ప్రతిపక్షాలకు ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2022-06-15T07:42:18+05:30 IST

భారత రాజకీయాలు సంఘర్షణాత్మకంగా మారుతున్నాయి. 2024 సార్వత్రక ఎన్నికల నాటికి ఈ సంఘర్షణ మరింత తీవ్రంగా మారే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడం ఎలా...

ప్రతిపక్షాలకు ప్రమాద ఘంటికలు

భారత రాజకీయాలు సంఘర్షణాత్మకంగా మారుతున్నాయి. 2024 సార్వత్రక ఎన్నికల నాటికి ఈ సంఘర్షణ మరింత తీవ్రంగా మారే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడం ఎలా అన్న జటిల సమస్యను దేశంలో కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. ఇది కేవలం రాజకీయంగా ఎదుర్కోవడం అయితే ఈ పార్టీలు ఆందోళన చెందేవి కావేమో. కాని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యర్థులపై అన్ని ఆయుధాలను ప్రయోగిస్తోంది. ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వీలైన అన్ని శక్తులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే సోమ, మంగళ వారాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణలో పాల్గొనాల్సి వచ్చింది. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత సోనియాగాంధీ కూడా ఈ విచారణలో పాల్గొనాల్సి వస్తుంది. దేశంలో ప్రతిపక్షాలకు చెందిన ప్రతి ముఖ్య నాయకుడూ ఆత్మరక్షణలో ఉన్నారనడంలో సందేహం లేదు.


రాజకీయాల్లో ఎవరు అక్రమాలకు పాల్పడ్డా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కాని ఆ చర్యలు వేగంగా, న్యాయసమ్మతంగా, చట్టప్రకారం జరిగినట్లు కనపడాలి. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై ఉన్న ఆరోపణలపైనా వేగంగా విచారణ జరిగి శిక్షపడిన దాఖలాలు లేవు. 1998లో రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి తుంగన్‌కు 17 సంవత్సరాల తర్వాత కోర్టు నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై కేసును తేల్చడానికి కూడా 18 సంవత్సరాలు పట్టింది. చివరకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించడానికి కూడా సిబిఐ కోర్టు 17 సంవత్సరాల కాలం ఆలస్యం చేసింది. ఇది కేవలం న్యాయవ్యవస్థ తప్పు మాత్రమే కాదు. తమ రాజకీయ అవసరాల కోసం అధికారంలో ఉన్న వారు కొన్ని కేసులను తేల్చడం జీవిత కాలం ఆలస్యం చేయగలుగుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ పదవీ బాధ్యతలు చేపట్టగానే ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ రోజువారీ చేపట్టి ఏడాదిలోపు ముగించాలని భావించారు. న్యాయమూర్తులను బదిలీ కూడా చేయవద్దన్నారు. నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(1), 8(2), 8(3)లో నిర్దేశించిన నేరాలకు గాను ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను వేగవంతంగా తేల్చాలని, ఛార్జిషీటు దాఖలైన ఏడాది లోపు విచారణ పూర్తి కావాలని 2014లోనే అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా కూడా నిర్దేశించారు. ప్రధాన న్యాయమూర్తులు మారతారు కాని వారి ఆదేశాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. ఆ పుటలకు క్రమంగా చెదలుపడతాయి. న్యాయవ్యవస్థతో రాజకీయ, అధికార వ్యవస్థలు చెలగాటమాడినా, న్యాయవ్యవస్థ అన్ని సమయాల్లో తన స్వతంత్రతను నిలబెట్టుకోలేకపోయినా ఎవరూ ఏమి చేయలేరన్న విషయం స్పష్టమవుతోంది. నేరచరితులు అధికార పార్టీల్లోకి మారినా, లేదా అధికార పార్టీ మిత్రపక్షంగా మారినా, లేదా తామే అధికారంలోకి వచ్చినా తప్పించుకోవడం సాధ్యమన్న విషయం అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు దేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలపై పెట్టిన కేసులు ఎప్పుడు కొలిక్కి వస్తాయో చెప్పలేము. సోనియా, రాహుల్ గాంధీలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానక్కర్లేదని చెప్పిన సుప్రీంకోర్టు 2015లోనే వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. మళ్లీ కాంగ్రెస్‌లో కొంత కదలిక వస్తున్న నేపథ్యంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసులు పెట్టారని, రాజకీయంగా, ఆర్థికంగా తమను బలహీనం చేసేందుకే ఈ చర్యలు ప్రారంభించారని ఆ పార్టీ నేతలు చెప్పడాన్ని పూర్తిగా కొట్టి వేయలేము. కేవలం ప్రతిపక్షాలకు చెందిన వారిపైనే కేంద్ర సంస్థలు దృష్టి కేంద్రీకరించడం, అధికార పార్టీ వారిని కాని, వాటి మిత్రపక్షాలను కాని పట్టించుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ‘అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ బిజెపిలో చేరిన తర్వాత ఈడీ కానీ, సిబిఐ కానీ ఆయనను ఒక్కసారి కూడా పిలిపించలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై కేసులున్నా ఆయనకు సమన్లు లేవు. నారాయణ్ రాణే, రామన్ సింగ్, ముకుల్‌రాయ్, సువేందు అధికారిలపై కూడా కేసులున్నాయి. కాని బిజెపిలో చేరిన తర్వాత అవి నత్త నడక నడుస్తున్నాయి..’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా అన్నారు. 


కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెట్టారన్న పేరుతో కాంగ్రెస్ రాజకీయ హడావిడి చేయడం ఒక విచిత్ర పరిణామం. నిజానికి గతంలో కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసినప్పుడు ఎప్పుడూ పార్టీ బలసమీకరణ చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈడీ కేసు విచారణకు వెళ్లాల్సి వస్తే మాత్రం ముఖ్యమంత్రులు, ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులతో సహా వేలాది మందిని ఢిల్లీ వీధుల్లో సమీకరించారు. వారు ఈడీ ఆఫీసు ముందు కూడా మోహరించారు. గతంలో ఎమర్జెన్సీ తర్వాత షా కమిషన్ ముందు ఇందిరాగాంధీ హాజరైనప్పుడు ఇదే విధంగా మందీమార్బలంతో వెళ్లారు. అదే వ్యూహాన్ని రాహుల్ గాంధీ విషయంలో అనుసరించడం వల్ల జనంలో ఎంతమేరకు సానుభూతి లభిస్తుందన్నది చర్చనీయాంశం. అయినప్పటికీ పార్టీ కార్యకర్తల్ని సమీకరించేందుకు ఈ ఉదంతాన్ని ఉపయోగించడం కాంగ్రెస్‌లో కొంత కదలిక తెచ్చిందనే భావించాలి.


నిజానికి కాంగ్రెస్ సైతం గతంలో న్యాయవ్యవస్థతో చెలగాటమాడింది. ఈ వాస్తవం తెలిసినందువల్లే కేంద్రంలోని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అదే గేమ్‌ను ఉధృతం చేసింది. ఎంత ఉధృతం చేసిందంటే ఇప్పుడు ప్రతిపక్షాల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు ప్రతిపక్షాలు కలిసికట్టుగా బిజెపిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయి. కలిసికట్టుగా లేకపోతే తాము ఏకాకి అవుతామని, అప్పుడు మోదీ తమను ఫినిష్ చేయగలరని వాటికి తెలుసు. అందుకే రాజకీయ కార్యాచరణ పేరుతో అవి ఏకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు వాటికొక అవకాశాన్ని కల్పించాయి.


రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ వద్ద బలం 49 శాతం మాత్రమే ఉన్నది. ఎన్డీఏ యేతర పక్షాల బలం 51 శాతం మేరకు ఉన్నది. కాని బిజూ జనతాదళ్, వైసీపీ, చిన్నా చితక పార్టీలు మద్దతునిస్తే బిజెపికి మరో ఏడు శాతం బలం చేకూరుతుంది. అందువల్ల 56 శాతం పైగా ఓట్లతో బిజెపి అభ్యర్థి అవలీలగా గెలిచే అవకాశాలున్నాయి. ఇతర పార్టీలను ఆకర్షించి తమ వైపుకు తిప్పుకోవడంలో మోదీకి మించిన సిద్ధహస్తులు ఎవరూ లేరు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి స్వతంత్రులు, చిన్నా చితక పార్టీలనే కాదు, కాంగ్రెస్ సభ్యులను కూడా తమ వైపుకు తిప్పుకోగలింది. అందువల్ల మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకల్లో బిజెపి అదనపు సభ్యులను గెలిపించుకోగలిగింది. ఇదే రణతంత్రాన్ని బిజెపి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రయోగిస్తుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ తమ బలాన్ని సమీకరించుకుని భావి కార్యాచరణ వైపు మొగ్గేందుకు రాష్ట్రపతి ఎన్నికలు తోడ్పడతాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఇవాళ ఏ ఒక్క పార్టీ బలపడే అవకాశాలు లేవు. ఒక కూటమి, సంయుక్త కార్యాచరణ ద్వారానే బిజెపిని వివిధ పార్టీలు ఎదుర్కోగలగాలి. బిజెపిని ఎదుర్కోగల బలమైన పార్టీ లేనందువల్లే కేసిఆర్ లాంటి నేతలు కూడా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయడంపై తర్జనభర్జనలు చేస్తున్నారు. ఆప్, బిఎస్‌పి, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించగా లేనిది టిఆర్ఎస్ మాత్రం ఎందుకు విస్తరించకూడదనేది ఆయన ఆలోచన. ఇది సాధ్యపడుతుందా అన్నది వేరే విషయం. గతంలో కామరాజ్, ఎన్టీఆర్, చంద్రబాబు దక్షిణాది నుంచి ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది నేతలు ఢిల్లీ రాజకీయాలనూ, దేశ ఎజెండానూ ప్రభావితం చేయగలిగిన స్థితిలో లేరు. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి వస్తుందా అన్నది కూడా చెప్పలేము.


ఇంతకూ రాష్ట్రపతి ఎవరవుతారన్న విషయం ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎత్తులు, వ్యూహాలు ఊహాగానాలకు అతీతం అనడంలో సందేహం లేదు. గతంలో రాష్ట్రపతిగా తావర్ చంద్ గెహ్లాట్ వస్తారని అందరూ ఊహించారు. కాని ఆఖరు క్షణంలో మోదీ రాంనాథ్ కోవింద్‌ను రంగంలోకి దించారు. రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంప్ అన్న అభిప్రాయం కాంగ్రెస్ హయాంలోనే కలిగింది. మోదీ కూడా సామాజిక సమీకరణలతో పాటు రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతిని ఎంచుకొంటారనడంలో సందేహం లేదు. పార్టీలో అనుభవం, సమర్థత, ప్రతిభ ఇలాంటి కొలమానాలకు కొన్ని పదవుల విషయంలో ఆస్కారం ఉండదు. అందులో రాష్ట్రపతి పదవి ప్రధానమైనది.


మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రస్తుతం ప్రతిపక్షాలకు జీవన్మరణ సమస్య అవుతాయనడంలో సందేహం లేదు. మోదీ ఎవర్ని మిత్రపక్షంగా భావిస్తారో, ఎప్పుడు ఆ పార్టీని ప్రక్కన పడేస్తారో చెప్పలేమని శివసేన, అకాలీదళ్ ఉదంతాలు తెలియజేస్తున్నాయి. స్వీయ రాజకీయ అవసరాలే ఆయన ప్రాథమ్యాలను నిర్ణయిస్తాయి. అందువల్ల ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని తామే నిలబెట్టుకొనేందుకు ప్రయత్నించడం ఒక చారిత్రక అవసరం. లేకపోతే తమ మనుగడకోసం ఎల్లకాలం ఢిల్లీ వీధుల్లో దేబరిస్తూ జీవించాల్సి ఉంటుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-06-15T07:42:18+05:30 IST