ఎవరి దారి వారిదే..

ABN , First Publish Date - 2021-10-28T09:07:30+05:30 IST

దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తున్నా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పాలకులు మాత్రం పంతాలు....

ఎవరి దారి వారిదే..

 హెచ్‌సీఏ పాలకుల్లో కనిపించని మార్పు

 ‘ముస్తాక్‌ అలీ’కి అజర్‌ జట్టే ఫైనల్‌?


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తున్నా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పాలకులు మాత్రం పంతాలు, పట్టింపులు  వీడడం లేదు. హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీం లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిన తర్వాత కూడా ముస్తాక్‌ అలీ టోర్నీకి హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌.. తన్మయ్‌ అగర్వాల్‌ కెప్టెన్‌గా ఒక జట్టును, ఇతర కార్యవర్గ సభ్యులు హనుమ విహారి కెప్టెన్‌గా మరో జట్టును ప్రకటించి హెచ్‌సీఏ పరువును బజారున పడేశారు. ప్రస్తుతం ఇతర ముఖ్యమైన కేసులు విచారణ ఉండడంతో బుధవారం హెచ్‌సీఏ కేసుకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన ధర్మాసనం.. దీపావళి సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.


ఇదిలావుంటే అజరుద్దీన్‌ ప్రకటించిన జట్టు ఇప్పటికే క్వారంటైన్‌లోకి వెళ్లడంతో పాటు బీసీసీఐ ఈ జట్టునే గుర్తించినట్టు సమాచారం. దీంతో అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. అజర్‌ వర్గం తనకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై విహారి అలకపూనినట్టు తెలుస్తోంది. హెచ్‌సీఏలోని రెండు వర్గాల మధ్య విభేదాలు కాస్తా ఆటగాళ్ల నడుమ పొరపొచ్చాలు తీసుకొచ్చేలా ఉన్నాయని.. దీని ప్రభావం వారి ప్రదర్శనపై పడుతుందని మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యకం చేస్తున్నారు. సుప్రీం కోర్టు సీబీఐ లేదా మాజీ న్యాయమూర్తులతో దర్యాప్తు చేయిస్తామన్నాక కూడా వీరి కీచులాటలు ఆపకపోవడాన్ని హెచ్‌సీఏ క్లబ్‌ సెక్రటరీలు ఆక్షేపిస్తున్నారు. సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకుంటున్నారు. చెక్కులపైన మాత్రమే అధ్యక్ష, కార్యదర్శిని సంతకం చేయమని కోర్టు చెప్పిందని అజర్‌ వర్గం చెబుతుండగా, కోర్టు రెండు వర్గాలను కలిసి పనిచేయమన్నదని విజయానంద్‌ వర్గం అంటోంది. 

Updated Date - 2021-10-28T09:07:30+05:30 IST