వృద్ధుల భూమిపై గద్దలు!

ABN , First Publish Date - 2022-08-20T09:34:13+05:30 IST

విశాఖలో ప్రజా అవసరాల కోసం తనకు భూమి కేటాయించాలంటూ ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ ఎండీ చిలుకూరి జగదీశ్వరుడు 2006లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు.

వృద్ధుల భూమిపై గద్దలు!

  • విశాఖలో రూ.250 కోట్ల భూమి నొక్కేశారు
  • వైఎస్‌ హయాంలో వృద్ధుల కోసం ‘హయగ్రీవ’ ల్యాండ్స్‌
  • ఆయన కుమారుడి పాలనలో అవన్నీ బినామీల చేతికి!
  • వసతిగాక ప్లాట్లు వేస్తే వృద్ధులకే అమ్మాలని నాడు షరతు
  • 12.5 ఎకరాలు కేటాయింపు.. గజం ఇప్పుడు 80 వేలు
  • వెయ్యి గజాల చొప్పున బినామీ పేర్లతో విక్రయాలు
  • అక్కడ నిర్మాణాలకు కలెక్టర్‌, జీవీఎంసీ తిరస్కృతి
  • అయినా దర్జాగా సాగుతున్న భవన నిర్మాణ పనులు
  • గనుల శాఖ అనుమతి లేకుండానే గ్రావెల్‌ తవ్వకం
  • అంఽధుల స్కూలు సమీపంలో భారీగా డంపింగ్‌
  • చోద్యం చూస్తున్న విశాఖ అధికారులు


వైఎస్‌ హయాంలో దశాబ్దంన్నర కిందట విశాఖలో వృద్ధుల కోసం కేటాయించిన భూమి ఆయన తనయుడి హయాం వచ్చేసరికి చాలా వరకు బినామీల చేతుల్లోకి వెళ్లిపోయింది. వృద్ధుల కోసం ఉచితంగా ఆశ్రమం నిర్మించి నిర్వహించడంతో పాటు మిగిలిన భూమిలో కూడా వృద్ధుల అవసరాలకు తగ్గట్టు భవనాలు నిర్మించి వారికే విక్రయించాలని అప్పటి ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ ప్రస్తుతం ఆ భూమిని వ్యాపార కోణంలో వినియోగించుకొనేలా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేటాయింపులు రద్దు చేసే అవకాశాన్ని పరిశీలించాలంటూ స్వయంగా జిల్లా కలెక్టరే నివేదిక ఇచ్చారు. నిర్మాణాల కోసం పెట్టుకున్న దరఖాస్తును జీవీఎంసీ షార్ట్‌ ఫాల్‌లో పెట్టారు. అయినా... వైసీపీ పెద్దల అండతో దర్జాగా ‘హయగ్రీవ’ల్యాండ్స్‌లో నిర్మాణాలు జరిగిపోతున్నాయి.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖలో ప్రజా అవసరాల కోసం తనకు భూమి కేటాయించాలంటూ ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ ఎండీ చిలుకూరి జగదీశ్వరుడు 2006లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు మెరుగైన జీవనం సాగించేందుకు వీలుగా అన్నిరకాల వసతులతో ఉచితంగా వృద్ధాశ్రమం నిర్మించి నిర్వహించడంతోపాటు వారి అవసరాలకు తగ్గట్టు భవనాలను నిర్మించి వారికే విక్రయిస్తామని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం స్పందించి, అనువైన భూమి ఉంటే గుర్తించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఎండాడ సర్వే నంబర్‌ 92లో ఉన్న ప్రభుత్వ భూమి కేటాయింపునకు అనుకూలంగా ఉందని నివేదించారు. 2006 డిసెంబరులో జిల్లా కలెక్టర్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీసీఎల్‌ఏకు పంపించారు. 


ఎండాడ సర్వే నంబర్‌ 92లోని 12.5 ఎకరాలను 92/3గా సబ్‌ డివిజన్‌ చేసి, హయగ్రీవ సంస్థకు అప్పట్లో ఎకరా రూ.45 లక్షలు చొప్పున కేటాయించింది. కేటాయించిన భూమిలో పది శాతంలో వృద్ధాశ్రమం నిర్మాణం, మౌలిక వసతులకు 30 శాతం భూమి పోను మిగిలిన 60 శాతం భూమిని దరఖాస్తులో పేర్కొన్న హామీ మేరకు వృద్ధులకు విక్రయించేలా భవనాల నిర్మాణానికి వినియోగించాలని నిబంధన విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తప్పవని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు 12.5 ఎకరాల భూమికి హయగ్రీవ సంస్థ రూ.5,62,95,000 పలు దఫాలుగా చలానా రూపంలో చెల్లించింది. దీంతో 2010లో అప్పటి తహసీల్దార్‌ భూమిని హయగ్రీవ సంస్థకు అప్పగించారు. ఇదిలా ఉండగా 2012లో విశాఖకు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ వచ్చింది. ఈ జిల్లాలో (ఉమ్మడి) ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలపై ఆరా తీయగా ‘హయగ్రీవ’కు ఇచ్చిన భూమిని వినియోగంలోకి తేనట్టు గుర్తించింది. 


