వైద్యం అంతంతే...

ABN , First Publish Date - 2022-04-19T05:25:03+05:30 IST

వైద్యం కోసమని.. ఎంతో ఆశతో ప్రభుత్వాసుపత్రి గడప తొక్కిన పేదోనికి... వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది..

వైద్యం అంతంతే...
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఓపీలో ఎదురుచూస్తున్న రోగులు

పీడిస్తున్న వైద్యుల కొరత..

ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళుతున్న రోగులు

అత్యవసర కేసులైతే పట్టణాలకే...

సీహెచ్‌సీలలో వైద్యం మెరుగుపడాలంటున్న రోగులు


వైద్యం కోసమని.. ఎంతో ఆశతో ప్రభుత్వాసుపత్రి గడప తొక్కిన పేదోనికి... వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది.. 24 గంటలూ.. వైద్యం అందించడానికి ఏర్పాటు చేసిన సామాజిక ఆరోగ్య కేంద్రాలు.. వైద్యుల కొరతతో పాటు.. పలు సమస్యలతో సరైన వైద్యం అందించలేక.. పేదలను వెక్కిరిస్తున్నాయి. ఫలితంగా తిండికి.. గుడ్డకు ఇబ్బంది పడే పేదలు.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో.. సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అందుతున్న వైద్య సేవలపై.. ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం.. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి)

రోజూ వేలల్లో రోగులు.. జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో రోజూ వైద్యం కోసం కాన్పులు, జ్వరాలు, రోడ్డు ప్రమాదాలతో పాటు అనేక సీజనల్‌ జబ్బులతో వేలల్లో రోగులు వస్తుంటారు.  ఒక మాటలో చెప్పాలంటే.. సామాజిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల వారీగా చూస్తే.. రాజంపేటలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రస్తుతం దీనిని 100 పడకలకు పెంచారు. ఇక్కడికి రోజూ 350 మంది వరకు అవుట్‌ పేషంట్లు వైద్యం కోసం వస్తుంటారు. రైల్వేకోడూరులో ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రి ఉంది. దీనిని 50 పడకలకు పెంచారు. రోజూ 200 మంది వరకు అవుట్‌ పేషంట్లు వస్తుంటారు. రాయచోటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతానికి 50 పడకలు ఉన్నాయి. 100 పడకలకు పెంచారు. రోజూ 700 మందికి పైగా రోగులు వస్తుంటారు. లక్కిరెడ్డిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం 30 పడకలు ఉన్నాయి. 50 పడకలకు పెంచారు. రోజూ 100 వరకు రోగులు వస్తుంటారు. తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల నుంచి 50 పడకలకు మార్పు చేశారు. ఇక్కడ రోజూ 100 వరకు ఓపీ ఉంటుంది. వాల్మీకిపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 50 పడకలు ఉన్నాయి. రోజూ 300 మంది వరకు రోగులు వస్తారు. కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. రోజూ 250 మంది వరకు రోగులు వస్తారు. పీలేరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 50 పడకలు ఉన్నాయి. రోజూ 600 మంది రోగులు వస్తారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో 150 పడకలు ఉన్నాయి. రోజూ 800 మంది రోగులు వస్తారు. ఈ లెక్కన వైద్యం కోసం వేల సంఖ్యలోనే రోగులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. అయితే ఆ వచ్చిన వాళ్లకు సరైన వైద్యం అందలేదనే  విమర్శలు ఉన్నాయి. ఇక్కడే నయం అయ్యే జబ్బులకు కూడా తిరుపతి, కడప, మదనపల్లె వంటి ఆసుపత్రులకు వెళ్లమంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు ప్రమాద కేసుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని, స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం పేరుతో.. బయటకు పంపేస్తారనే విమర్శలు ఉన్నాయి. 


