తల ఇక్కడ.. మొండెం ఎక్కడో?

ABN , First Publish Date - 2022-01-11T01:22:44+05:30 IST

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై మొండెం లేని తల కలకలం సృష్టించింది.

తల ఇక్కడ.. మొండెం ఎక్కడో?

నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై మొండెం లేని తల కలకలం సృష్టించింది. గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధి విరాట్‌నగర్‌ శ్రీమెట్టు మహంకాళి దేవాలయంలోని మహంకాళి మాత విగ్రహం కాళ్ల వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మొండెం నుంచి వేరు చేసిన తలను సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో పూజారి బ్రహ్మచారి గుర్తించారు. స్థానికులకు, పోలీసులకు సమాచారమివ్వటంతో హుటాహుటిన ఆలయానికి చేరుకుని మొండెం లేని తలను పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలిని నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు వచ్చి పరిశీలించాయి. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్‌లు మొండెం లేని తల ఉన్న స్థలం నుంచి  హైదరాబాద్‌, కొండమల్లేపల్లి, విరాట్‌నగర్‌ దారుల వైపు పరుగెత్తి, కొద్దిసేపటి ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్లూస్‌టీం బృందానికి కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. తలకు దేవరకొండ సివిల్‌ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అక్కడే భద్రపరిచారు.


ఎక్కడో హత్యచేసి

ఎక్కడో హత్యచేసి మొండెం లేని తలను ఇక్కడ ఉంచారని పోలీసులు భావిస్తున్నారు. మొండెం దొరకడంతో పాటు మృతిచెందిన వ్యక్తి తలను బంధువులు లేదా స్నేహితులు గుర్తిస్తేనే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సోమవారం రాత్రి వరకు హత్యకు గురైన వ్యక్తి ఎవరు అనేది పోలీసుల విచారణలో తెలియరాలేదు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరం, చింతపల్లి మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరాట్‌నగర్‌ శ్రీమెట్టు మహంకాళి దేవాలయం ఉన్న హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారి ఎప్పుడూ వాహనాల సంచారంతో రద్దీగా ఉంటుంది. తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడో చంపి వాహనంలో ఇక్కడికి వచ్చి తలను మహంకాళి మాత విగ్రహం పాదాల వద్ద ఉంచటంపై నర బలిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-11T01:22:44+05:30 IST