వైద్యం మిథ్య

ABN , First Publish Date - 2021-10-25T06:04:30+05:30 IST

గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వాన స్థితికి దిగజారాయి.

వైద్యం మిథ్య
ఎన్టీఆర్‌ వైద్యాలయం

ఎన్టీఆర్‌ వైద్యాలయానికి సుస్తీ!

స్థాయి పెంచారు.. పోస్టులు మరిచా

200 పడకల ఆస్పత్రిలో 25 శాతం మంది మాత్రమే వైద్యులు

ఉండాల్సిన వైద్య నిపుణులు 47 మంది.. ప్రస్తుతం ఉన్నది 12 మంది!

88 మంది స్టాఫ్‌నర్సులకుగాను 66 పోస్టులు ఖాళీ

పరికరాలు, సదుపాయాలు సైతం కొరత

ఏడాది నుంచి పనిచేయని సీటీ స్కాన్‌

ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి

అత్యధిక ఎమర్జెన్సీ కేసులు కేజీహెచ్‌కు తరలింపు

ప్రతిపాదనలకే పరిమితమైన పోస్టుల భర్తీ, కొత్త సీటీస్కానర్‌ కొనుగోలు


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 24: గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వాన స్థితికి దిగజారాయి. పడకల స్థాయిలో ఉండాల్సిన వైద్యులు, సిబ్బందిలో కనీసం సగం మంది కూడా లేరు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వైద్య పరీక్షల పరికరాలు నిరుపయోగంగా పడివున్నాయి. కొన్నింటికి మరమ్మతులు కూడా చేయించకపోవడంతో రోగులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తున్నది. గైనిక్‌, ఆర్థో, తదితర ఎమర్జెన్సీ కేసులను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. దీంతో వైద్యం అందడంలో జాప్యం జరిగి దారిలోనే ప్రాణాలు వదులుతున్నారు.


అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ వైద్యాలయానికి అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, నియోజకవర్గాల పరిధిలోని మండలాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు సాధారణ ప్రసవం జరగని గర్భిణులను తీసుకువస్తుంటారు. గతంలో 100 పడకలతో వున్న ఈ ఆస్పత్రిని 2014లో మరో 100 పడకలతో ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి పడకల స్థాయిని 200లకు పెంచారు. కానీ ఆ స్థాయిలో వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బందిని నియమించలేదు. దీంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడంలేదు.


నాలుగో వంతు మాత్రమే వైద్యులు, స్టాఫ్‌ నర్సులు

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో వివిధ స్పెషలిస్టు పోస్టులకు సంబంధించి మొత్తం 47 మంది వుండాలి. కానీ ప్రస్తుతం 12 మంది మాత్రమే వున్నారు. అదే విఽధంగా 88 మంది స్టాఫ్‌ నర్సులకుగాను 22 మంది మాత్రమే వున్నారు. మాతాశిశు సంరక్షణ విభాగాన్ని పక్కన పెడితే మిగిలిన 100 పడకల విభాగంలో 18 మంది వైద్యులు, 48 మంది స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం సూపరింటెండెంట్‌తోపాటు ఈఎన్‌టీ, నేత్ర, జనరల్‌ ఫిజిషియన్‌, ఇద్దరు మత్తు డాక్టర్లు, ఒక సర్జన్‌, ఒక పెథాలజీ వైద్యుడితో కలిపి మొత్తం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఎముకల వైద్యుడు బదిలీ అయి ఏడాది గడిచినా కొత్తవారిని నియమించలేదు. నర్సీపట్నం నుంచి ఒకరిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఇక 48 మంది స్టాఫ్‌నర్సులకుగాను 19 మంది పనిచేస్తున్నారు. 


