‘‘తమిళ చిత్ర పరిశ్రమకు బాలచందర్‌గారు నన్ను పరిచయం చేశారు. అయితే, నన్ను పెద్ద నటుణ్ణి చేసింది పంజు (పంజు అరుణాచలం)గారే’’ అని రజనీకాంత్ అన్నారు. ‘ద స్టార్ మేకర్ పంజు అరుణాచలం’ డాక్యుమెంటరీ ట్రైలర్లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘రాజాధి రాజా’, ‘గురుశిష్య’, ‘కళుగు’, ‘పాండియన్’, ‘ధర్మదురై’, ‘వీర’, ‘తంబిక్కు ఎన్న ఊరు’, ‘మణిదన్’ తదితర హిట్ చిత్రాలు రజనీ, పంజు కాంబినేషన్లో వచ్చాయి. ‘ద స్టార్ మేకర్ పంజు’ డాక్యుమెంటరీ సందర్భంతో తనతో పలు చిత్రాలు చేసిన దర్శకుడిపై రజనీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘పంజు నిస్వార్థ జీవి. ఆయనెప్పుడూ తన గురించి ఆలోచించలేదు. పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ‘ఓ ఇంటి కథ’ చిత్రంలో సుమారు 70 శాతం ఆయన జీవితంలో జరిగిందే’’ అని రజనీకాంత్ అన్నారు.