అదనమని.. అడ్డగోలు దోపిడీ

ABN , First Publish Date - 2022-07-21T06:20:05+05:30 IST

తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 5 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ క్లినిక్‌లకు వైద్య ఆరోగ్య శాఖ రూ.80 లక్షల చొప్పున రూ.4 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఒకటి, సుల్తానాబాద్‌లో మరొకటి నిర్మిస్తున్నారు.

అదనమని.. అడ్డగోలు దోపిడీ
తెనాలి సుల్తానాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ క్లినిక్‌ భవనం

ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల్లో అక్రమాలు 

నిధులు దోచిపెట్టేందుకు మున్సిపాలిటీ సై 

కౌన్సిల్‌ వ్యతిరేకించినా పట్టించుకోని పాలకపక్షం

వైద్యఆరోగ్యశాఖతో సంబంధం లేకుండా రంగం సిద్ధం

నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో హెల్త్‌ క్లినిక్‌కు రూ.20 లక్షలు


   వడ్డించేవాడు మనోడైతే.. అన్న చందంగా తెనాలి మున్సిపాలిటీ నిధులు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. సంబంధం లేకపోయినా.. కౌన్సిల్‌ వ్యతిరేకించినా అడ్డగోలుగా నిధులు సమర్పించేందుకు రంగం సిద్ధమైంది. అందరికీ ఆరోగ్యం.. ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్యయంతో అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టారు. వీటి నిర్మాణానికి వైద్య, ఆరోగ్యశాఖ అంచనాలు తయారు చేసింది. వీటి నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ వారిష్టమొచ్చిన రీతిలో కట్టేసి నిర్మాణానికి అదనపు వ్యయమైంది.. అదనంగా నిధులు కావాలి.. ప్రస్తుతం మడతపేచీ పెట్టాడు. దీనికి మున్సిపల్‌ అధికారులు కూడా తందానా అంటున్నారు. అధికారం అండగా ఉండటంతో టెండర్లు ఖరారు చేసిన వైద్య ఆరోగ్య శాఖతో పనిలేకుండా నేరుగా మున్సిపాలిటీనే తన జనరల్‌ ఫండ్‌, 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తీర్మానాన్ని కౌన్సిల్‌ వ్యతిరేకించినా అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 


తెనాలి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 5 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ క్లినిక్‌లకు వైద్య ఆరోగ్య శాఖ రూ.80 లక్షల చొప్పున రూ.4 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఒకటి, సుల్తానాబాద్‌లో మరొకటి నిర్మిస్తున్నారు. అంచనాలు తయారీలో వైద్యఆరోగ్య శాఖ మట్టి స్థితిని, మెరకలు, ఇతర పరిస్థితులను అన్నిటినీ పరీక్షించాకే నిధులు కేటాయించి టెండర్లు ఖరారు చేసింది. నిర్మాణం పూర్తయిన తరుణంలో కొత్తగా అదనపు నిధుల దోపిడీకి పఽథకం వేశారు. దీనికి మున్సిపాలిటీ కూడా సై అనటంతో దోపిడీకి రంగం సిద్ధమైంది.


తేలికపాటి నేలల సాకుచూపి...

ఏ భవనం నిర్మించాలన్నా మట్టి పరీక్షలు జరిపి, మట్టి తత్వానికి తగ్గట్టుగా కాంక్రీట్‌ పనుల పటిష్టతను నిర్ణయిస్తారు. ఒకవేళ భవన నిర్మాణ స్థలం రోడ్డు కంటే పల్లంలో ఉంటే మెరకకు నిధులను కూడా కేటాయిస్తారు. అయితే ఈ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లకు మాత్రం ప్రత్యేక విధానానికి తెరలేపారు. రాతి నేలలు, కొండల వంటి ప్రదేశాల్లో నిర్మాణాలకు మాత్రమే అనుకోని పరిస్థితుల్లో అదనపు వ్యయం అవుతుంది. అయితే తెనాలిలో మాత్రం ఇంజనీరింగ్‌ శాఖ సూచించిన దానికంటే అదనంగా ఖర్చు అయిందంటూ మడతపేచీ మొదలైంది. ఒకవేళ అదనమైనా రూ. రెండు, మూడు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ, ఏకంగా ఒక్కో భవనానికి రూ.20 లక్షలు ఎందుకవుతుందో ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.   ఒక వేళ అంచనాల్లో లోపం ఉన్నా, అదనపు నిధులను వైద్య ఆరోగ్య శాఖే మంజూరు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ టెండర్లు పిలిచింది.. కాంట్రాక్ట్‌ ఒప్పందం చేసుకున్నది ఒకరైతే, ఏ సంబంధంలేని మున్సిపల్‌ నిధుల నుంచి అదనపు నిఽధలను కేటాయించాలనే విషయమే అనేక అనుమానాలకు తావిస్తోంది. పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మాణం చేస్తున్న క్లినిక్‌కు మెరకు వేయాల్సిన అవసరం కానీ, మట్టి సరిచెయ్యాల్సిన పనికానీ లేదు. ఇది మెయిన్‌ రోడ్డుకు సమాంతర ఎత్తులోనే ఉంది. అయితే దీనికి మట్టి సరిచేసినందుకు రూ.4.99 లక్షలు అవసరమని ప్రస్తావించటం విశేషం. 