మాతాశిశు సంరక్షణ విభాగంలో 29 మంది వైద్య నిపుణులు, 45 మంది స్టాఫ్‌ నర్సులతోపాటు మొత్తం 115 మంది వుండాలి. మెడికల్‌ సూపరింటెండెంట్‌తోపాటు గైనిక్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు (సీఎస్‌ఎస్‌) ముగ్గురు, గైనిక్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (సీఏఎస్‌) 16 మంది, మత్తు డాక్టర్లు నలుగురు, పిల్లల డాక్టర్లు నలుగురు, రేడియాలజిస్ట్‌ ఒకరు కలిపి మొత్తం 29 మంది వుండాలి. ప్రస్తుతం నలుగురు నలుగురు సీఏఎస్‌ వైద్యులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. 45 మంది స్టాఫ్‌ నర్సులకుగాను ముగ్గురు మాత్రమే వున్నారు. ఆస్పత్రి మొత్తం మీద (200 పడకలు) చిన్నపిల్లల వైద్య నిపుణులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.


మూలకు చేరిన సీటీ స్కాన్‌

వైద్యాలయంలో వైద్య పరికరాలు, సదుపాయాల కొరత కూడా  వుంది. పలురకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సీటీ స్కాన్‌ ఎంతో అవసరం. కానీ ఏడాది నుంచి ఇది పనిచేయడంలేదు. ఆస్పతి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో సీటీస్కాన్‌ అంశం ప్రస్తావనకు వస్తున్నప్పటికీ వినియోగంలోకి మాత్రం రావడం లేదు. వివిధ పరీక్షల కోసం అవసరమైన పరికరాలు లేవు. దీంతో బయట పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 


అత్యవసర కేసులు కేజీహెచ్‌కు రిఫర్‌

ఎన్టీఆర్‌ వైద్యాలయానికి వచ్చే అత్యవసర కేసుల్లో దాదాపు 90 శాతం కేసులను విశాఖ కేజీహెచ్‌కు తరలించడం పరిపాటిగా మారింది. అనకాపల్లి, ఎలమంచిలి నియోజక వర్గాలతోపాటు చోడవరం, మాడుగుల, పరవాడ తదితర ప్రాంతాల్లో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా క్షతగాత్రులను ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తీసుకువస్తుంటారు. వారిలో అధిక శాతం మందిని ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. అలాగే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవం జరగని గర్భిణిలను ఇక్కడకు తీసుకువస్తుండగా..  ‘రిస్క్‌’ ఎందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో వెంటనే కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. దీనివల్ల పలువురు గర్భిణిలు, శిశువులు దారిలోనే మృత్యువాత పడుతున్నారు.


నాలుగు ఆస్పత్రులకు తిప్పారు... శిశువు దక్కలేదు

చీడికాడకు చెందిన నాగమణి అనే గర్భిణికి సరైన వైద్యం అందడంలో తీవ్ర జాప్యం జరగడంతో శిశువును కోల్పోయింది. ఈండ్ర పరదేశి కుమార్తె అయిన ఈమె రెండో కాన్పు కోసం ఇటీవల పుట్టింటికి వచ్చింది. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో చోడవరం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ రాత్రి విధుల్లో గైనికాలజిస్టు లేకపోవడం, అనకాపల్లి తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. అక్కడ స్కానింగ్‌ సదుపాయం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌కు తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించి తీసుకొచ్చారు. రిపోర్టు చూసిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని, విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని చెప్పడంతో విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత బిడ్డ గర్భంలోనే మృతిచెందిందని వైద్య నిపుణులు చెప్పారు. నాలుగు ఆస్పత్రులకు తిప్పినా శిశువు దక్కలేదని నాగమణి కుటుంబీలు వాపోయారు.


ప్రభుత్వానికి నివేదిక పంపాం 

- డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ 

వైద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారులకు ఖాళీల విషయమై వివరించాం. సీటీస్కాన్‌ వినియోగంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో కొత్తది మంజూరు చేయించాలని కోరాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రూ.కోటితో వైద్యాలయానికి అవసరమయ్యే ముఖ్యమైన వైద్య పరికరాల కోసం నివేదిక పంపించాం.



Updated Date - 2021-10-25T06:04:30+05:30 IST