తలనొప్పిని తరమాలంటే..

ABN , First Publish Date - 2021-10-12T05:56:38+05:30 IST

తల నొప్పి రానిదీ, లేనిదీ ఎవరికి? అయితే అడపా దడపా వేధిస్తూ ఉండే ఈ నొప్పి తరచుగా పలకరించడం మొదలుపెడితే మాత్రం తీవ్రంగానే పరిగణించాలి.

తలనొప్పిని తరమాలంటే..

ఆయుర్వేదం

తల నొప్పి రానిదీ, లేనిదీ ఎవరికి? అయితే అడపా దడపా వేధిస్తూ ఉండే ఈ నొప్పి తరచుగా పలకరించడం మొదలుపెడితే మాత్రం తీవ్రంగానే పరిగణించాలి. అందుకు కారణాలు అన్వేషించి, మూలాలు వెతికి, తగిన చికిత్సతో తలనొప్పిని తరిమికొట్టాలి.


తలనొప్పుల్లో మూడు రకాలుంటాయి. ఒత్తిడితో వచ్చే తలనొప్పి, మైగ్రెయిన్‌ తలనొప్పి, సైనస్‌ తలనొప్పి. ఈ మూడు నొప్పులూ శరీరంలో చోటుచేసుకునే మూడు దోషాల్లోని (వాత, పిత్త, కఫ) అవకతవకల కారణంగా తలెత్తుతాయి. ఒక వ్యక్తి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, ఆచారవ్యవహారాలను దీర్ఘకాలంపాటు పరిశీలిస్తే దోషాల్లోని అవకతవకలకు, తద్వారా తలెత్తే తలనొప్పులకు కారణాలు అవగతమవుతాయి. తలనొప్పులకు ప్రధాన కారణం వాత దోషం. అయితే అది వాతదోషంతో కూడిన తలనొప్పి, లేదా పిత్త, కఫ దోష తలనొప్పి అనేది తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ మూడు దోషాలూ కారణం కావచ్చు. 


ఒత్తిడి తలనొప్పి

ఒత్తిడి పెరిగితే తలనొప్పి రావడం సహజం. కాబట్టి ఒత్తిడి తొలగించుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు, ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే మెలకువలను అలవరుచుకోవాలి. అదే పనిగా గంటల తరబడి ఒకే పనిలో నిమగ్నమైపోకుండా, తరచుగా విశ్రాంతి తీసుకుంటూ నాణ్యమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. తలనొప్పికి మరో ప్రధాన కారణం భోజనం మానేయడం. ఇలా భోజనం మానేసినప్పుడు శరీరంలో వాత దోషం పెరుగుతుంది. భోజనం మానేయడంతో పాటు పని ఒత్తిడి కూడా తోడైతే పిత్త దోషం పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడితో కూడిన తలనొప్పి కారణాలను దూరం చేసుకోవాలి.


లక్షణాలు:

నెమ్మదిగా, వేధించే తలనొప్పి ఇది. మాడు, మెడ, భుజాల కండరాలు నొప్పులు పెడుతూ ఉంటాయి. తల పక్కల, నుదుటి దగ్గర, తల వెనక బిగదీసినట్టు నొప్పి ఉంటుంది. తలకు పట్టీ బలంగా పట్టీ బిగించిన భావన కలుగుతుంది.

నివారణ: 

రోజుకు మూడు సార్లు నియమిత వేళల్లో భోజనం తినాలి.

తాజాగా వండిన, వేడిగా ఉన్న, తేమతో కూడిన సూప్‌లు తాగాలి. చల్లగా, పొడిగా, పెళుసుగా ఉండే పదార్థాలు తినకూడదు. తీపి, ఉప్పుతో కూడిన పదార్థాలు తింటూ, కారంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి.

కాఫీ, టీలు మానేసి, వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.

గోరువెచ్చని నూనెతో శరీర మర్దన ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు ఈ అభ్యంగన ఆచరించాలి. ఇలాంటి స్నానంతో రక్తప్రసరణ మెరుగై, నాడీ వ్యవస్థ నెమ్మదించి పెరిగిన తలభారం తగ్గుతుంది. గంధం పొడి, రోజా పువ్వుల నుంచి తీసిన నూనెలను కలిపి, కణతల దగ్గర మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది. 

యోగాభ్యాసంతో శరీర కణజాలానికి పోషణ అంది, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, లింఫ్‌ వ్యవస్థలు చైతన్యమవుతాయి. కండర కణజాలం స్వాంతన పొంది, నొప్పి తగ్గుతుంది. ఇందుకోసం ముందుకు వంగే వీలున్న ఆసనాలు వేయాలి. అలాగే శరీరం వంపు తిప్పే వీలున్న ఆసనాలతో శరీరం సమతులం పొందుతుంది. ఫలితంగా తలనొప్పి తగ్గుతుంది.

పిప్పర్‌మింట్‌, లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనెలు కూడా ఉపయోగపడతాయి.