అన్నీ రూ.5 లక్షల లోపు అంచనాలే

అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణంలో అదనపు వ్యయం అయిన పనులు పునాదులు, ర్యాంపుల విషయంలోనే. ఇవన్నీ పనుల ప్రారంభంలో జరిగినవే. అప్పుడే కాంట్రాక్టర్‌ వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకువెళితే భవన నిర్మాణం చివరి దశలో అయినా నిధులు మంజూరయేవి. అయితే ప్రస్తుతం నిర్మాణం పూర్తయి, తుది దశ పనులు సాగుతున్నాయి. ఈ తరుణంలో కేటాయించిన నిధులన్నీ నిర్మాణానికే సరిపోయాయని, తాగునీరు, డ్రెయినేజి పైప్‌లైన్లు, రంగులు, విద్యుత్‌ పనులు, ర్యాంపుల పనులు మిగిలి ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించాలనేది ప్రస్తుత వాదన. సాధారణంగా ఒక కాంట్రాక్టర్‌ ప్రభుత్వ శాఖల్లో ఏ విభాగంలో పనులు చేసేందుకు కాంట్రాక్టు దక్కించుకున్నా దానిని ఒప్పందానికి ముందే గిట్టుబాట్లపై ఆలోచించుకున్నాకే రంగంలోకి దిగుతారు. ఒప్పందం చేసుకని పనులు మొదలుపెట్టాక ఆ పనిని పూర్తిచెయ్యాల్సిందే. అయితే ఇక్కడ కాంట్రాక్టర్‌ ముసుగులో అయినవారికి పందారం చేయడానికి చూస్తున్నారో! లేక కాంట్రాక్టర్‌ దగ్గర మామూళ్లకు ఆశపడ్డారో కానీ, అడ్డగోలుగా దోచిపెట్టేందుకు సిద్ధపడ్డారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షల వరకు అవసరమని పేర్కొంటే, ఆ పనులను ఒకే టెండర్‌ పద్ధతిన కాకుండా విభజించి రూ.4.99 లక్షలకు మించకుండా అంచనాలు తయారు చేయడం వీరి పన్నాగానికి నిదర్శనం. 29వ వార్డులో వాటర్‌, డ్రెయినేజి పైప్‌లైన్‌ల కోసం రూ.4,99,000 అంచనా చూపి, మంజూరుచేసిన మొత్తం రూ.4,99,900గా చూపారు. అంచనా విలువకంటే మంజూరుచేసే మొత్తాలు తగ్గడం సహజం. కానీ ఇక్కడ మరో రూ.900 అదనంగా చూపడం దోపిడీకి పరాకాష్ఠగా ఉంది. కేవలం రెండు భవనాలకు సంబంధించిన రూ. 39,95,200 పనులను ముక్కలుచేసి పందారం చేయటం ఆరోపణలకు కారణమవుతోంది. ఇటువంటి అదనపు నిధుల వ్యవహారాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర స్పెషల్‌ చీప్‌ సెక్రటరీకి వివరించామని, ఆయన కూడా సాధారణ నిదుల నుంచి కానీ, 15వ ఆర్థికసంఘ నిధుల నుంచి కానీ ఖర్చు చేసుకోవాలని సూచించారని ఏకంగా కౌన్సిల్‌ ముందుంచే అజెండాలోనే ప్రస్తావించటం విశేషం. పైగా జి.ఒ.ఆర్‌.టి నంబర్‌ 636, తేదీ 9-11-2022న మెడికల్‌ మరియు హెల్త్‌ డిపార్ట్‌మెంటు నిధులు మంజూరుచేసినట్టు ప్రస్తావించటం మరో విశేషం. ప్రస్తుతం ఇదే సంవత్సరంలో 7వ నెల జరుగుతుంటే, ఉత్తర్వులు ఇంకా నాలుగు నెలల తర్వాత వచ్చే నవంబర్‌లోనే ఉత్తర్వులు ఇచ్చినట్టు చూపారు. దీనిని కౌన్సిల్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించినా, ఆమోదించినట్లు నమోదుచేసి, చివరకు అదనపు నిధులు పక్కదారి పట్టించటానికే మొగ్గుచూపటం దారుణమే.

Updated Date - 2022-07-21T06:20:05+05:30 IST