తాగుబోతును తన్నిన హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-06-13T06:55:22+05:30 IST

విచక్షణా రహితంగా ఓ తాగుబోతును కాలితో తన్నిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఎస్పీ పరమేశ్వరరెడ్డి సస్పెండ్‌ చేశారు.

తాగుబోతును తన్నిన హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 12: విచక్షణా రహితంగా ఓ తాగుబోతును కాలితో తన్నిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఎస్పీ పరమేశ్వరరెడ్డి సస్పెండ్‌ చేశారు. స్థానికులు, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో అన్నమయ్య కూడలిలో ఆర్డీవో కార్యాలయం వైపుగా వెళ్లే ఫ్రీలెఫ్ట్‌ మార్గంలో ఓ లారీ ఆగి ఉంది. లారీని అక్కడినుంచి తీసేయాలని డ్రైవర్‌కు హెడ్‌కానిస్టేబుల్‌ జగదీష్‌ కిషోర్‌ చెప్పారు. అనంతరం ఆయన కూడలిలోని ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ దగ్గరకు వచ్చేశారు. ఈ సమయంలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి లారీకి అడ్డుగా నిలబడి కదలనివ్వలేదు. లారీ డ్రైవర్‌ ఎంత చెప్పినా ఆ తాగుబోతు పక్కకు తప్పుకోకపోగా డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. గమనించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చి తాగుబోతును పక్కకు వెళ్లాలని చెప్పినా వినిపించుకోలేదు. పైగా ఆయన్ను దుర్భాషలాడుతూ ఆ ప్రాంతంలో కనిపించిన ఓ కర్రను తీసుకుని లారీకి ముందున్న ఆటోపై దాడికి యత్నించాడు. దాంతో స్థానికులు, హెడ్‌కానిస్టేబుల్‌ కలిసి తాగుబోతు నుంచి కర్రను లాక్కొన్నారు. కొంతసేపటికి మళ్లీ హెడ్‌కానిస్టేబుల్‌ను ఆ తాగుబోతు దుర్భాషలాడుతూ ఆయన వద్దకొచ్చాడు. సహనం కోల్పోయిన జగదీష్‌ కిషోర్‌ ఆ తాగుబోతును మూడుసార్లు కాలితో తన్నాడు. హెడ్‌కానిస్టేబుల్‌ కాలితో తన్నిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు. అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పిలిచి విచారించారు. ఆదివారం సాయంత్రం ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎవరైనా యూనిఫాం అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. అధికారం ఉందని.. ఇష్టం వచ్చినట్టు.. మానవత్వం లేకుండా ప్రవర్తించినందుకు హెడ్‌కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-06-13T06:55:22+05:30 IST