మైగ్రెయిన్‌ తలనొప్పి

ఇది ప్రధానంగా వాత దోషం (వాయు) వల్ల వస్తుంది. వాత దోషం కలిగిన వారి జీవనశైలి అస్తవ్యస్థంగా ఉంటుంది. కాబట్టే వీరిని మైగ్రెయిన్‌ నొప్పులు వేధిస్తాయి. మహిళల్లో హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు, నిద్రలేమి, ఆకలి, శరీరంలో పెరిగే విషాలు, అధికంగా కంప్యూటర్‌ వాడకం లాంటివి మైగ్రెయిన్‌ తలనొప్పికి కారణాలు. 


లక్షణాలు:

కత్తితో పొడిచినట్టు పోట్లు, నాడిలా కొట్టుకునే తత్వం ఈ నొప్పి ప్రధాన లక్షణాలు. ఈ నొప్పి తలకు ఒక వైపునే వస్తుంది. వెలుతురు, శబ్దాలకు స్పందించడం, తలతిరుగుడు, వాంతులు ఈ తలనొప్పికి జత అయి ఉంటాయి.


నివారణ:

ప్రతి రోజూ నియమిత వేళల్లో నిద్ర పోవడం, నియమిత వేళల్లో భోంచేయడం అలవాటు చేసుకోవాలి.

ఉష్ణాన్ని పెంచే పదార్థాలు తినాలి. వేడిగా, వండిన పదార్థాలు, జీలకర్ర, మిరియాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. తీపి, ఉప్పు రుచులను పెంచి, చేదు, వగరు రుచులకు దూరంగా ఉండాలి. జున్ను, కాఫీ, చల్లని, పొడి పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి.

పనిలో ఉన్నంత సేపు ప్రతి గంటకూ, కనీసం పది నిమిషాల పాటు పనిని పక్కన పెట్టి ఆరుబయటకు వెళ్లి తాజా గాలి పీలుస్తూ ఉండాలి.

నూనెతో మర్దన ఉపయోగపడుతుంది. కాబట్టి స్నానానికి ముందు మర్దన చేసుకోవాలి.

ఆయుర్వేద నశ్య నూనెలతో జలనేతి సాధన చేయాలి. ఇలా ముక్కు వెనక ఉంగే గాలి గదులైన సైన్‌సలను శుభ్రపరుచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. బ్రహ్మి, శంఖ, పుష్పి, జటమాంసి నూనెల సమ్మేళితమైన ‘మహానారాయణ’ తైలంతో తలకు పట్టు వేస్తే, తలనొప్పి క్షణాల్లో అదుపులోకి వస్తుంది.

 పిప్పర్‌మింట్‌, లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనెలు కూడా ఉపయోగపడతాయి.

కాళ్లను పైకి లేపి ఉంచే ఆసనాలు ఉపకరిస్తాయి. కటి విస్తారమయ్యే ఆసనాలతో వాత శక్తి శరీరం నుంచి బయటకు వెళ్లిపోయి స్వాంతన చేకూరుతుంది. అసౌకర్యం కలిగించనంత మేరకు కూర్చుని ముందుకు వంగే ఆసనాలు వేయాలి. 

 నెమ్మదిగా, దీర్ఘంగా తీసుకునే శ్వాస వల్ల కూడా మైగ్రెయిన్‌ నొప్పి తగ్గుతుంది. సమవృత్తి (ఉఛ్ఛ్వాసనిశ్వాసాలు సమంగా ఉండడం), విశ్వమవృత్తి (ఊపిరి పీల్చుకున్నంత వేగానికి తక్కువగా ఊపిరి వదలడం) లాంటి ప్రాణాయామాలతో ఉపయోగం ఉంటుంది.


సైనస్‌ తలనొప్పి

కఫ దోష హెచ్చుతగ్గుల కారణంగా ఈ తలనొప్పి వేధిస్తుంది. ఒకవేళ వాత దోషం కలిగిన వ్యక్తికి సైనస్‌ తలనొప్పి వచ్చిందంటే, అందుకు కారణం అతని సైన్‌సలు విపరీతంగా పొడిగా మారడమే! ఈ సూత్రం పిత్త దోష వ్యక్తులకూ వర్తిస్తుంది. కఫాన్ని పెంచే తేమతో కూడిన వాతావరణం వల్ల కూడా సైనస్‌ తలనొప్పులు వేధిస్తాయి. 


 లక్షణాలు:

కళ్లు, కణతలు, చెక్కిళ్ల చుట్టూ ఒత్తిడి. సైనస్‌ లక్షణాలు మైగ్రెయిన్‌ను పోలి ఉండవచ్చు. అయితే ఈ నొప్పిలో వాంతులు, తలతిరుగుడు, వెలుతురు, శబ్దాలకు నొప్పి పెరగడం లాంటి మైగ్రెయిన్‌ను పోలిన లక్షణాలు కనిపించవు.


నివారణ

చల్లని, నూనెలో ముంచి వేయించిన, భారీ పదార్థాలకు బదులుగా తేలికగా జీర్ణమయ్యే వీలున్న వేడి, పొడిగా ఉన్న పదార్థాలు తినాలి. తీపి, పులుపు, ఉప్పు రుచులను మానేయాలి. దాల్చినచెక్క, తులసి, నల్లమిరియాలు వంటకాల్లో వాడాలి.

