ఆపదలో అండగా ‘హాక్‌ ఐ’

ABN , First Publish Date - 2022-08-11T05:39:10+05:30 IST

ఆపదలో ఉన్న వారికి పోలీస్‌ శాఖ నిర్వహిస్తున్న హాక్‌ ఐ యాప్‌ అండగా నిలుస్తోంది.

ఆపదలో అండగా ‘హాక్‌ ఐ’

 - మూడున్నరేళ్లలో యాప్‌ ద్వారా 855 ఫిర్యాదులు

- కమ్యూనిటీ మీటింగ్‌ల ద్వారా అవగాహన సదస్సులు

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 9 :  ఆపదలో ఉన్న వారికి పోలీస్‌ శాఖ నిర్వహిస్తున్న హాక్‌ ఐ యాప్‌ అండగా నిలుస్తోంది.  ఏ వ్యక్తి అయినా పోలీసు ఠాణాకు వెళ్లకుండానే నేరుగా ఎలాంటి సమాచారాన్ని అయినా పోలీసులకు అందించే సౌకర్యాన్ని హాక్‌ఐ యాప్‌లో కల్పించారు. సమాచారాన్ని, ఫిర్యాదును స్వీకరించిన కమాండ్‌ కంట్రోల్‌ రూం ఫిర్యాదుదారుల పేర్లు, ఇతర చిరునామాను గోప్యంగా ఉంచుతుంది. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రజల రక్షణ, ముఖ్యంగా ఆటోల్లో మహిళలు, రాత్రి వేళ ప్రయాణ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హాక్‌ఐతో భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. 2017లో అప్పటి పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి హాక్‌ఐ యాప్‌ను తీసుకువచ్చారు. హాక్‌ఐ యాప్‌ వినియోగం, ఫలితాలపై కమిషనరేట్‌ వ్యాప్తంగా విద్యాసంస్థలు, కూడళ్లు, వివిధ కార్యక్రమాలలో పోలీసు కళాబృందం చేత, కమ్యూనిటీ మీటింగ్‌లతో గ్రామాలలో, పట్టణంలోని కాలనీల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాప్‌ను కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. యాప్‌లో కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ ఆఫీసర్లు, పోలీస్‌ స్టేషన్ల ఫోన్‌ నంబర్లను పొందుపరిచారు. 


 5.82 లక్షల మంది డౌన్‌లోడ్‌


పోలీస్‌ కమిషనరేట్‌లో 5.82 లక్షల మంది హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. హాక్‌ ఆప్‌ ద్వారా ఎవరైనా మహిళలు ప్రయాణ సమయంలో వాహనం ఎక్కే ముందే వాహనం నంబర్లు, స్థలాన్ని యాప్‌లో నమోదు చేయాలి. ఆపదను ఎదుర్కొన్న సందర్భంలో ఈ యాప్‌లో ‘ఎస్‌వోఎస్‌’ బటన్‌ నొక్కితే ముందే పొందుపర్చిన సందేశం అంతకుముందు నమోదు చేసిన ఐదుగురు వ్యక్తులకు వెళ్లిపోతుంది. వీటితోపాటు సంబంధిత ప్రాంతంలోని ఏసీపీ, సీఐ, ఎస్సై, కంట్రోల్‌ రూంకు తాము ఆపదలో ఉన్నట్లు సమాచారం వెళుతుంది. ఆ సమాచారం ఇచ్చిన ఫోన్‌ ఆధారంగా టవర్‌ లొకేషన్‌ కూడా పోలీసు అధికారులకు తెలుస్తుంది. దీంతో పోలీసులు వెంటనే ఆపదలో ఉన్న వారిని గుర్తించి రక్షించేందుకు రంగంలోకి దిగుతారు. ఈ యాప్‌ ద్వారా కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ఏ నేరం, ప్రమాదం, సంఘవ్యతిరేక సంఘటన జరిగినా ప్రజలు ఫోటోలు, వీడియోలు తీసి అధికారులకు పంపించే వీలు కల్పించారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భంలో వారిపైన కూడా ఫోటోలు, వీడియోలు తీసి హాక్‌ఐకి పంపవచ్చు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. మహిళలకు సంబంధించిన నేరాలను ఈ యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చు.

హాక్‌ఐ యాప్‌ ద్వారా కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గడిచిన మూడున్నరేళ్లలో 855 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం ఆ యా 

పాంతాల్లో న్యూసెన్స్‌, ట్రాఫిక్‌ స్థంభించిపోవటం, ఉల్లంఘనలు, నేరాలకు సంబంధించిన సమాచారం వంటివి ఉంటున్నాయి. 


 డౌన్‌ లోడ్‌ చేసుకునే విధానం...


ఐవోఎస్‌ వినియోగదారులు యాప్‌ స్టోర్‌ నుంచి, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి హాక్‌ఐ అని టైప్‌ చేసి అప్లికేషన్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌ లోడ్‌ అనంతరం వివరాలను నమోదు చేస్తే తెరపై ఎనిమిది ఐకాన్లు ప్రత్యక్షమవుతాయి. వాటిలో రిపోర్టు ఏ వాయిలేషన్‌ ఆఫ్‌ పోలీస్‌, ఉమెన్‌ ట్రావెల్‌ మోర్‌ సేఫ్‌, రిజిస్టర్‌ విత్‌ పోలీస్‌, ఎస్‌వోఎస్‌, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌, నో యువర్‌ రిపోర్టు స్టేటస్‌, వెహికిల్‌ అండ్‌ నెంబర్‌ సెర్చ్‌ కనిపిస్తాయి. ఇవి హాక్‌ఐ ద్వారా ప్రజలు వివిధ రకాల సేవలను పొందడానికి ఉపయోగపడతాయి. 

 

ప్రజలందరూ హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

 - సీపీ వి సత్యనారాయణ


ప్రజలందరు తప్పనిసరిగా హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అన్నిరకాల సమాచారాన్ని యాప్‌ ద్వారా చేరవేసి పోలీసులకు మరింత సహకారాన్ని అందించాలి. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు నియంత్రణకు కృషి చేస్తున్నాం. గ్రామాలు, కాలనీల్లో హాక్‌ఐ యాప్‌పై విస్తృతంగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. కిడ్నాప్‌, అత్యాచార యత్నం వంటి నేరాల్లో నిందితులను వెంటనే పట్టుకునే అవకాశం ఉంది. పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేయనవసరం లేకుండా బాధితులు నేరుగా యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పైగా ఫిర్యాదు రికార్డుగా ఉంటుంది. బాధితులు, ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచుతాం. ప్రతి పౌరుడు ఒక పోలీసుగా భావించి తమ పరిసరాల్లో జరుగుతున్న అసాంఘీక, అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ‘హాక్‌ఐ’ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. ప్రతి రోజు హాక్‌ఐ యాప్‌ ద్వారా విలువైన సమాచారం అందుతుంది. ఇందులో అక్రమార్కుల వివరాలతోపాటు పోలీసులకు సూచనలు, సలహాలు అందుతున్నాయి. ఈ యాప్‌  మహిళలకే కాకుండా అందరికీ ఆపద సమయంలో ఉపయోగపడుతుంది. 




Updated Date - 2022-08-11T05:39:10+05:30 IST