‘హెచ్‌సీఎల్‌’ భళా!

ABN , First Publish Date - 2020-10-17T05:47:14+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం రూ.3,142 కోట్లుగా నమోదైంది.

‘హెచ్‌సీఎల్‌’ భళా!

క్యూ2 లాభం 18.5ు అప్‌.. రూ.3,142 కోట్లుగా నమోదు..

  డీల్స్‌లో ఆల్‌టైం రికార్డు వృద్ధి 


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం రూ.3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.2,651 కోట్ల లాభంతో పోలిస్తే 18.5 శాతం పెరిగింది. సమీక్షా కాలానికి కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 6.1 శాతం వృద్ధి చెంది రూ.18,594 కోట్లకు చేరుకుంది.


గడిచిన మూడు నెలల్లో అన్ని విభాగాలు, మార్కెట్లతో పాటు మోడ్‌ 1,2,3 ఆఫరింగ్స్‌లోనూ అద్భుతమైన పనితీరు నమోదైందని హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే కొత్త బుకింగ్స్‌ 35 శా తం పెరిగాయన్నారు. కొత్తగా 15 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, తద్వారా డీల్స్‌ త్రైమాసిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధి చెందాయన్నారు. డీల్స్‌ విషయంలో ఇదే ఆల్‌టైం రికార్డు వృద్ధి అని విజయ్‌ కుమార్‌ తెలిపారు. 


ఉద్యోగులందరికీ జీతాల పెంపు 

ఈ అక్టోబరు 1 నుంచి ఈ3 స్థాయి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు విజయ్‌ తెలిపారు. ఈ4, ఆపై స్థాయి ఉద్యోగుల వేతనాలు మాత్రం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెరగనున్నాయని వెల్లడించారు. కరోనా  కారణంగా కంపెనీ జీతాల పెంపును ఒక త్రైమాసికం పాటు వాయిదా వేసింది. ఈ సారి శాలరీ హైక్‌ గత ఏడాది స్థాయిలోనే ఉండనుందన్నారు. 


రూ.4 మధ్యంతర డివిడెండ్‌ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను కంపెనీ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.4 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది.




9,000 నియామకాలు 

గత నెల 30 నాటికి కంపెనీలో 1,53,085 మంది పనిచేస్తున్నారు. క్యూ2లో ఉద్యోగుల వలసల (ఆట్రిషన్‌) రేటు 12.2 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 3,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్నట్లు హె చ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ అప్పారావు తెలిపారు. ద్వితీయార్ధంలో మరో 7,000-9,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలివ్వనున్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-10-17T05:47:14+05:30 IST