ఆయా కేటాయింపులను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందులో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ జీవీఎంసీ, అప్పటి వుడాలను పీఏసీ ఆదేశించింది. ఆ భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ 2013లో హయగ్రీవ సంస్థ కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. కోర్టు తీర్పు సంస్థకు అనుకూలంగా రావడంతో 2014 ఫిబ్రవరిలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటూ జీవీఎంసీ కమిషనర్‌కు ‘హయగ్రీవ’ దరఖాస్తు చేసుకుంది. దీనిని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్‌ ఆ భూమిలో నిర్మాణాలకు అనుమతివ్వాలంటే ఎన్‌ఓసీ అవసరమని చెప్పారు. ఎన్‌ఓసీ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌కు ఆ సంస్థ దరఖాస్తు చేసుకోగా, ముందుగా అక్కడ వృద్ధాశ్రమం నిర్మించాలని స్పష్టంచేశారు. దీంతో మళ్లీ సంస్థ కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై మళ్లీ కోర్టు సంస్థకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ఎందుచేతనో నిర్మాణాలు జరగలేదు. 


గుట్టు బయటపెట్టిన వీడియో

తన నుంచి ఆ భూమిని కొందరు వైసీపీ నాయకులు బలవంతంగా చేజిక్కించుకున్నారంటూ కొన్నాళ్ల కిందట హయగ్రీవ సంస్థ మేనేజింగ్‌ పార్టనర్‌ చిలుకూరి జగదీశ్వరుడు పెట్టిన సెల్ఫీ వీడియో తీవ్ర సంచలనం కలిగించింది. జగదీశ్వరుడికి రుణం ఇచ్చి బదులుగా ఈ భూమిని వైసీపీ నేత, విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ) తదితరులు జీపీఏ చేసుకున్నట్టు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున దృష్టిసారించారు. అన్ని శాఖల నుంచి ఆ భూమికి సంబంధించిన వివరాలు తెప్పించుకోగా కొన్ని ఉల్లంఘనలు జరిగినట్టు నిర్ధారించారు. భూమి కేటాయించినప్పటి నుంచి మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధన అమలు కాలేదని, ఇంకా భవన నిర్మాణాలకు సమర్పించిన ప్లాన్‌, డిజైన్‌లలో వృద్ధుల అవసరాలకు తగ్గట్టు సదుపాయాలు కల్పించకపోవడం, వీఎంఆర్‌డీఏ నుంచి లేఅవుట్‌కు అనుమతి, జీవీఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండా ఆ ప్రాజెక్టులో మిగిలిన భూమిని లేదా భవనాలను వేరెవరికీ విక్రయించకూడదన్నప్పటికీ...సుమారు 30 మందికి వెయ్యి గజాలు చొప్పున అమ్మేశారని, సంస్థలో భాగస్వాముల సంఖ్యను పెంచేశారని, అందులో వృద్ధులకు సేవ అనేది కాకుండా స్వలాభం, స్థిరాస్తి వ్యాపారమే లక్ష్యంగా చేసుకున్నారని...ఇవన్నీ ఉల్లంఘనలే కాబట్టి భూ కేటాయింపును రద్దు చేయవచ్చునని కలెక్టర్‌ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సూచించారు. 


అయినా ఆగని పనులు

ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక ఇచ్చేనాటికే ఈ భూమిని జగదీశ్వరుడి నుంచి జీవీ తదితరులు దక్కించుకున్నారు. ఈ భూమిపై జిల్లా కలెక్టర్‌ నివేదిక తయారుచేస్తున్నారని తెలుసుకుని ఆగమేఘాల మీద అక్కడ భవన నిర్మాణాలకు ప్లాన్‌ ఇవ్వాలంటూ జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్‌ ఆ భూమికి ఎన్‌ఓసీతోపాటు తాజా ఈసీని సమర్పించాలని, దరఖాస్తులో పొందుపరిచిన డిజైన్‌లో వృద్ధులకు అవసరమైనట్టు ర్యాంపుల నిర్మాణం ప్రస్తావన లేనందున దానిని కూడా మార్చాలంటూ షార్ట్‌ ఫాల్‌లో పెట్టారు. సాధారణంగా షార్ట్‌ ఫాల్‌లో పెట్టారంటే అందులో పేర్కొన్న అభ్యంతరాలు, కోరిన ఇతర పత్రాలను అందజేసి ప్లాన్‌ ఆమోదం తీసుకుని, ఆ తరువాత పనులు ప్రారంభించాలి. కానీ హయగ్రీవ సంస్థ మాత్రం ఆ నిబంధనలను బేఖాతరు చేస్తోంది. ఆ భూమిలో 12 యంత్రాలను పెట్టి గ్రావెల్‌ తవ్వకం పనులు ఒకవైపు శరవేగంగా చేస్తోంది.


