చెలరేగిన కలలు చల్లారిపోయాయా?

ABN , First Publish Date - 2022-06-02T06:42:46+05:30 IST

ఎనిమిదేళ్ల కిందట జూన్ ఒకటోదో రెండోదో అర్ధరాత్రి దాటాక ఒక ఫోన్ కాల్ పలకరించింది. తెలంగాణలో మంచి పేరున్న, గొంతున్న గాయకుడు. ఆ సమయంలో ఆయన కాల్ చేయడం విశేషమే...

చెలరేగిన కలలు చల్లారిపోయాయా?

ఎనిమిదేళ్ల కిందట జూన్ ఒకటోదో రెండోదో అర్ధరాత్రి దాటాక ఒక ఫోన్ కాల్ పలకరించింది. తెలంగాణలో మంచి పేరున్న, గొంతున్న గాయకుడు. ఆ సమయంలో ఆయన కాల్ చేయడం విశేషమే. షంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాడు. నేనేమి బదులు చెబుతున్నానో కూడా వినకుండా చెప్పుకుంటూ వెడుతున్నాడు. అమెరికాకు వెడుతున్నాడు. ఇమిగ్రేషన్ ఫారం నింపుతున్నప్పుడు, తన అడ్రస్ రాస్తూ, అందులో రాష్ట్రం పేరు కూడా రాసేటప్పుడు ఒక క్షణం ఆగాడట. అప్పటిదాకా అలవాటయిన పేరు కాదు కదా రాయవలసింది, కొత్త పేరు కదా, ఆ పేరు ఒక్కొక్క అక్షరం రాస్తుంటే తనువు నిలువెల్లా ఎట్లా పులకించిపోయిందో, మొట్టమొదటిసారి అంతటి ఉద్వేగాన్ని తానెట్లా అనుభవించాడో, ఆ గాయక ప్రముఖుడు ఎంత కదిలిపోతూ చెప్పాడో! అతనే కాదు, రాష్ట్రం పేరు తెలంగాణగా మొదటిసారి రాస్తున్నప్పుడు అసంఖ్యాకులు అటువంటి ప్రత్యేక అనుభూతిని పొంది ఉంటారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అందుకోసం ఉద్యమించినవారు, కేవలం ఆకాంక్షను మాత్రమే నింపుకుని తపించినవారు, అందులో ఏదో నూతన భవితవ్యం ఉందని ఆశగా ఎదురుచూసినవారు రాష్ట్రావతరణ జరిగిన అర్ధరాత్రి అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా ఉన్న భవనం ఎదురుగా కిక్కిరిసిపోయారు. మనుషులు వ్యక్తులుగా కాక, ఒక సమూహంగా మారిపోయిన అరుదైన సందర్భం. ప్రత్యేక రాష్ట్రం కోసం అనుకూలంగా ప్రతికూలంగా జరిగిన వాదనలు, చర్చలు అవన్నీ ఒక స్థాయిలో ఆవేశాలనో ఆలోచనలనో రగిలించగా, తెలంగాణ ప్రాంతంలో సర్వవ్యాప్తంగా కనిపించింది మాత్రం.. అది తప్ప మరి ఏదీ అంగీకారం కానంత ఆకాంక్ష!


తెలంగాణ రాష్ట్రం ఏమంత సులువుగా రాలేదు. ఎవరో ఒక నాయకుడు సంకల్పించి ఉద్యమిస్తే రాలేదు. అడుగూ అడుగూ కలిసి ముందడుగు అయింది. పుల్లా పూచికా కలసి ఉద్యమం గూడు అయింది. ఆత్మాహుతులూ ఆందోళనలూ కలసి పోరాటం అయింది. సమాజంలోని సకల జనులు తమలో తాము అనేక ఐక్య కార్యాచరణలను రచించుకుని చేసిన ప్రయాణం అది.


నాయకులను తక్కువ చేయనక్కరలేదు. ఆకాంక్షలున్నా నాయకులకు నిజాయితీ లేక, ఆత్మస్థైర్యం లేక ఉద్యమాలు అణగారిన గతానుభవాలున్నాయి. నిలబడే నాయకత్వం అవసరం. ప్రజాందోళనలకు సమీకరణ శక్తి కలిగిన నాయకత్వం కావాలి. వాగ్ధాటితో ఆకట్టుకోవాలి, దరిచేరినా, దారిలో ఆపద వచ్చినా చుక్కాని వదలని నావికుడిలా ఉండాలి. అదృష్టవశాత్తూ, మలిదశ తెలంగాణకు అటువంటి నాయకత్వం దొరికింది. ఆ నాయకత్వానికి, అంతకు మించిన, గొప్ప ఉద్యమకారుల శ్రేణి తోడయింది.. నాయకుడు దారి తప్పకుండా కాపాడింది, అదుపు తప్పినప్పుడు సరిదిద్దింది. నిద్రపోయినప్పుడు మేల్కొల్పింది. ఉదాసీనతలో పడినప్పుడు తామే ఉద్యమమై ముందుకు సాగింది. నాయకత్వం ఉద్యమానికి ముఖచిత్రం మాత్రమే. పోరాట గ్రంథంలో ఉన్నవి అనేక అధ్యాయాలు, ఆత్మత్యాగాలు!


