సెల్‌ హవాలా!

ABN , First Publish Date - 2020-12-05T06:34:04+05:30 IST

ఒకరి నుంచి మరొకరికి డబ్బును బదిలీ చేయడానికి సురక్షితమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది.

సెల్‌ హవాలా!

హవాలాకూ ఓ వాట్సాప్‌..

రూ.కోట్లలో లావాదేవీలు

బెజవాడలో పాతబస్తీ కేంద్రంగా ముఠా

నిఘా పెంచిన పోలీసులు

నగరంలో 20 మంది! 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఒకరి నుంచి మరొకరికి డబ్బును బదిలీ చేయడానికి సురక్షితమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది. సెకన్ల వ్యవధిలో డబ్బు చేతులు మారుతుంది. ఈ మార్గం న్యాయబద్ధంగా వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వానికి పన్నుల ఎగ్గొట్టి, లెక్కాపత్రాలు లేకుండా నగదు చలామణి చేసే వారు మాత్రం ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే హవాలను ఎంచుకుంటున్నారు. మొన్నటి వరకు మాన్యువల్‌గా సాగిన హవాలా వ్యవహారంలోనూ ఇప్పుడు టెక్నాలజీ చొరబడింది. ప్రత్యేకంగా ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని, ఆ వేదిక ద్వారా వ్యవహారం నడుపుతున్నారు. 


ఈ ఏడాది విజయవాడ పోలీసులు ఇప్పటి వరకు నాలుగుసార్లు భారీ మొత్తంలో హవాలా సొమ్మును స్వాఽధీనం చేసుకున్నారు. తాజాగా కోటి రూపాయలను విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మొత్తం కేసులను పరిశీలించాక వారి వ్యవహారం మొత్తం వాట్సాప్‌ గ్రూపులు, వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా నడుస్తోందని తేలింది. రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం విజయవాడలోని పాతబస్తీ. అన్ని రకాల వ్యాపారాలకు ఇది కేంద్ర బిందువు. ఇక్కడే ఏకంగా 20 మంది వరకు హవాలా ముసుగులో వ్యవహారాలు నడిపిస్తున్నారని సమాచారం. విజయవాడలో భారీ మొత్తంలో నగదు పట్టుబడడానికి ఇదొక ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 


అంతర్జాతీయ హవాలాకు, దేశీయ హవాలాకు వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా దేశీయ హవాలా రెండు, మూడు మార్గాల్లో సాగుతోంది. ఈ విధానాల్లో ఎక్కడా హవాలాదారులు బయటకు కనిపించరు. డబ్బును ఒక చోట నుంచి మరో చోటికి తరలించినా, పోలీసులకు చిక్కినప్పుడు బయటకు వచ్చేది కేవలం బ్రోకర్లు మాత్రమే. తాజాగా విజయవాడలో పోలీసులకు చిక్కిన ఇద్దరు వ్యక్తులు బ్రోకర్లే. అసలు వ్యవహారాన్ని నడిపిన సెల్‌ఫోన్ల వ్యాపారి గానీ, డబ్బులను సమకూర్చిన హవాలాదారుడు గానీ బయటకు రాలేదు. ఇంతకుముందు హవాలా కోడింగ్‌ ద్వారా జరిగేది. ఒక వ్యాపారి హవాలాదారుడ్ని డబ్బులు సమకూర్చమని పురమాయిస్తే ఒక కరెన్సీ నోటును సంబంధిత వ్యక్తికి అందజేసేవాడు.


తర్వాత ఒక బ్రోకర్‌ను పంపుతాడు. హవాలాదారుడి వద్దకు వెళ్లిన బ్రోకర్‌ ఆ నోటుపై ఉన్న నంబరులో చివరి రెండు, మూడు అంకెలను చెప్పాలి. దీనితో వచ్చిన బ్రోకర్‌ తనకు డబ్బులు పురమాయించిన వ్యాపారి మనిషేనని విశ్వసించేవాడు. తర్వాత ఆ మొత్తాన్ని బ్రోకర్‌కు ఇచ్చి పంపేవాడు. ఇప్పుడు దీనికి కాస్త దూరంగా ఉండడం మొదలుపెట్టారు. లావాదేవీలు నిర్వహించుకునే వ్యక్తులు కోడింగ్‌ మొత్తాన్ని వాట్సాప్‌ల ద్వారా జరుపుకుంటున్నారు. వ్యాపారి ఆ నంబర్‌ను తన మనిషికి చెప్పి హవాలాదారుడి వద్దకు పంపుతున్నాడు. ఈ విధంగా వాట్సాప్‌ల ద్వారా కథను నడిపిస్తూ, ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నారు.

Updated Date - 2020-12-05T06:34:04+05:30 IST