 అక్కడి మట్టిని సమీపంలో వున్న బ్లైండ్‌ స్కూల్‌ వెనుక ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ చేస్తోంది. దీనికి గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా కనీసం ఆ స్పృహ లేదన్నట్టు వ్యవహరిస్తోంది. వాహనాలతో పట్టపగలే గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. అయినా గనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. షార్ట్‌ఫాల్‌లో వున్న అభ్యంతరాలను నివృత్తిచేసిన తర్వాతే పనులు చేయాలని, లేనిపక్షంలో యంత్రాలతో తొలగించేస్తామని టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది స్వయంగా వెళ్లి హెచ్చరించినా సంస్థ యాజమాన్యం పట్టించుకోకుండా పనులు కొనసాగించేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని, తాము వెళ్లినా పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. 


ప్లాన్‌ రాకుండానే విక్రయాలు

హయగ్రీవ సంస్థను టేకోవర్‌ చేసుకున్న కొన్నాళ్లకే అక్కడి భూమిని ‘జీవీ’ తదితరులు విక్రయించేసినట్టు తెలిసింది. భవన నిర్మాణాలకు ప్లాన్‌ జారీ అయిన తర్వాతే విక్రయాలు జరపాలి. కానీ ప్లాన్‌ రాకముందే 31 మందికి32,857 గజాలు విక్రయించేశారు. వీరిలో 15 మందికి సేల్‌ డీడ్‌ చేయగా, 16 మందికి సేల్‌ అగ్రిమెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ భూమి గజం ధర  రిజిస్ట్రేషన్‌ వాల్యూ దాదాపు రూ.28 వేలు ఉండగా, మార్కెట్‌ ధర రూ.70 వేలు-రూ.80 వేలు మధ్య ఉంది. 


బినామీ పేర్లుతో కొట్టేశారు 

హయగ్రీవ సంస్థకు చెందిన భూమిలో తొలుత వృద్ధులకు ఆశ్రమం నిర్మించిన తర్వాతే, మిగిలిన భూమిలో వృద్ధుల అవసరాలకు తగ్గట్టు అన్ని సదుపాయాలతో భవనాలు నిర్మించి వారికే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో షరతు విధించింది. అయితే చిలుకూరి జగదీశ్వరుడు నుంచి సంస్థను జీపీఏ ద్వారా స్వాధీనం చేసుకున్న జీవీ తదితరులు ఆ భూమిని వెయ్యి గజాలు చొప్పున 35 మంది వరకూ విక్రయించేసినట్టు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది భూ కేటాయింపు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతును ఉల్లంఘించినట్టేశ్రీ ఆ భూమిని కొనుగోలు చేసిన వారిలో అధికార పార్టీకి చెందిన ఎంపీలు, కొన్నాళ్లు కిందటి వరకూ మంత్రులుగా పనిచేసినవారు, ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు. భూమి విషయంలో వివాదం తలెత్తినందున త నకు సహాయంగా ఉండేందుకు వీ లుగా వారందరికీ గుడ్‌విల్‌ కింద త క్కువ ధరకు విక్రయించినట్టు స మాచారం. మిగిలిన వారికి మాత్రం గజం రూ.70 వేలు చొప్పున విక్రయించినట్టు తెలిసింది. ఇక్కడ భవన నిర్మాణ బాధ్యతలను కూడా జీవీకి సన్నిహితంగా ఉం డే ఓ ఎంపీ తీసుకున్నట్టు తెలిసింది.


కీలక అధికారికి 30 కోట్లు ముడుపులు

కేటాయించిన భూమి కేటాయింపును రద్దు చేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక అధికారికి రూ.30 కోట్లు ముడుపులు ఇచ్చినట్టు విశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి...ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉంటుండడంతో నేరుగా ఆయనతోనే డీల్‌ మాట్లాడుకున్నట్టు తెలిసింది. అందువల్లే భూ కేటాయింపును రద్దు చేయాలని కలెక్టర్‌ స్వయంగా సిఫారసు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, సీసీఎల్‌ఏ నుంచిగానీ ఇంతవరకూ స్పందన రాలేదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక అధికారి సహకారంతోనే సంస్థ ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-20T09:34:13+05:30 IST