ఎనిమిదేళ్ల తరువాత, ఆ ఉద్వేగం ఇంకా అట్లాగే ఉన్నదా? ఆ ఉద్యమ జ్ఞాపకం ఇంకా మనసులకు గర్వంగా తాకుతున్నదా?

తెలంగాణ ఉద్యమంలోనూ ఆ తరువాత అధికార పార్టీలోనూ పనిచేస్తూ, మంచి భవిష్యత్తును ఆశిస్తున్న ఒక యువనాయకుడు ఇట్లా అన్నాడు: ‘‘అంతా ఫీల్ గుడ్ వాతావరణం ఉన్నది, రైతుబంధేమి, పింఛన్లేమి ఊళ్లల్లకు డబ్బు బాగా వస్తున్నది, ప్రాజెక్టుల నీళ్లో వానలకు వచ్చిన నీళ్లో కానీ ఎక్కడ చూసిన చెరువులు నిండి కనిపిస్తున్నయి, పంటలు బాగా పండుతున్నయి. ఇక జనం వేరే ఆలోచనలు ఏమి చేస్తరు? ఎందుకు చేస్తరు?’’


ఎనిమిదేళ్ల ప్రయాణం తరువాత ఒక ప్రశ్న అయితే తారసపడుతుంది. ఇంతేనా, ఇదేనా కోరుకున్నది?


పాలకులు దాతలుగా, ప్రజలు గ్రహీతలుగా మారిన సన్నివేశంలో జరుగుబాటు ఉండవచ్చును కానీ, పురోగతి ఉంటుందా? తెలంగాణకు ఒక ప్రత్యేక అభివృద్ధి విధానం ఉన్నదా? ఉంటే అది ఈ ప్రాంత సమాజాన్ని స్వయంసమృద్ధంగా, అందరికీ ఉపాధి అవకాశాలు ఉండేవిధంగా, విద్యలో ఆరోగ్యంలో ఉన్నత ప్రమాణాలు సాధించేట్టుగా ఏవో లక్ష్యాలు పెట్టుకోవాలి కదా? ఉపనదులను ఎండబెట్టి, మహానదులను వెనుకకు తిప్పి, రాక్షసయంత్రాలతో ఎత్తిపోసి, ప్రాజెక్టులు సాధించేది ఏ ధాన్య విప్లవం? కొనేవాళ్లు లేని అంగడిలో ఏ బూడిదలోకి పన్నీరు? ఎందుకు ఇక్కడ ప్రజాస్వామ్యం ఇంత కనీస స్థాయిలో ఉన్నది? అధికారంలోకి వచ్చిన వెంటనే, నోరున్న సమూహాలను కట్టడి చేయడమే పనిగా ఉండింది. ఫలితంగా ఇప్పుడిక నిశ్శబ్దమే పరచుకున్నది. ఏ నిరసన తెలపాలన్నా, ముందు ఇల్లు దాటడమే అసాధ్యమైంది. ప్రభుత్వ ఖజానా కాంక్రీటు పనులకు చెల్లింపులు పోగా, తక్కినదంతా నేరుగా లబ్ధిదారులకు నగదు అందించే పథకాలకు, వేతనాలకు సరిపోతున్నది. నెలనెలా అప్పులతో కేంద్రం ముందు నిలబడే ప్రభుత్వానిది సుపరిపాలన అని ఎట్లా అనగలం? ఎనిమిదేళ్లవుతున్నా పాఠశాల విద్య మీద చిత్తశుద్ధితో సమీక్ష చేయ కుండా, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులను నియమించకుండా... ఆ మాత్రం తీరిక దొరకనంత రాచకార్యాలు ఏలికలకు ఏముంటాయి?


ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అంటే అది ఒక విధమైన స్వయంపాలన ఆకాంక్షే. తమ నిర్దిష్ట సమస్యలను, అవసరాలను, అవకాశాలను స్థూల పరిపాలనా వ్యవస్థ పట్టించుకోవడం లేదు కాబట్టి, సొంతంగా పాలించుకోవడం ద్వారా ఆ లోపాలను భర్తీ చేసుకోవడం ఈ ఆకాంక్ష ప్రధాన ఉద్దేశ్యం. తెలంగాణలోని ప్రాకృతిక, మానవ వనరులు, సామాజిక తరగతులు, వృత్తులు, సాంప్రదాయ జీవనాధార వ్యవస్థలు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని, పంటల దగ్గర నుంచి పరిశ్రమల దాకా ప్రజలు కేంద్రంగా ప్రణాళికారచన జరగాలి. వివిధ కార్పొరేట్లు తెలంగాణలో ఆఫీసులు పెట్టుకోవడానికో, చిన్నాచితకా ఉత్పాదక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికో ప్రభుత్వ స్థలాలను, కొన్ని రాయితీలను అందించడం స్థానికతా పరిశ్రమల విధానం అవుతుందా? ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్నీ, ప్రతి నియామకాన్నీ కేవలం ఆయా సామాజిక తరగతుల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటే, ఇక సమగ్ర విధానాలు ఏముంటాయి? ప్రతి నిర్ణయాన్నీ రాజకీయ వ్యూహానికి లోబడి తీసుకోవడమనే అవలక్షణానికి తోడు, నేరుగా ఓట్లపై ప్రభావం వేయని అనేక కీలక అంశాలను ఏళ్ల తరబడి పరిశీలించకపోవడం మరో జాడ్యం. నిర్ణయాలు తీసుకునే వేగం గురించి బ్యాంకుల్లోనూ, సేవలందించే వ్యవస్థల కార్యాలయాల్లోనూ బోర్డులు పెడతారు. తెలంగాణ ప్రభుత్వంలో, నిర్ణయాలు తీసుకునే వేగం గురించి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకునే వేగం గురించి బోర్డులలో ప్రదర్శించవలసి వస్తే, అనేక కొత్త రికార్డులను గుర్తించవచ్చు.


