ప్రవాసుల తలిదండ్రుల కోసం 'ఆప్యాయ హెల్త్‌ కార్డులు'

ABN , First Publish Date - 2022-01-06T13:32:43+05:30 IST

అమెరికాలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రవాసుల తల్లిదండ్రుల కోసం ‘ఆప్యాయ హెల్త్‌ కార్డులు’ ఇవ్వడానికి తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ గురువారెడ్డి తెలిపారు.

ప్రవాసుల తలిదండ్రుల కోసం 'ఆప్యాయ హెల్త్‌ కార్డులు'

సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ గురువారెడ్డి

రాంగోపాల్‌పేట్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రవాసుల తల్లిదండ్రుల కోసం ‘ఆప్యాయ హెల్త్‌ కార్డులు’ ఇవ్వడానికి తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ గురువారెడ్డి తెలిపారు. బుధవారం ఆస్పత్రిలోని ఆడిటోరియంలో అవగాహన పత్రాల (ఎంఓయూ)లను మార్చుకున్నారు. అనంతరం గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగువారి తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రవాసులకు ఆందోళన ఉంటుందని, అలాంటి వారి కోసం బేసిక్‌, అడ్వాన్స్‌ కార్డులను తీసుకొచ్చామని, ఇందులో బేసిక్‌ కార్డును 100 డాలర్ల (సుమారు రూ.7500)తో తీసుకున్న వారికి తెలుగు రాష్ట్రాల్లో వైద్య సహాయం అవసరమైతే 24/7 365 రోజులు అందుబాటులో ఉండే తమ వైద్య బృందం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. వారిని ఆస్పత్రుల్లో చేర్చడం, వైద్యం అందించడం, సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అమెరికాలో ఉన్న వారికి వీరి ఆరోగ్య పరిస్థితి, ల్యాబ్‌ రిపోర్ట్‌ వివరాల గురించి సమగ్ర సమాచారం అందిస్తుందన్నారు. అలాగే అడ్వాన్స్‌ కార్డు తీసుకున్న వారికి 10 లక్షల ఇన్సూరెన్స్‌ లభిస్తుందన్నారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో నివసించే ప్రవాసుల తల్లిదండ్రులకు ఈ కార్డులు అందజేస్తున్నామని, త్వరలోనే అన్ని దేశాల్లోని తెలుగువారికి ఇలాంటి అవకాశం కల్పిస్తామని వివరించారు. టీటీఏ అధ్యక్షుడు పటోళ్ళ మోహన్‌, ఆస్పత్రి డైరెక్టర్లు డాక్టర్‌ కౌశిక్‌, డాక్టర్‌ కావ్య, సీఈవో నాగరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ నాగకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-06T13:32:43+05:30 IST