పగటివేళ ఎండ ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి.

ప్రతి రోజూ వ్యాయామం చేయాలి.

 సైనస్‌లు వదులై కఫం బయటకు వచ్చేలా ఆవిరి పట్టాలి. ముక్కు దూలాలు, ఊపిరితిత్తులు తెరుచుకునేలా వేడి నీటి ఆవిరి రోజులో వీలైనన్ని సార్లు పడుతూ ఉండాలి. వేడి నీళ్లలో యూకలిప్టస్‌, రోజ్‌మేరీ, తులసి నూనెలు కొన్ని చుక్కలు వేసి, తువ్వాలు కప్పుకుని ఊపిరి పీల్చాలి. నీళ్లు తట్టుకోగలిగినంత వేడిగా ఉండేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. తర్వాత నేతి ముంతలో నింపిన నశ్య నూనెతో ముక్కు శుభ్రం చేసుకోవాలి. 

స్నానానికి ముందు కఫ నూనెతో మర్దన చేసుకోవాలి.

యూకలిప్టస్‌, పుదీనా, రోజ్‌మేరీ, పిప్పర్‌మింట్‌, కర్పూరాలు సైన్‌సలను తెరుస్తాయి.

శరీరాన్ని వెచ్చబరిచి కఫం బయటకు వెళ్లడానికి తోడ్పడే ఆసనాలు సాధన చేయాలి.


ఫలితం చూపించే చిట్కాలు!

తలనొప్పులకు సులువైన, ఫలవంతమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి. మరీ ముఖ్యంగా మునివేళ్లతో సున్నితమైన మర్దన తలనొప్పిని తగ్గిస్తుంది. అలాగే పిత్త దోషం కలిగిన వ్యక్తుల్లో తలనొప్పులకు ఒంట్లో నీటి శాతం తగ్గడం ప్రధాన కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన పానీయాలు, లేదా నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఈ దోషం కలిగిన వారు తలనొప్పిని అదుపు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో జలుబు వల్ల కూడా తలనొప్పి పెడుతుంది. ఇలాంటప్పుడు నాశికా రంథ్రాలు తెరుచుకునే చర్యలు చేపట్టడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే తలనొప్పిని తగ్గించే కొన్ని పదార్థాలు, మూలికలు కూడా ఉన్నాయి. అవేంటంటే...


 బ్రహ్మి:

చల్లబరిచే ఈ మూలిక ఒత్తిడి, మానసిక కుంగుబాటులను వదిలిస్తుంది. కాబట్టి ఈ కారణంగా తలెత్తే తలనొప్పుల కోసం బ్రహ్మిలో నెయ్యి కలిపి కొన్ని చుక్కలను ముక్కు రంరఽథాల్లో వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

 గంధం:

ఇది పురాతనమైన చిట్కా. గంధం నూరి నుదుటికి పట్టు వేయాలి. ఇందుకోసం అర చెంచా గంధం పొడికి కొన్ని చుక్కల నీళ్లు కలిపి వతుుద్దలా చేసి నుదుటి మీద 20 నిమిషాల పాటు పట్టు వేసుకోవాలి. 

తగర్‌:

ఈ మూలికకు దీర్ఘ చరిత్ర ఉంది. దీన్ని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సల్లో వాడుతూ ఉన్నారు. దీనికి ఉన్న ఔషధగుణాలు అమోఘమైనవి. దీన్ని ఔషధగుణాలు కలిగిన నూనెలతో కలిపి మర్దన చేయడం లేదా తేనీటిలో కలిపి సేవించడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

యాలకులు:

తలనొప్పులను తగ్గించుకోవడం కోసం యాలకులు నమలాలి.

రాతి ఉప్పు:

సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడకం మొదలుపెడితే పలు రకాల తలనొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చని నీటిలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగడం వల్ల తలనొప్పులు తగ్గుతాయి.


తలనొప్పుల బాధలు!

1. మైగ్రెయిన్‌: తలకు ఒక వైపున విపరీతమైన నొప్పి. అదే ప్రదేశంలో తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది. చూపులో, వినికిడిలో  తేడాలు కూడా ఉంటాయి. వాంతులు, తలతిరుగుడు ఉంటుంది.

2. జీర్ణ సమస్యలు: జీర్ణాశయం, మూత్రపిండాలు, పేగులు, పిత్తాశయంలో సమస్యల కారణంగా వచ్చే తలనొప్పి నుదుటి దగ్గర, కళ్ల చుట్టూరా ఉంటుంది.

3. ఒత్తిడి: మెడ నుంచి నడి నెత్తి వరకూ నొప్పి ఉంటుంది.

4. సైనస్‌: ముక్కు, నుదుటి దగ్గర ఉండే 8 సైన్‌సలలో కఫం చేరుకోవడం వల్ల కళ్లు, ముక్కు, నుదుటి దగ్గర నొప్పి ఉంటుంది.

5. ఆందోళన: తల చుట్టూరా నొప్పి ఉంటుంది.

Updated Date - 2021-10-12T05:56:38+05:30 IST