లాయర్‌కు రూ. 10 వేలు గిఫ్ట్‌గా ఇచ్చిన చీఫ్ జస్టిస్! ఎందుకంటే..

ABN , First Publish Date - 2020-07-16T02:12:39+05:30 IST

కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన ఓ యువ లాయర్ చేతిలో చెల్లిగవ్వ కూడా లేకపోవడంతో అతడు పొట్ట నింపుకునేందుకు బుట్టలు అల్లడం ప్రారంభించాడు.

లాయర్‌కు రూ. 10 వేలు గిఫ్ట్‌గా ఇచ్చిన చీఫ్ జస్టిస్! ఎందుకంటే..

చెన్నై: కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన ఓ యువ లాయర్ పొట్ట నింపుకునేందుకు బుట్టలు అల్లడం ప్రారంభించారు. పూర్వీకుల నుంచీ వస్తున్న కులవృత్తినే నమ్ముకున్నారు. అయితే ఆయన పరిస్థితి గురించి తెలుకున్న న్యాయమూర్తికి గుండె తరుక్కుపోయింది. దీంతో మరో ఆలోచన లేకుండా ఆ యువలాయర్‌కు జడ్జీ.. రూ. 10 వేల తక్షణ ఆర్థిక సాయం అందించారు. ఆ యువ లాయర్ పేరు ఉత్తమకుమరన్. తమిళనాడుకు చెందిన ఓ గిరిజన తెగకు చెందిన వారు. ఆ కుటుంబంలో ఆయనే తొలి పట్టభద్రుడు, తొలి లాయర్ కూడా. ఆయనకు భార్య, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా లాయర్ వృత్తి ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోయింది. చెతిలో డబ్బులు నిండుకున్నాయి. దీంతో ఆయన బుట్టలు అల్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.


ఆ లాయర్ దయనీయ స్థితి గురించి ఓ జాతీయ పత్రిక ప్రచురించింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు తాను ఏ పని చేయడానికైనా సిద్ధమేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ విషయం చత్తీస్‌ఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీనన్ దృష్టి కెళ్లింది. లాయర్ ఎదుర్కొంటున్న దయనీయస్థితి న్యాయమూర్తిని కదిలించింది. దీంతో న్యాయమూర్తి యువలాయర్‌‌కు ఓ లేఖతో పాటు రూ. 10 వేలను పంపించారు. ‘ఇది మీ మీద జాలితో చేస్తున్న సహాయం కాదు. ఇదేమీ విరాళం కూడా కాదు. నేను మీకిచ్చే బహుమతి ఇది. కష్టించి పని చేయడంలో ఉన్న గౌరవాన్ని గుర్తించిన మీ వ్యక్తిత్వానికి ఇదో గుర్తింపు, బహుమతి’ అని న్యాయమూర్తి యువలాయర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. 

Updated Date - 2020-07-16T02:12:39+05:30 IST