Viral Video: టీచర్‌ను కొట్టిన హెడ్మాస్టర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-25T22:54:01+05:30 IST

మనిషిని మనిషి గౌరవించడం చాతకాని సమాజంలో బతుకుతున్నామని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఆయన ఒక ప్రధానోపాధ్యాయుడు. మంచేదో, చెడేదో..

Viral Video: టీచర్‌ను కొట్టిన హెడ్మాస్టర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..

లఖీంపూర్: మనిషిని మనిషి గౌరవించడం చాతకాని సమాజంలో బతుకుతున్నామని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఆయన ఒక ప్రధానోపాధ్యాయుడు. మంచేదో, చెడేదో నలుగురికి చెప్పే స్థానంలో ఉన్న ఆయన సహనం కోల్పోయాడు. ఓ మహిళపై కోపంతో ఊగిపోతూ ‘షూ’తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ ప్రధానోపాధ్యాయుడి తీరుపై మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.



ఒక మహిళ అని కూడా చూడకుండా అలా పదేపదే ‘షూ’తో దాడి చేయడం ఏంటని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. చివరకు ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించారు. ఆ వ్యక్తికి గౌరవప్రదమైన ఉద్యోగం పోయింది. సమాజంలో గౌరవం పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి ప్రాంతంలోని ఒక గవర్నమెంట్‌ స్కూల్లో అజిత్ కుమార్ వర్మ హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో సీమా దేవీ అనే మహిళ శిక్షా మిత్రగా పనిచేస్తోంది. ఆమె అటెండెన్స్ విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బాధితురాలు సీమా దేవి ఈ గొడవ గురించి చెబుతూ.. రెండేళ్లుగా అటెండెన్స్ బుక్‌లో సంతకం చేసే విషయంలో అజిత్ కుమార్ వర్మ తనను వేధిస్తున్నాడని చెప్పింది.



జూన్ 24న తాను స్కూల్‌కు ఉదయం 7.35 నిమిషాలకే వెళ్లానని.. అయినప్పటికీ అటెండెన్స్ బుక్‌లో తన పేరును రౌండ్ చేసి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని తెలిపింది. ఎందుకిలా తన పేరును క్రాస్ చేశారని అడిగినందుకు తనపై ‘షూ’తో కొడుతూ దాడికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. ఈ ఘటన లఖీంపూర్‌లోని Mahngu Khera Schoolలో జరిగింది. విద్యార్థుల ముందే ఈ ఘటన జరగడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సదరు హెడ్మాస్టర్‌పై దేవి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు అతనిపై సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2022-06-25T22:54:01+05:30 IST