ప్రత్యేక రాష్ట్రం సాధనలో, ఉద్యమావేశాలు, చొరవ కలిగిన సంస్థలు కీలకపాత్ర వహించాయి కాబట్టి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం మొదలయింది. ఇక తెలంగాణ వాదంతో నిమిత్తం లేదు, తమది కేవలం రాజకీయ పార్టీ, తమ చేతిలో ఉన్నది కేవలం ప్రభుత్వం.. అన్న ధోరణి బాహాటంగానే వ్యక్తమయింది. సంక్షేమానికి మించి ప్రజలు కూడా తన నుంచి పెద్దగా ఆశించకూడదని స్పష్టం చేయడానికి కాబోలు, సైద్ధాంతిక అంశాలను అప్రధానం చేశారు. నిబద్ధతతో పనిచేసేవారిని ఎడం చేశారు. ఉద్యమంలో పనిచేయనివారిని, వ్యతిరేకంగా పనిచేసినవారిని కూడా పిలిచి పీఠాలిచ్చారు. అవసరమైనప్పుడు మాత్రం భావావేశాలను ఉపయోగించుకోవడానికి వెసులుబాటు పెట్టుకుంటూ, సాధారణ సమయాల్లో సాధారణ రాజకీయపక్షంలాగానే వ్యవహరిస్తూ వచ్చారు.

అధికారపక్షం గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రావతరణ టిఆర్ఎస్‌కు మాత్రమే సంబంధించింది కాదు. రాష్ట్రం తామే తెచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మొన్నమొన్నటి దాకా మన్నుతిన్న పాములాగానే ఉన్నది. ఇప్పటికీ, ఆ పార్టీకి ఉద్యమభాష మాట్లాడడం రాదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో హక్కులపై తీవ్రమైన దమనకాండ జరుగుతుంటే కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రతిఘటించింది లేదు. ఇక, ఉద్యమంలో భాగస్వామి అయినప్పటికీ, భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పాలనా వైఫల్యాల మీద గురిపెట్టడం కాకుండా, మతపరమైన ఉద్రేకాలకు దారితీసే మార్గాన్ని ఎంచుకున్నది. భారతీయ జనతాపార్టీ రాజకీయ విధానం, తెలంగాణలో కెసిఆర్‌పై సానుకూలతకు పరోక్షంగా సాయపడుతోంది. సామాజిక జీవనంలో ఉద్రిక్తతలకు తెలంగాణ ప్రజలు ఇప్పటివరకైతే సుముఖంగా లేరు.


ప్రధాన పక్షాలు మాత్రమే కాదు, వామపక్షాలు, అనేక ప్రజాసంఘాలు తెలంగాణలో ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడికి అణగారిపోయాయి. అందులో కొన్ని ప్రభుత్వపక్షంలోకి జారిపోయాయి. మరికొన్ని నిర్బంధాలతో సతమతమవుతున్నాయి. మొత్తం మీద తెలంగాణలోని విద్యావంతుల సమాజం, ఆలోచనాపరులు క్రమంగా ఒకరకమైన మందకొడితనంలోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు ఉద్యమం చేశారంటే ఎప్పుడూ చేస్తూ ఉండాలని కాదు. ప్రత్యేక రాష్ట్రం అన్న భావనలో పాలనలో భాగస్వామ్యం అన్న విలువ ఉన్నది. అనుభవంలోకి వస్తున్న పాలనను మెరుగుపరచడానికి లేదా విమర్శించడానికి అవకాశం దొరకకపోతే, అది పౌరభాగస్వామ్యం కాదు.


ఇప్పుడు వెనుకకు తిరిగి చూసుకుంటే, ఆ చెలరేగిన కలల కాలానికి, ఇప్పుడు అనుభవంలో ఉన్న వర్తమానానికీ మధ్య ఎంతో అగాధం! మరీ అన్యాయంగా ఉందని కాదు, మనుగడే లేదని కాదు కానీ, ప్రయాణానికీ ఫలితానికీ నిష్పత్తి కుదరడం లేదు, దీని కోసమేనా? ఇంత మాత్రమేనా? అన్న ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-06-02T06:42:46+05:30 IST