వైభవంగా శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-10-02T07:26:21+05:30 IST

దసరా శరన్నవ రాత్రులు పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాల్లో శని వారం రాత్రి అమ్మవార్లు వివిధ అలంకరణలలో భక్తులు దర్శనమిచ్చారు.

వైభవంగా శరన్నవరాత్రులు
దోర్నాలలో లలితాదేవిగా అమ్మవారి దర్శనం

మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 1: దసరా శరన్నవ రాత్రులు పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాల్లో శని వారం రాత్రి అమ్మవార్లు వివిధ అలంకరణలలో భక్తులు దర్శనమిచ్చారు. రాజ్యలక్ష్మీ అమ్మవారు సంతానలక్ష్మీగా, వాసవీమాత రాజరాజేశ్వరిగా, జగదాంబ కాత్యాయినిగా, రమాదేవి శుద్ధలక్ష్మిగా, బంగారమ్మ అన్నపూర్ణాదేవిగా, సీతాదేవి రుక్మిణిగా, సావిత్రి అలంకారాల్లో భక్తులకు దర్శ నమిచ్చారు. ఈవోలు ఈదుల చెన్నకేశవరెడ్డి, జి.శ్రీనివా సరెడ్డి, ఆలయట్రస్ట్‌ బోర్డుచైర్మన్‌ పి.కేశవరావు, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.్చ

పెద్దదోర్నాల : శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో, పోలేరమ్మ దేవాలయంలో అమ్మవారు లలితాదేవి అలంకారంలో  శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. దేవీనవరాత్రుల్లో భాగంగా ఆలయకమిటి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రాంప్రసాద్‌శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేశారు. మహిళలు అధిక సంఖ్యల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు.

ఎర్రగొండపాలెం : దేవి శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాల సందర్భంగా స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయవేదపండితులు ఆర్‌ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో వివిధ పూజాకార్యక్రమాలు జరిగాయి. ఆలయకమిటి అధ్యక్షులు కె పుల్లారావు, కార్యదర్శి సూరే శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు.

పొదిలి రూరల్‌ : మండలంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాలక్ష్మమ్మ దేవాల యంలో కామాక్షిదేవి అలంకరణలో అమ్మవారు దర్శన మిచ్చారు. ప్రతిరోజు స్వామివారికి పూలు, ప్రసాదాల వితరణను వరికుంట్ల అనీల్‌ అందిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం అయన పూజలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి కాయాకర్పూరం సమర్పించి భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు. 

పంచలోహ అభరణాల బహూకరణ

మార్కాపురం (వన్‌టౌన్‌) : మార్కాపురంలోని జగదాంబసమేత మార్కండేశ్వరస్వామి ఆలయంలో  వెలసిన వరసిద్ధి వినాయకుడు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి దసరా సందర్భంగా ఆభరణాలు బహూ కరించారు. ఈ సందర్భంగా ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ దాతలు మద్దెల సత్యరమేష్‌, సత్య సురేష్‌లు పంచలోహ స్వరాభరణాలు సరస్వతీ మాతకు రజత మకరతోరణం అందజేశారన్నారు. కార్యక్రమంలో అర్చకులు వేలూరి ఆంజనేయశర్మ, వరుణ్‌తేజ శర్మ, హరిప్రసాద్‌శర్మ, ప్రసాద్‌శర్మలు పాల్గొన్నారు.

బ్రహ్మంగారి ఆలయంలో పూజలు

పెద్దారవీడు : పెద్దారవీడు బీసీ కాలనీలో వెలసిన బ్రహ్మంగారి మఠంలో ఆదివారం రెండో ఏడాది మహో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి విగ్రహానికి పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు.  కార్యక్రమంలో అల్లు వెంకటేశ్వరరెడ్డి, వీరాచారి, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం

గిద్దలూరు : పట్టణంలోని షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో 19వ బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం మధ్యాహ్నం శ్రీవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి అలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గంజి వీరయ్య, కార్యదర్శి కంచర్ల శ్రీనివాసులు, కోశాధికారి దుద్యాల పుల్లయ్య, కమిటీ ప్రతినిధులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రులలో భాగంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శనివారం అమ్మవారు మీనాక్షిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

కాత్యాయనిదేవిగా బాలత్రిపుర సుందరి

త్రిపురాంతకం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీబాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు శనివారం సింహవాహనంపై శ్రీకాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగాభక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి, చిన్నమస్తాదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఫణీంద్రకుమార్‌శర్మ, అర్చకులు ప్రసాద్‌శర్మ, విశ్వనారాయణశాస్త్రి అమ్మవారికి అభిషేకాలు, ప్రాతఃకాలపూజ, బాలభోగం, ఉభయదాతలతో కుంకుమార్చనలు నిర్వహించారు. రాత్రికి అమ్మవారికి సింహవాహనంపై ఆలయఉత్సవం నిర్వహించారు. అనంతరం పరాకులు, పవలింపుసేవ నిర్వహించారు. అమ్మవారు ఆదివారం కాళరాత్రి అలంకారం లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Updated Date - 2022-10-02T07:26:21+05:30 IST