కారులో వెళ్తుండగా కనిపించిన ఓ పిచ్చివాడు.. పరిశీలనగా చూస్తే అతడెవరో గుర్తుపట్టి షాక్..

ABN , First Publish Date - 2021-07-28T03:07:46+05:30 IST

ముంబై వీధుల్లో కార్లో వెళ్తున్నారు వాళ్లు. అలా వెళ్తుండగా ఒక పిచ్చివాడు కనిపించాడు. ఆ పిచ్చివాడిని ఎక్కడో చూసినట్లు కారులోని వారికి అనిపించింది.

కారులో వెళ్తుండగా కనిపించిన ఓ పిచ్చివాడు.. పరిశీలనగా చూస్తే అతడెవరో గుర్తుపట్టి షాక్..

ఇంటర్నెట్ డెస్క్: ముంబై వీధుల్లో కార్లో వెళ్తున్నారు వాళ్లు. అలా వెళ్తుండగా ఒక పిచ్చివాడు కనిపించాడు. ఆ పిచ్చివాడిని ఎక్కడో చూసినట్లు కారులోని వారికి అనిపించింది. కొంత దూరం వెళ్లగానే ఏదో గుర్తుకు వచ్చి వెంటనే వెనక్కు వచ్చారు. అక్కడే ఉన్న పిచ్చివాడిని పట్టుకొని ‘సాజిద్’ అంటూ పలకరించారు. అప్పుడు బయటపడింది 45 ఏళ్ల క్రితం జరిగిన ఒక కథ. కారులోని వాళ్లు గుర్తుపట్టిన సాజిద్ పూర్తిపేరు సాజిద్ తుంగల్. కేరళలోని కొట్టాయంకు చెందిన అతను 1974లో గల్ఫ్‌ వెళ్లాడు. బతుకుతెరువు కోసం అక్కడకు వెళ్లిన అతను బాగానే బతికాడు. అబుధాబిలో సెటిలైన అతను.. అక్కడే మలయాళీ సినిమాల స్క్రీనింగులు నిర్వహిస్తూ, భారత సింగర్లు, డ్యాన్సర్ల ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తూ బాగానే సంపాదించసాగాడు. ఆ క్రమంలో 1976లో అతను ఒక బృందంతో పదిరోజులు గడిపాడు. ఆ బృందం అబుధాబి నుంచి విమానంలో చెన్నై బయలుదేరింది.


విమానం బాంబే చేరువలో ఉండగా ఒక ఇంజినులో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని బాంబే విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయబోయారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ విమానం కూలిపోయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఎయిర్‌లైన్స్ 171 విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 95 మంది సిబ్బంది, ప్రయాణికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ప్రముఖ మలయాళీ తార రాణీ చంద్ర కూడా మరణించారు. అయితే ఈ విమానంలో సాజిద్ ఎక్కలేదు. అందరూ మరణించడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన అతను.. కుటుంబాన్ని కాంటాక్ట్ చేయలేదు. ఆ తర్వాత ముంబై చేరుకొని అక్కడే స్థిరపడిపోయాడు.


ఇలా సాగుతుండగా 2019లో అతని స్నేహితుడు ఒకాయన సాజిద్‌ను గుర్తుపట్టి.. ముంబైలో ఒక చర్చి ఫాదర్ నడుపుతున్న షెల్టర్ హోంలో చేర్పించాడు. సాజిద్ మానసిక రుగ్మతలతో బాధపడ్డాడని, తను అంతవరకూ కలిసి ఉన్న బృందం చనిపోవడం అతనిపై చాలా ప్రభావం చూపిందని సదరు ఫాదర్ చెప్పాడు. రెండేళ్లపాటు ఆ షెల్టర్‌‌ హోంలో ఉన్న వారికి తన కుటుంబం గురించి కూడా చెప్పలేని స్థితిలో సాజిద్ ఉన్నాడు. అయితే తాజాగా ఒక సామాజిక కార్యకర్త సాజిద్ కోసం కేరళ వెళ్లి అతని కుటుంబం గురించి ఆరాతీశాడు. అక్కడి ఒక మసీదులోని ఇమామ్.. అతన్ని సాజిద్ కుటుంబం వద్దకు చేర్చాడు. అక్కడి నుంచి అతను చేసిన వీడియో కాల్ ద్వారా సాజిద్.. 45ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని తొలిసారి చూశాడు. ‘‘నాకు ఇంటికెళ్లాలని ఉంది. వీళ్లంతా నా బాగోగులు చూసుకోకపోయి ఉంటే కుటుంబాన్ని మళ్లీ చూసివుండే వాడినే కాదు’’ అంటూ సాజిద్ కన్నీరు విడుస్తున్నాడు.

Updated Date - 2021-07-28T03:07:46+05:30 IST