పేరుకే పెద్దాసుపత్రి

ABN , First Publish Date - 2022-05-18T05:34:14+05:30 IST

పేరుకే పెద్దాసుపత్రి కానీ, వైద్య సేవలు మాత్రం సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేరుకే పెద్దాసుపత్రి
జిల్లా ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు (ఫైల్‌)

- బాధితులకు సక్రమంగా అందని వైద్యం 

- మృత్యువాత పడుతున్న రోగులు, చిన్నారులు

- ‘ప్రైవేట్‌’కు రెఫర్‌ చేస్తున్న డాక్టర్లు 

గద్వాల క్రైం, మే 17 : పేరుకే పెద్దాసుపత్రి కానీ, వైద్య సేవలు మాత్రం సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గద్వాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు, చిన్నారులు మృత్యువాత పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల క్రితం మల్దకల్‌ మండలంలోని మద్దెలబండ తండాకు చెందిన వెంకటమ్మ అనే గర్బిణి తొలి కాన్పు కోసం జిల్లా ఆస్పత్రిలో చేరగా, శిశువు కడుపులోనే మృతి చెందింది. ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సంఘటన జరి గిందని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఐదు రోజుల క్రితం గద్వాల పట్టణంలోని షేరెల్లివీధికి చెందిన బ్రహ్మయ్యచారి అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందుకు వైద్యుల నిర్లక్ష్య మే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. గతంలోనూ అయిజకు చెందిన ఓ గర్భిణి మృతి చెందింది. అంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 


పర్యవేక్షణ కరువు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో పని చేస్తున్న 34 మంది వైద్యుల్లో ఎక్కువ మందికి జిల్లాకేంద్రంలోనే ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న వారిని తమ సొంత దవాఖానాలకు పంపి స్తున్నట్లు విమర్శలున్నాయి. వైద్య పరీక్షల కోసం కూడా తమకు సంబంధించిన ల్యాబ్‌లకే పంపిస్తున్నట్లు తెలు స్తోంది. మందులను కూడా బయట మెడికల్‌ దుకా ణాల్లో తీసుకోవాలని చెప్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు సక్రమ మైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


రోగులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలు వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. రోగులను ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపించినా, వైద్య పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లకు రెఫర్‌ చేసినా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-05-18T05:34:14+05:30 IST