అన్ని గొప్పవి, కొత్తవి అన్ని చెత్తవి అని కాదు. కానీ ఒకసారి పాత సినిమాలపై కూడా లుక్‌ వేయండి. పరమానందయ్య శిష్యుల కథ, బాలభారతం, మాయాబజార్‌... ఇవన్నీ పెద్దలనే కాదు... ఇప్పటి తరాన్నీ అలరింపజేస్తాయి. మూవీ మారథాన్‌ మొదలు పెడితే అసలు సమయమే తెలియదు. 
  • డైరీ అలవాటు ఇప్పటితరంలో ఎంతమందికి ఉందంటారు. ఒకప్పడు దీని గురించి ఎంత బాగా చెప్పేవారో గుర్తుందా. అదిప్పుడు మొదలు పెట్టండి. డేట్‌లెస్‌ డైరీ రాయడం మొదలుపెట్టండి. ఈ విరామం తరవాత ఒకసారి చూసుకుంటే మీకు మీరే ఆశ్చర్యపడతారు. 
  • రూబిక్‌ క్యూబ్‌ సాల్వింగ్‌,  సుడోకు.. ఫజిల్స్‌తో కూర్చుంటే సమయం మిగులుతుందా చెప్పండి




  • వీణ, వయోలిన్‌, గిటార్‌, తబలా నేర్చుకోవాలని ఉండేది. దానిపై 
  • పట్టు ఉన్న వారు ఉంటే చూడండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. 
  • ఎన్నడో వదిలేసిన సంగీత సాధనకు ఒక్కసారి మెరుగులు దిద్దుకోండి. ఆన్‌లైన్‌ పాఠాలూ ఉన్నాయి. 
  • మీకు ఇష్టమైన పుస్తక పారాయణం కానివ్వండి. ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ - వందల పేజీలు ఉండే అమ్మోరు పుస్తకాలు పని పట్టడానికి ఇదే సమయం.  సొంతంగా పుస్తకాలు లేకుంటే ఆన్‌లైన్‌లో అయినా చదవడానికి ట్రై చేయొచ్చు. 
  • సులువుగా చేేస సైన్స్‌ ప్రయోగాలకు ఇప్పడూ శ్రీకారం చుట్టవచ్చు. ఏవేవి ఉన్నాయో ఒకసారి గూగుల్‌ తల్లిని అడిగితే చెబుతుంది. వీటిని చేస్తూ పిల్లలకు సైన్స్‌, మేథ్స్‌పై ఆసక్తిని, అవగాహననూ పెంచవచ్చు.  
  • చాలా మందికి వ్యాసాలు లేదా కథలు, ఇంకా ఏవేవో రాయాలని ఉంటుంది. రోజువారీ బిజీలో వాటిని రాయలేక పోవచ్చు. అలాంటి ఆలోచన ఉన్నవాళ్లు వెంటనే పెన్ను తీయండి. ఇన్నాళ్ళుగా ఆలోచన రూపంలోనే ఉన్న జర్నల్‌ లేదంటే బ్లాగ్‌ను సిద్ధం చేసే పని చేపట్టండి. ఈ కొద్ది రోజులు అందుకు అస్సలు సరిపోతాయా అని ఆలోచించవద్దు. 
  • కార్యాచరణ మొదలుపెట్టండి.
  • పాడ్‌కాస్ట్‌- మీకున్న ఆలోచనలను ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేయండి. అలా చేస్తే ఒంటరిగా ఉన్నామన్న ఆలోచనే దరిచేరదు.
  • ఇవన్నీ కాదు, రెండు మూడు తీసుకున్నా ఈ ఇరవై ఒక్క రోజులూ ఇట్టే గడచిపోతాయి. మళ్ళీ పనిలో పడితే ఆ కొద్ది రోజులు ఎలా గడిచాయా అనిపించక మానదు సుమా!

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST