Delhi: ఎల్‌జీని కించపరచే పోస్టులు తొలగించండి...ఆప్‌కు హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-09-27T20:05:44+05:30 IST

ఆమె ఆద్మీ పార్టీ (AAP), ఆ పార్టీ నేతలు పలువురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా..

Delhi: ఎల్‌జీని కించపరచే పోస్టులు తొలగించండి...ఆప్‌కు హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆమె ఆద్మీ పార్టీ (AAP), ఆ పార్టీ నేతలు పలువురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai kumar saxena) వేసిన పరువునష్టం కేసు(Defamation case)లో ఢిల్లీ హైకోర్టు (Delhi High court) మంగళవారంనాడు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఎల్‌జీపై ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలని ఆప్, ఆ పార్టీ నేతలను ఆదేశించింది. ఆయనను కించపరచే పోస్టులు, వీడియాలు, ట్వీట్లను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని జస్టిస్ అమిత్ బన్సాల్ ఆదేశించారు.


ఆప్‌కు చెందిన అతిషి, సౌరబ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, సంజయ్ సింగ్, జాస్మిన్ షా‌లపై సక్సేనా పరువునష్టం కేసు వేశారు. తనపై సోషల్ మీడియాలో చేసిన తప్పుడు, అవమానకరమైన పోస్టులు, ట్వీట్లు, వీడియోలను తొలగించాలని సక్సేనా కోర్టును కోరారు. ఆప్, ఆ పార్టీ నేతలు ఐదుగురు తనకు రూ.2 కోట్ల నష్టపరిహారం  చెల్లించాలని కూడా ఎల్జీ డిమాండ్ చేశారు. సక్సేనా 2016లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.1.400 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై ఎల్‌జీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రణాళికాబద్ధమైన ఉద్దేశంతో చట్టాన్ని అమలు చేసే సంస్థలు తీసుకునే చర్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆప్ ఈ ఆరోపణలు చేసిందని కోర్టుకు తెలిపారు.


సక్సేనా కేవీఐసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన కుమార్తెకు ఖాదీ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఆప్ నేతల ఆరోపణల్లో ఒకటిగా ఉంది. దీనిపై ఆప్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఇది నిజమని, ఎవరూ కాదనలేని సత్యమని అన్నారు. దీనిపై సక్సెనా న్యాయవాది మాట్లాడుతూ, నిజానికి ప్రో బోనో బేసిస్‌లో ఖాదీ లాంజ్ డిజైనింగ్‌కు సక్సేనా కుమార్తె సహకరించారని, తన సేవలకు ఒక్క పైసా కూడా తీసుకోలేదని కోర్టుకు వివరించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ, డబ్బులు తీసుకోనప్పుడు అది అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Updated Date - 2022-09-27T20:05:44+05:30 IST