ఈ తరానికి బ్రాడ్‌మన్, లారా అతడే: బాబర్‌పై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-04-13T02:08:54+05:30 IST

పాక్ క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా ఖ్యాతికెక్కిన క్రికెటర్లతో ఆడిన పాక్ మాజీ కెప్టెన్ రషీద్..

ఈ తరానికి బ్రాడ్‌మన్, లారా అతడే: బాబర్‌పై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

లాహోర్: పాక్ క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా ఖ్యాతికెక్కిన క్రికెటర్లతో ఆడిన పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెట్ చరిత్రలో లెజెండ్స్‌గా పరిగణిస్తున్న అందరినీ పక్కనపెట్టేసిన లతీఫ్.. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసలు కురిపించాడు. మియాందాద్, వాసిం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజిమాముల్ హక్, యూసుఫ్, యూనస్, సక్లైన్ ముస్తాక్ వంటి ఆటగాళ్లతో ఆడానని లతీఫ్ గుర్తు చేసుకున్నాడు. అయితే, బాబర్ ఆజం ఇప్పుడు వాళ్లందరికంటే పైన ఉంటాడని చెప్పుకొచ్చాడు. 


అతడో గొప్ప ఆటగాడు అవుతాడని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశాడు. తాను ఒక్క బాబర్ గురించే మాట్లాడడం లేదని, విరాట్ కోహ్లీ,  రోహిత్ శర్మ, విలియమన్సన్.. ఈ కుర్రాళ్లందరూ వన్డేలు ఆడుతున్న క్రికెటర్లని, వారు పదిమంది ఫీల్డర్లతో బ్యాటింగ్ చేస్తున్నారని అన్నాడు. బాబర్ ఈ తరానికి చెందిన డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా అని ప్రశంసించాడు. అయితే, బాబర్‌కు మించి సయీద్ అన్వర్‌కు రేటింగ్ ఇచ్చాడు. ‘అన్వర్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ పాకిస్థాన్ బ్యాటర్’ అని లతీఫ్ పేర్కొన్నాడు. అన్వర్ పాక్ తరపున  55 టెస్టులు, 247 వన్డేలు ఆడాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు (భారత్‌పై 194 పరుగులు) 13 ఏళ్లపాటు అన్వర్ పేరుపైనే ఉంది. పాక్ క్రికెట్‌లో అన్వర్ లాంటి బ్యాటర్ ఇంకా రాలేదని అన్నాడు. 


నిస్సందేహంగా పాక్ క్రికెట్‌లో అన్వరే నెంబర్ వన్ బ్యాటర్ అని లతీఫ్ కొనియాడాడు. అతడిని తాను చాలా దగ్గరి నుంచి చూశానని పేర్కొన్నాడు. అతడు చాలా ఆకర్షణీయమైన ఆటగాడని అన్నాడు. అన్వర్ చాలా అరుదుగా ప్రాక్టీస్ చేసేవాడని, కాబట్టి తరాలతో అతడిని పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు.  ప్రస్తుతం సర్కిల్ లోపల ఐదుగురు ఫీల్డర్లు ఉంటున్నారని, అప్పట్లో నలుగురే ఉండేవారని అన్నాడు. సర్కిల్ బయట ఒక ఫీల్డర్ తక్కువగా ఉంటే అన్వర్, లేదంటే ఇంజమామ్ బౌలర్లను ఆడేసుకునేవారని అన్నాడు. వారు ఈ తరానికి చెందిన గొప్ప ఆటగాళ్లని అన్నాడు. అయితే, బాబర్ ఈ తరానికి చెందిన బ్రాడ్‌మన్, లారా అని లతీఫ్ పేర్కొన్నాడు. 


Updated Date - 2022-04-13T02:08:54+05:30 IST