Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘తీపి’రోజులొచ్చేనా?

 ‘ఎనసీఎస్‌’ భవితపై నీలినీడలు

అర్ధశతాబ్దిలో తొలిసారి ఆగిన మిల్లు సైరన్‌

వరుసగా చేదు అనుభవాలే

అయోమయంలో రైతులు

తరతరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులకు.. దశాబ్దాలుగా కర్మాగారాన్నే నమ్ముకున్న కార్మికులకు భరోసాగా నిలుస్తూ రికార్డు స్థాయిలో పంచదారను ఉత్పత్తి చేస్తూ వచ్చిన ఎనసీఎస్‌ షుగర్‌ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా క్రషింగ్‌ నిలిపివేసే దుస్థితికి చేరింది. ఒడిదుడుకులకు లోనవుతున్న స్థితిలో ఫ్యాక్టరీకి ఊపిరి అందించేందుకు ప్రభుత్వ చొరవ తీసుకోక.. రైతులకు చెల్లింపులైనా సకాలంలో చేపట్టేందుకు కర్మాగార యాజమాన్యం ప్రయత్నించకుండా విమర్శలు మూటగట్టుకుంటోంది.  

బొబ్బిలి రూరల్‌,  డిసెంబరు 1:

జిల్లాలో చెప్పుకోదగ్గ వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకున్న లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అర్ధశతాబ్దానికి పైగా చరిత్ర గల ఫ్యాక్టరీ. తొలుత ప్రైవేట్‌ రంగంలో ఏర్పాటై... ఆ తరువాత పబ్లిక్‌ రంగంలోకి వెళ్లి...  మళ్లీ  ప్రైవేటుపరమై నేడు క్రషింగ్‌ నిలిపివేసే దుస్థితికి చేరింది. సుమారు ఏభయ్యేళ్ల కాలంలో తొలిసారిగా తాత్కాలికంగా మూతపడింది. బొబ్బిలి పట్టణంలో ఒకటి, సీతానగరం మండలం అప్పయ్యపేట గ్రామంలో మరొక చక్కెర కర్మాగారం బొబ్బిలి రాజుల ఆధీనంలో నడిచేవి. అప్పట్లో అనేకానేక కారణాలతో రెండు ఫ్యాక్టరీలకు చెందిన చెరకు రైతులంతా పెద్ద ఉద్యమం చేపట్టారు. తద్వారా రెండు ఫ్యాక్టరీలను జాతీయం చేయించుకోగలిగారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఇది సాధ్యమైంది. ఇలా జాతీయమైన ఫ్యాక్టరీల స్థానంలో లచ్చయ్యపేట గ్రామంలో 1995-96లో సుమారు 300 ఎకరాల భూములతో నిజాం షుగర్స్‌ యాజమాన్యం (పబ్లిక్‌ రంగం) రోజువారీ 2,500 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో కొత్త ఫ్యాక్టరీని స్థాపించారు. కొన్నాళ్ల తర్వాత అంతర్గత సమస్యలు ఎదురవ్వడంతో ఎన్‌ఎస్‌ఎఫ్‌ యాజమాన్యానికి అప్పగించారు. చెరకు రైతులకు చెల్లింపులు సక్రమంగా జరగక మళ్లీ ఆందోళన ప్రారంభమైంది. 2002-03లో ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందన్న నెపంతో బహిరంగ వేలం వేసి అమ్మజూపారు. అప్పట్లో కొనుగోలుకు ఎవరూ  ముందుకు రాకపోవడంతో ఎన్‌సీఎస్‌ సంస్థ రూ.21 కోట్లకు లచ్చయ్యపేట ఫ్యాక్టరీని కొనుగోలు చేసింది. రూ.100 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీని కారుచౌకగా అమ్మేశారని ప్రతిపక్షాలు అప్పట్లో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. 

ఫఎన్‌ఎస్‌ఎఫ్‌ నుంచి ఎన్‌సీఎస్‌ చేతిలోకి వచ్చిన తరువాత సుమారు పదేళ్ల వరకు ఫ్యాక్టరీ ప్రగతి పథంలో నడిచింది.  ఎన్‌సీఎస్‌ యాజమాన్యం అటు రైతులు, ఇటు కార్మికుల మన్ననలు పొందింది. ఫ్యాక్టరీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి 6,500 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యానికి పెంచడమే కాక, చెరకు పండించే రైతులకు ఇతోధికంగా ప్రోత్సాహకాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించింది. తాగునీటి కోసం పైపులైన్లు వేయించింది. సేవ, ఽధార్మిక కార్యక్రమాలను నిర్వహించి అందరి ఆదరణ పొందింది.

 జాతీయ, అంతర్జాతీయ షుగర్‌ వ్యాపార పోకడలు దిశ మార్చుకోవడం, ప్రభుత్వ విధానాల్లో లోపభూయిష్టత, యాజమాన్యం స్వయంకృతాపారాధాలు వెరసి చెరకు రైతులకు తీపి చేదును మిగిల్చినట్లయింది. 2015 నుంచి ఫ్యాక్టరీ తిరోగమనం మొదలైంది. ఫలితంగా రైతులకు, కార్మికులకు బకాయిలు పేరుకుపోయాయి. పీకల్లోతు కష్టాల్లో యజమాన్యం కూరుకుపోయింది.

 కష్టం నుంచి గట్టెక్కే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించక ఆర్‌ఆర్‌ యాక్టు కింద 62.47 ఎకరాల భూములను రూ.27.49 కోట్లకు వేలం వేసి గత ఏడాది రైతుల బకాయిలను చెల్లించారు. ఈ ఏడాది నవంబరు 24న పంచదార నిల్వలను వేలం వేయగా వచ్చిన రూ.11.5 కోట్లతో త్వరలో రైతుల బకాయిలు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  మిగిలి ఉన్న 25 ఎకరాలను కూడా బహిరంగ వేలం వేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 ఈ ఏడాది క్రషింగ్‌ జరపలేమని యాజమాన్యం చెప్పేయడంతో చెరకు పంటను ఏం చేయాలో రైతులకు అర్థం కావడం లేదు. చెరకు రైతులకు గట్టి భరోసా ఇచ్చే ప్రయత్నమేదీ ప్రభుత్వం తరపు నుంచి కనిపించడం లేదు. దీంతో రైతులు, కార్మికులు కన్నెర్రజేస్తున్నారు. చెరకు పరిశ్రమ మనుగడను కాపాడాలని.. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా? లేక చలించకుండా ఉంటుందా? వేచి చూడాలి.Advertisement
Advertisement