ఖాకీ, ఖద్దర్‌ మాకొద్దు

ABN , First Publish Date - 2022-05-22T06:19:09+05:30 IST

హిందూపురం నియోజకవర్గం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌కు వ్యతిరేకవర్గమంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఖాకీ, ఖద్దర్‌ మాకొద్దు

పక్కా లోకల్‌కే ప్రాధాన్యమివ్వాలి

‘పురం’ వైసీపీలో అసమ్మతి సెగలు  

రెండు రోజులు రహస్య భేటీలు

విదేశీ పర్యటనలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ 

హిందూపురంలో ఎంపీ అద్దె ఇల్లు 

బుజ్జగింపునకు దిగిన ఎమ్మెల్సీ వర్గీయులు 

పుట్టపర్తి, మే 21 (ఆంధ్రజ్యోతి): హిందూపురం నియోజకవర్గం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌కు వ్యతిరేకవర్గమంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా అధికార వైసీపీలో ముఖ్య నాయకులు రహస్యంగా సమావేశాలు నిర్వహించడం ఆపార్టీలో చర్చనీయంగా మారింది. హిందూపురం నియోజకవర్గ ఇనచార్జ్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌తోపాటు ఎంపీ గోరంట్ల మాధవ్‌కు వ్యతిరేకంగా ‘కీలక’ నాయకులు పావులు కదుపుతున్నారు.  హిందూపురం అధికార వైసీపీలో కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా నానలోకల్‌ ఎమ్మెల్సీతోపాటు పార్టీ జెండా మోయని వారు అధికారాన్ని చెలాయిస్తున్నారంటూ కొందరు వైసీపీ నాయకులు మనోవేదనకు గురయ్యారు. నియోజకవర్గంలో ఆధిపత్యపోరు కోసం నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ‘పోలీసుల రాజ్యం’ మాకొద్దు.. ఈ ఖద్దరు ఖాకీ ఇంకెన్నాళ్లు.. అన్న నినాదంతో వైసీపీలో ముఖ్య నేతలు దూకుడుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 


‘పురం’పై నానలోకల్‌ పెత్తనమా?

ప్రస్తుత అధికార వైసీపీలో లోకల్‌, నానలోకల్‌ అంశాన్ని తెరపైకి వచ్చింది. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డాం, కేసులు వేయించుకుని జైలుపాలయ్యాం.. అలాంటి మమ్మల్నే పక్కన పెడతారా? నానలోకల్‌ వాళ్లు వచ్చి మాపై దబాయిస్తే చూస్తూ ఊరుకోవాలా?..’ అంటూ  వైసీపీలో కొందరు నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు. తాజాగా నానలోకల్‌ వద్దంటూ నియోజకవర్గంలోని కీలకమైన ఓ రాష్ట్ర స్థాయి నాయకుడు, నామినేట్‌ పదవి పొందిన ఓ వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ సమన్వయకర్తలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పలువురు కీలక మండల స్థాయి నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్ట్‌లో శుక్రవారం ముఖ్య నేతలందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి  హిందూపురం మున్సిపల్‌ వైస్‌ చైర్మన, చిలమత్తూరు, లేపాక్షి మండలాలకు చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్లు ముఖ్యనాయకులు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న నాయకుడే ఇనచార్జ్‌గా ఉండాలంటూ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సమాచారం. తాజాగా శనివారం కూడా హిందూపురం పట్టణంలోని బాలయేసు కళాశాలలో నాయకులు మరోమారు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏపీ ఆగ్రోస్‌ చైర్మన నవీననిశ్చల్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాలరెడి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన బలరామిరెడ్డితోపాటు 12మంది కౌన్సిలర్లు, లేపాక్షి, చిలమత్తూరు ఎంపీపీలు, లేపాక్షి వైస్‌ ఎంపీపీలు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. అదే విదంగా పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్యనాయకులు వంద మందిదాకా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురంలో పోలీసు రాజ్యం మనకొద్దంటూ నినదించారు. ఎంపీ, ఎమ్మెల్సీలు మాజీ పోలీసులు కావడంతో వారి వద్దకు దేనికైనా వెళ్లాలంటే నేరుగా మాట్లాడటానికి వీలుండదన్నారు.


పోలీస్‌ ‘ఖద్దరు’ వద్దకు వెళ్లాలా?

‘పార్టీ కోసం కష్టపడ్డాం. ఏదైనా పని జరగాలంటే మధ్యవర్తుల సాయం అవసరమా? వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇన్ని కష్టాలా..? ఇంతలా అడుక్కోవాల్సిన పరిస్థితి మనకెందుకు వచ్చింది?’ అంటూ తాజాగా జరిగిన సమావేశంలో మెజార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే 2024లో హిందూపురంలో వైసీపీకి పుట్టగతులుండవని సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. జరుగుతున్న అవమానాలు, పార్టీలో జరుగుతోన్న నష్టాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లాలని వైసీపీ నాయకులు చర్చించారు. మన ఊర్లో.. మన పార్టీలో నానలోక్‌ పెత్తనం అవసరమా? ఆ పెత్తందారీని కట్టడి చేసేందుకు కార్యాచరణ ప్రకటించేందుకు నాయకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 


ఈ పోలీస్‌ కాకపోతే ఆ పోలీస్‌!

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభించిన వారంలోనే ఎమ్మెల్సీ షేక్‌మహ్మద్‌ ఇక్బాల్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ విదేశీ పర్యటనకు వెళ్లడం, ఎంపీ గోరంట్ల మాధవ్‌ రెండ్రోజుల క్రితం హిందూపురంలో ఇంటిని అద్దెకు తీసుకోవడం చర్చనీయంగా మారింది. ఎమ్మెల్సీ బదులుగా గడపగడపకు కార్యక్రమం ఎంపీ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో ‘ఈ పోలీస్‌ కాకపోతే ఆ పోలీస్‌’ అంటూ అసమ్మతి వైసీపీ నాయకులు మండిపడినట్లు విశ్వసనీయ సమాచారం.


వ్యతిరేకవర్గం బల ప్రదర్శనా?

రెండు రోజుల్లో వైసీపీలోని ఓ వర్గం ముమ్మరంగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. దీంతో వ్యతిరేకవర్గమంతా ఏకతాటిపైకి వచ్చేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా జరిగిన రెండు సమావేశాలకు ముఖ్య నాయకులు అంతా తామై వ్యవహరించారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు నవీననిశ్చల్‌, అబ్దుల్‌ఘని, వేణుగోపాల్‌రెడ్డి మరికొంతమంది నాయకులు స్వయంగా వెళ్లి మండల స్థాయి నాయకులను కలిసినట్లు తెలుస్తోంది. అసమ్మతి సమావేశాన్ని ఆలస్యంగా పసిగట్టిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గీయులు కూడా రంగంలోకి దిగారు. అసమ్మతి సమావేశానికి వెళ్లిన హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు బుజ్జగించి సాయంత్రం ఎమ్మెల్సీ ఇంటి వద్ద అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఏది ఏమైనా హిందూపురంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీ వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది.


Updated Date - 2022-05-22T06:19:09+05:30 IST