సీఎం చెప్పినా..

ABN , First Publish Date - 2022-06-16T05:46:27+05:30 IST

నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత, సీఎం జగన చెప్పినా.. అసమ్మతి సెగ చల్లారలేదు. మరింత రాజుకుంటోంది.

సీఎం చెప్పినా..

పురంలో తీవ్రస్థాయికి విభేదాలు

ఎమ్మెల్సీ ‘గడప గడపకు..’ చేపట్టడంపై

అసమ్మతి వర్గం ఆగ్రహం

ఇక్బాల్‌కు వ్యతిరేకంగా సమావేశం

ఆపకపోతే తడాఖా చూపిస్తామని హెచ్చరిక

హిందూపురం టౌన, జూన 15: నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత, సీఎం జగన చెప్పినా.. అసమ్మతి సెగ చల్లారలేదు. మరింత రాజుకుంటోంది. 14వ తేదీన ముఖ్యమంత్రి చెప్పి వెళ్లారు.. మరుసటి రోజు యథామామూలే. హిందూపురం మండలంలోని ఎం. బీరేపల్లిలో ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ చేపట్టిన గడప గడపకు.. కార్యక్రమానికి అసమ్మతి వర్గ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడంపై మండిపడ్డారు. ఇలా అయితే తమ తడాఖా చూపిస్తామంటూ అసమ్మతి వర్గం సవాల్‌ విసురుతోంది. ఆ మేరకు ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు.

జిల్లాకు ఈనెల 14వ తేదీన వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. పుట్టపర్తి ఎయిర్‌ పోర్టులో ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌, అసమ్మతి వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనితో మాట్లాడారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్సీకి సూచించారు. పురం వైసీపీ సమస్యను పరిష్కరిస్తాననీ, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇటీవల ఆదేశించారు. అయినా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. హిందూపురం మండలం ఎం.బీరేపల్లిలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌.. బుధవారం గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం తెలుసుకున్న అసమ్మతి నాయకులు పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆసిఫ్‌ ఇంట్లో సాయంత్రం సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. చిలమత్తూరు మండలంలో ఒక ఎంపీపీ, 9 మంది ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వకుండా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనీ, ఇది ప్రభుత్వ కార్యక్రమమా? ఎమ్మెల్సీ సొంత కార్యక్రమమా అని చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కూడా తమ మాట వినకుండా పనిచేస్తున్నారని ఆరోపించారు.

‘మొన్నటి వరకు ఎమ్మెల్సీ వద్ద ఉన్న గోపీకృష్ణను వైసీపీ సీనియర్‌ నాయకుడని ఎమ్మెల్సీ చెప్పేవారు. రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పీఏలతో సమావేశం నిర్వహించారు. దానికి గోపీకృష్ణ హాజరయ్యారు. ఆయన సీనియర్‌ నాయకుడా? లేక పీఏనా? అనేది ఎమ్మెల్సీ స్పష్టం చేయాలి’ అని ఎంపీపీ పురుషోత్తంరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన బలరామిరెడ్డి మాట్లాడుతూ తమకు తెలియకుండా తమ వార్డుల్లో గడప గడపకు నిర్వహిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. కౌన్సిలర్లకు సంబంధించిన పనులు చేయొద్దని కొంతమంది అధికారులకు ఎమ్మెల్సీ సూచించినట్లు తెలిసిందనీ, అలా చేస్తే అందరం కలిసి మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారులు ఎలా పనిచేయరో చూద్దామని ఆయన పార్టీ నాయకులతో అన్నారు. కౌన్సిలర్లు ఎవరూ అధైర్యపడవద్దనీ, పోరాటం చేద్దామని అన్నారు. లేదంటే ‘మన గడప గడపకు ఎలా ఉంటుందో తడాఖా చూపిద్దామ’ని అన్నారు. 

కొన్ని రోజులుగా అధికారులు తమ పనులు చేయడం లేదని కౌన్సిలర్‌ నాగేంద్రమ్మ అన్నారు. ‘కొన్ని రోజుల క్రితం వైన షాపులో ఓ వ్యక్తిని నియమించాం. అతడు ఎమ్మెల్సీ వద్దకు వెళ్లలేదని తొలగించారు. చిలమత్తూరులో కూడా వైసీపీ కార్యకర్తను వైనషాపు నుంచి తొలగించారు. ఎంపీపీ వెంట అతడు ఉండటమే ఇందుకు కారణం’ అని కౌన్సిలర్‌ నాగేంద్రమ్మ అన్నారు. 

తమ సమస్యలు పరిష్కారం కానందుకే బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నామని మిగిలిన కౌన్సిలర్లు అన్నారు. పార్టీ కోసం పనిచేయని వారిని అందలం ఎక్కించారనీ, మూడు ఓట్లు కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్సీ తన వెంట తిప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. వారంతా 2019కి ముందు ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ పదవులకు ఎవరిని అడిగి పేర్లు పంపారని ఎమ్మెల్సీని నిలదీశారు. కొంతమందిని వెంట వేసుకోవడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని వాపోయారు. ఈ విషయాలను మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. అంతవరకు ఎమ్మెల్సీ గడప గడపకు నిర్వహించరాదని అన్నారు. మంత్రి వచ్చి పరిష్కరించిన తరువాతే ముందుకెళ్లాలని డింమాండ్‌ చేశారు.

పార్టీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి మట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయానా హిందూపురంలో నెలకొన్న వర్గ విభేదాలపై ఆరాతీశారన్నారు. సీఎం చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి, గడప గడపకు ఎమ్మెల్సీ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అసమ్మతి నాయకుల సమావేశానికి పలువురు ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.


‘గడప గడపకు..’ ఎమ్మెల్సీ

హిందూపురం మండలంలోని ఎం.బీరేపల్లిలో ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ గడప గడపకు కార్యక్రమాన్ని 13వ రోజు నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీటీసీ నాగభూషణం, సర్పంచ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌ మారుతిరెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన పురుషోత్తంరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు రంగనాథ్‌, మరికొంతమంది సర్పంచలు, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-16T05:46:27+05:30 IST