పోలీసులకు పెనుసవాల్‌గా మారిన ‘మొండెం’.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది..!?

ABN , First Publish Date - 2022-01-15T13:54:06+05:30 IST

తల లేని మొండెం కేసు వనస్థలిపురం, నల్లగొండ పోలీసులకు సవాల్‌గా మారింది.

పోలీసులకు పెనుసవాల్‌గా మారిన ‘మొండెం’.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది..!?

  • పోస్టుమార్టం పూర్తి 
  • రంగంలోకి ఆరు బృందాలు

హైదరాబాద్‌ సిటీ/ వనస్థలిపురం : తల లేని మొండెం కేసు వనస్థలిపురం, నల్లగొండ పోలీసులకు సవాల్‌గా మారింది. ఇరు పోలీస్‌ స్టేషన్ల నుంచి ఆరు టీంలు రంగంలోకి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. చింతపల్లి మండలం, విరాట్‌నగర్‌లో మహంకాళి అమ్మవారి విగ్రహం వద్ద  తలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, తలలేని మొండాన్ని గురువారం తుర్కయాంజల్‌ సమీపంలోని బ్రాహ్మణపల్లి రోడ్డులో పూర్తి కాని ఇంట్లో పోలీసులు గుర్తించారు. మొండాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వనస్థలిపురం ఇన్స్‌పెక్టర్‌ సత్యనారయణ తెలిపారు.  ప్రాథమిక ఆధారాల మేరకు హత్యకు గురైన వ్యక్తి సూర్యాటపే జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌ తండాకు చెందిన రమావత్‌ జయేందర్‌నాయక్‌(30) నిర్ధారించారు. 


ఆ ఇల్లు ఎవరిది..?

సగం కట్టి వదిలేసిన ఇంట్లో మొండెం లభించగా, ఆ ఇల్లు మిర్యాలగూడకు చెందిన కేశవనాయక్‌దిగా పోలీసులు గుర్తించారు. పోస్టల్‌ డిపార్టుమెంట్‌లో పని చేసి ఇతడు 2018లో హత్యకు గురయ్యాడు. దీంతో నిర్మాణ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.  జయేందర్‌ మరణానికి, ఇంటి యజమానికి కేశవనాయక్‌ హత్యకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  మృతుడు జయేందర్‌ మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు పేర్కొంటున్నారు. నరబలి అనంతరం చింతపల్లి నుంచి తుర్కయంజాల్‌కు తలలేని మొండాన్ని తరలించారా? లేక, నిర్మాణంలో ఆగిన ఇంట్లోనే హత్య చేసి తలను చింతపల్లికి తరలించారా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని పెట్రోల్‌ పంపులు, మార్బుల్స్‌ దుకాణాలతో పాటు రహదారిపై ఉన్న ఆరు చోట్ల సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. నరబలి వెనుక ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మొండెం వద్ద లభించిన దుస్తులు, ఇతర ఆధారాలతో మొండెం జయేందర్‌ దేనని అప్పట్లో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడి, తల్లిదండ్రుల డీఎన్‌ఏ నమూనాలను పరీక్షకు పంపించినట్లు తెలిసింది.


కాగా, జయేందర్‌ నాయక్‌కు మతిస్థిమితం లేకపోవడంతో ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులు తోడుండేవారు. ఏడాది క్రితం తుర్కయాంజాల్‌కు వచ్చిన ఆతడు ఇక్కడే ఉంటానని చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు కొద్దిరోజులు కొడుకుతో పాటు ఉండి వెళ్లిపోయారు. అతడు భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. మొండెం లభించిన భవనంలోనే గత ఆరు నెలలుగా రాత్రిపూట తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-01-15T13:54:06+05:30 IST