నత్తే నయం

ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST

పట్టణంలో 2020లో ప్రారంభమైన వంద పడకల ఆసుపత్రి పనులు నత్తే నయంగా సాగుతున్నాయి. రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఫిల్లర్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో 13 మండలాల ప్రజలు వైద్య సేవల కోసం ఎదురు చూస్తున్నారు.

నత్తే నయం
నిర్మాణ దశలో ఉన్న వంద పడకల ఆసుపత్రి

రెండేళ్లయినా పూర్తికాని వందపడకల ఆసుపత్రి పనులు

ఎదురుచూస్తున్న 13 మండలాల ప్రజలు 

రాయచోటి(కలెక్టరేట్‌), మే 17: పట్టణంలో 2020లో ప్రారంభమైన వంద పడకల ఆసుపత్రి పనులు నత్తే నయంగా సాగుతున్నాయి. రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఫిల్లర్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో 13 మండలాల ప్రజలు వైద్య సేవల కోసం ఎదురు చూస్తున్నారు. 

పట్టణ ప్రజలకు ప్రస్తుతం ఏ చిన్న జబ్బు వచ్చినా కడప, తిరుపతి, వేలూరు, హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాలకు వెళ్లి బాగు చేసుకోవాల్సిందే. ఇందుకు గానూ ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రికి రెండేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. కాగా డిసెంబర్‌ 22 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కాంట్రాక్టర్లు ఇప్పటి వరకు గ్రౌండ్‌ఫ్లోర్‌ పూర్తి చేసి సెకండ్‌ ఫ్లోర్‌లో ఫిల్లర్లు మాత్రమే వేశారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే డిసెంబరు 30 నాటికి పనులు పూర్తి చేస్తారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఆసుపత్రి పూర్తయితే దాదాపు 13 మండలాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తారు. ఇదిలా ఉంటే ఈ బిల్డింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రతతో నిండిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఆసుపత్రి మొత్తం చిత్తడి చిత్తడిగా మారింది. ఆసుపత్రిలో బెడ్‌పైన ఉన్న రోగులకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఈ ఆసుపత్రి పూర్తయితే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి సులభంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. 


డిసెంబరులోపు పూర్తి చేయడం కష్టం

వంద పడకల ఆసుపత్రిని డిసెంబరు నాటికి పూర్తి చేయడం కష్టం. ఇప్పటికీ ఇంకా ఫిల్లర్ల దశలో భవనం ఉంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందో ఏమో. త్వరగా పూర్తి చేస్తే ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా సౌకర్యంగా ఉంటుంది. 

- విశ్వనాధ్‌, సీపీఐ నేత


ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందిస్తాం. కాంట్రా క్టర్‌తో మాట్లాడి ఈ ఏడాది చివరి నాటికి బిల్డింగ్‌ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం. 

- సూపరింటెండెంట్‌, ప్రభుత్వ ఆసుపత్రి

Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST