సెలవు వెనుక...

ABN , First Publish Date - 2022-06-30T05:40:59+05:30 IST

హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు పది రోజులపాటు సెలవు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సెలవు వెనుక...

కౌన్సిల్‌ భేటీ రోజు నుంచే ఎందుకో?

పాలకవర్గంలో పరిణామాలే కారణమా?

టార్గెట్‌ చేస్తారన్న ఆందోళన నేపథ్యంలోనేనా?

నేడు కౌన్సిల్‌ సమావేశం


హిందూపురం టౌన్


హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు పది రోజులపాటు సెలవు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సెలవు లేఖ పంపడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అది కూడా కౌన్సిల్‌ సమావేశం రోజు నుంచే సెలవులోకి వెళ్లనుండడం వెనుక ప్రస్తుత పాలకవర్గంలో నెలకొన్న పరిస్థితులే కారణమని ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుత పాలకవర్గం ఏర్పడక ముందే హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌గా వెంకటేశ్వర్‌ రావు బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి అధికార పార్టీలోని ఓ వర్గం.. ఆయనపై విమర్శనాస్ర్తాలు సంధిస్తోంది. వారు చెప్పిన దానికి కమిషనర్‌ ఒప్పుకోకపోవడమే ఇందుకు కారణమని చర్చ సాగుతోంది. ఆ తరువాత కొంతమంది కౌన్సిలర్లతో ఆయనకు తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఒకానొక దశలో తనపై దాడి చేయడానికి వచ్చారని పోలీసు స్టేషనలో కౌన్సిలర్‌పై కమిషనర్‌ ఫిర్యా దు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత పాలకవర్గంలో కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి 10 గంటలు దాటాక తనకు పదిరోజుల సెలవు కావాలని ఉన్నతాధికారులు, మున్సిపల్‌ మేనేజర్‌కు కమిషనర్‌ లేఖ పంపడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పాలకవర్గంలో పరిణామాలే కారణమా?

హిందూపురం మున్సిపాలిటీలో గతేడాది కొత్త పాలకవర్గం కొలువుదీరింది. రెండు నెలలు తిరక్కుండానే అధికార పార్టీలోని కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవర్గం ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌కు అనుకూలంగా, మరోవర్గం వ్యతిరేకంగా ఉంటున్నాయి. కమిషనర్‌ వెంకటేశ్వర్‌ రావు.. ఎమ్మెల్సీకి అనుకూలంగా ఉన్నారని వ్యతిరేక వర్గం నాయకులు పలుసార్లు ఆరోపణలు గుప్పించారు. ఆయనపై ఉన్నతాధికారులతోపాటు ఏకంగా మున్సిపల్‌ శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. పలు కౌన్సిల్‌ సమావేశాల్లో కమిషనర్‌పై కొంతమంది సభ్యులు.. దురుసుగా వ్యవహరించడంతోపాటు ఆరోపణలు చేశారు. వాటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారించి నిరాధారమైనవని కొట్టిపారేశారు. అప్పటి నుంచి కౌన్సిలర్లు మరింత గుర్రుగా ఉన్నారు. ఎలాగైనా కమిషనర్‌ను ఇక్కడి నుంచి సాగనంపాలన్నదే వారి పట్టని ఆ వర్గం నాయకుల్లో కొదరు బహిరంగంగానే పేర్కొన్నారు. 



మెజార్టీ కౌన్సిలర్లు.. అసమ్మతి వైపు..

మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లున్నారు. వీరిలో 29 మంది వైసీపీ, 6 టీడీపీ, ఎంఐఎం, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. స్వతంత్ర కౌన్సిలర్‌ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ బలం 30కి చేరింది. అధికార పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా 15 మందికిపైగా కౌన్సిలర్లు అసమ్మతి వర్గంలో చేరారు. ఈ తరుణంలో కమిషనర్‌పై అసమ్మతి నాయకులు మరింత ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రతి చిన్న విషయానికి అధికారులను కౌన్సిలర్లు నిలదీస్తున్నారు. ఆఖరుకు వారం క్రితం ఓ కౌన్సిలర్‌ను బయటికి వెళ్లి ఫోన మాట్లాడమని అన్నందుకు కమిషనర్‌ కారు ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అసమ్మతి వర్గంలో ఉన్న అధికశాతం కౌన్సిలర్లు.. కమిషనర్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషనర్‌ సెలవు పెట్టాడా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


ఆసక్తికర చర్చ 

మున్సిపల్‌ కమిషనర్‌ రాత్రి 10 గంటలు దాటాక సెలవు పెట్టడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన అనారోగ్య కారణంగా ఆయుర్వేదిక్‌ మందు వాడేందుకు కర్ణాటకకు వెళ్తున్నట్లు పేర్కొంటున్నారు. అందుకోసం ఏకంగా పదిరోజులు సెలవు పెట్టడంపై రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. కమిషనర్‌ ఉదయం నుంచే పట్టణంలో పర్యటించి, సమస్యలు ఆరా తీస్తుంటారు. రాత్రి 9 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అలాంటిది పదిరోజులపాటు సెలవు ఎందుకు పెట్టారన్నదే ప్రశ్న.


ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలు..

మున్సిపల్‌ కమిషనర్‌ ఒక వర్గానికి అ నుకూలంగా ఉన్నారని అసమ్మతి వర్గం నాయకులు మొదట్నుంచి గుర్రుగా ఉన్నా రు. తాము ఏమిచెప్పినా పెడచెవిన పెడతారనీ, కనీసం వార్డుల్లో పర్యటించినపుడు కూడా తమకు సమాచారం ఇవ్వరని కమిషనర్‌పై అసమ్మతి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు కనీస మర్యాద లేకపోతే ఎందుకని పలుసార్లు ప్రశ్నించారు.


నేడు కౌన్సిల్‌ సమావేశం 

మున్సిపల్‌ సాధారణ కౌన్సిల్‌ సమావేశం గురువారం నిర్వహించనున్నారు. సమావేశంరోజు నుంచే కమిషనర్‌ సెలవు పెట్టడం వెనుక ఆంతర్యం ఉందని ఒకవర్గం నాయకులు అంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో వైసీపీ నాయకులు.. అధికారులపై దాడులు చేయడం సర్వసాధారణమైంది. వారం క్రితం కడప జిల్లాలో కమిషనర్‌పైనే కౌన్సిలర్‌ దాడిచేశారు. ఈ నేపథ్యంలో గురువారం కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమపై విమర్శనాస్ర్తాలు గుప్పించవచ్చనీ, ఇంకో అడుగు ముందుకేసి తనను టార్గెట్‌ చేయవచ్చని కమిషనర్‌ భావించారేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే గురువారం నుంచే సెలవు పెట్టారని తెలుస్తోంది. కమిషనర్‌ సెలవులో వెళ్లడంతో మున్సిపల్‌ ఇంజనీర్‌ మల్లికార్జునప్ప ఇనచార్జి  బాధ్యతలు నిర్వర్థించనున్నారు.


చికిత్స కోసమే..

చాలా రోజులుగా ఆయుర్వేద చికిత్సకు వెళ్లాల్సి ఉంది. బిజీగా ఉండి వెళ్లలేకపోయా. సమస్య తీవ్రమవడంతో ఉన్నతాధికారులకు సెలవు లేఖ పంపా. పది రోజులపాటు సెలవు మంజూరైంది. అంతే తప్ప సెలవు వెనుక ఇతర కారణాలు లేవు. పదిరోజుల తరువాత విధుల్లో చేరతా.

వెంకటేశ్వర్‌రావు,  మున్సిపల్‌కమిషనర్‌


Updated Date - 2022-06-30T05:40:59+05:30 IST