పీడిస్తున్న వైద్యుల కొరత

జిల్లాలో ఉన్న దాదాపు అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల కొరత పీడిస్తోంది. ముఖ్యమైన విభాగాలకు వైద్యులు లేరు. దీంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకైనా.. లేకుంటే వేల రూపాయలు ఖర్చు చేసుకుని తిరుపతి, కడప వంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తోంది. రాజంపేటలో 20 మంది వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 16 మంది మాత్రమే ఉన్నారు. రైల్వేకోడూరులో ప్రస్తుతం చిన్నపిల్లల వైద్యులు, ఒక సర్జన్‌ దంత వైద్యులు, ఫిజియో థెరపిస్ట్‌ అందుబాటులో ఉన్నారు. గైనకాలజిస్ట్‌ అందుబాటులో లేరు. ముగ్గురు స్పెషలిస్టు డాక్టర్లు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ అవసరం. మదనపల్లెలో 27 మంది ఉండాల్సి ఉండగా 20 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లల వైద్యులు, కంటి వైద్యులు అందుబాటులో లేరు. పీలేరులో 16 మంది వైద్యులు ఉండాలి. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అనస్థీయన్‌, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జన్‌, జనరల్‌ ఫిజీషియన్‌, సివిల్‌ సర్జన్‌ పోస్టులతో పాటు రెండు గైనకాలజిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాయచోటిలో 23 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. 17 మంది మాత్రమే ఉన్నారు. తంబళ్లపల్లెలో 6 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అనస్తీయన్‌, గైనకాలజిస్టు, ఫిజియో థెరపి్‌స్ట సర్జన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజి్‌స్టలు లేకపోవ డంతో గర్భిణీలు మదనపల్లె వంటి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇక్కడ గర్భిణీలకు స్కానింగ్‌ మిషన్‌ లేదు. దీంతో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లకు వెళ్ళాల్సి వస్తోంది. కలికిరిలో ముగ్గురు వైద్యులు ఉన్నారు. ఇంకా నాలుగు డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాల్మీకిపురంలో సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు, డెంటిస్టు, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌లు ఇద్దరు ఉన్నారు. ఇంకా నాలుగు సివిల్‌ సర్జన్లు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ల కొరత ఉంది. లక్కిరెడ్డిపల్లెలో 9 మంది వైద్యులు ఉండాలి. అనస్థీషియన్‌, పీడ్రియాట్రిక్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఆపరేషన్లు చేయడానికి ఆపరేషన్‌ థియేటర్‌ లేదు. 


సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగుపడాల్సిందే

వైద్యం పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది కానీ.. ముఖ్యమైన డాక్టర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో.. పేదలకు వైద్యసేవలు ఆశించన మేర అందడం లేదు.  ఇప్పటి వరకు ఉన్న 30 పడకలను 50 పడకలకు, 50 పడకలను 100 పడకలకు పెంచారు. ఆ మేరకు అన్ని చోట్లా భవనాల నిర్మాణం జరుగుతోంది. అయితే ముఖ్యమైన సిబ్బంది, ఇతర వసతులు ఏర్పాటు చేయకపోవడంతో.. సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పేదవానికి సరైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోందనే  విమర్శలు ఉన్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలలోనూ.. తగినంత మంది వైద్యులను నియమించాల్సి ఉంది. 


ఉన్న వైద్యులతోనే ఇబ్బంది లేకుండా వైద్యం

- చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌, సామాజిక వైద్య కేంద్రం, రాయచోటి

ప్రస్తుతం రాయచోటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 23 మంది వైద్యులకు గాను 17 మంది ఉన్నారు. ఇందులో ఇద్దరు బయటకు డిప్యుటేషన్‌పైన వెళ్లారు. ముగ్గురు చాలా రోజులుగా హాజరు కావడం లేదు. ఒకరు మెటర్నిటీ లీవులో ఉన్నారు. అయితే ఉన్న వైద్య సిబ్బందితోనే రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న ఈఎన్‌టీ స్పెషలిస్టును పులివెందులకు డిప్యుటేషన్‌ పైన వేశారు. దీంతో ఈఎన్‌టీకి సంబంధించి సేవలు అందించడం కొంచెం ఇబ్బందిగా ఉంది. 



Updated Date - 2022-04-19T05:25:03+05:30 IST