భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల హవా

ABN , First Publish Date - 2020-07-11T07:28:10+05:30 IST

భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుకుంటున్నారు. 11 దేశాల్లోని కంపెనీలకు 58 మంది భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌లు సారథ్యం వహిస్తున్నారు. ఈ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా 36 లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కంపెనీల ఉమ్మడి రాబడి లక్ష కోట్ల డాలర్లు

భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల హవా

  • 11 దేశాల్లోని కంపెనీలకు 58 మంది సారథ్యం
  • వీటిలో 36 లక్షల మంది ఉద్యోగులు
  • కంపెనీల ఉమ్మడి రాబడి లక్ష కోట్ల డాలర్లు
  • మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 4 లక్షల కోట్ల డాలర్లు
  • ఇండియాస్పొరా బిజినెస్‌ లీడర్స్‌ జాబితా వెల్లడి 


వాషింగ్టన్‌, జూలై 10: భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుకుంటున్నారు. 11 దేశాల్లోని కంపెనీలకు 58 మంది భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌లు సారథ్యం వహిస్తున్నారు. ఈ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా 36 లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కంపెనీల ఉమ్మడి రాబడి లక్ష కోట్ల డాలర్లు ఉండటం విశేషమని అమెరికాకు చెందిన ఇండియాస్పొరా వెల్లడించింది. కార్పొరేట్‌ రంగంలో అనేక మంది భారత సంతతి వ్యాపార సారథులు విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారని ఈ సంస్థ పేర్కొంది. చాలా మంది సమాజంలో మార్పుల కోసం కృషి చేస్తున్నారని తెలిపింది. ఇండియాస్పొరా బిజినెస్‌ లీడర్స్‌ జాబితాలోని 58 మంది ఎగ్జిక్యూటివ్‌లు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, సింగపూర్‌ వంటి దేశాల్లోని కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. వీరు బాధ్యతలు నిర్వహించిన కాలంలో కంపెనీలు 23 శాతం వార్షిక రిటర్నులను అందించాయి. ఎస్‌అండ్‌పీ 500 కంపెనీలకన్నా ఇది 10 శాతం ఎక్కువ. ఈ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ కంపెనీల ఎగ్జిక్యూటవ్‌లలో 37 ఏళ్ల వయసు నుంచి 74 ఏళ్ల వయసు వారి వరకు ఉన్నారు. కరోనా కాలంలో వీరి కంపెనీలు మానవతా దృక్పథంతో సహాయసహకారాలు అందించాయని ఇండియా స్పొరా వ్యవస్థాపకుడు ఎంఆర్‌ రంగస్వామి జాబితా విడుదల సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ఉద్యోగులు, కస్టమర్లు, సప్లయ్‌ చెయిన్‌ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.


 వ్యాపారాల్లో ప్రవాస భారతీయుల ప్రభావం గొప్పగా ఉందని, ఈ నేపథ్యంలోనే తామీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. రానున్న కాలంలో జాబితాలోని ప్రవాస భారతీయుల సంఖ్య మరింతగా పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వీరు పని చేస్తున్న రంగాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. భారత సీఈఓలు అనగానే టెక్నాలజీ రంగం గుర్తుకువచ్చేదని, కానీ తమ జాబితాలోని భారత సంతతి సీఈఓలు విభిన్న రంగాలకు (బ్యాంకింగ్‌, ఎలక్ర్టానిక్స్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌, కన్సల్టింగ్‌ తదితరాలు) చెందిన వారని తెలిపారు. జాబితాలోని చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు నల్ల జాతీయులకు మద్దతుగా నిలిచారని, జాతి సమానత్వం కోసం ముందున్నారని చెప్పారు.

Updated Date - 2020-07-11T07:28:10+05:30 IST