హవాలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం

ABN , First Publish Date - 2021-03-08T05:14:16+05:30 IST

‘నేను హవాలాకు పాల్పడినట్లు నిరూపిస్తే..

హవాలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మాట్లాడుతున్న మంత్రి బాలినేని

లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటావా?

లోకేశ్‌కు మంత్రి బాలినేని సవాల్‌


ఒంగోలు: ‘నేను హవాలాకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నిరూపించలేకపోతే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకొంటావా’ అని రాష్ట్ర విద్యుత్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సవాల్‌ విసిరారు. చెన్నై వద్ద పట్టుబడిన డబ్బుల విషయంపై తనపై లేనిపోని ఆరోపణలు చేసిన లోకేశ్‌కు నోటీసులిచ్చినా ఇంత వరకూ సమాధానం ఇవ్వలేదని.. ఇప్పుడు తాను హవాలాకు పాల్పడినట్లు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌ తండ్రిని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన మంత్రి పదవి తెచ్చుకున్నారని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పారు.


‘ఆంధ్రప్రదేశ్‌లో దోచుకున్న డబ్బులతో సింగపూర్‌, దుబాయ్‌లలో హోటళ్లు కట్టుకుని హవాలాకు పాల్పడిన వ్యక్తులా నాపై మాట్లాడేది? గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అప్పటి మంత్రి పుల్లారావుతో కలిసి అక్కడ పేకాట డెన్‌ను ఏర్పాటు చేసి వేల మంది పేద కుటుంబాల జీవితాలను నాశనం చేసింది మీరు కాదా? కుప్పంలోనే పార్టీని గెలిపించుకునే సత్తా లేని మీరు ఇప్పుడు ఒంగోలులో గెలిపించుకుంటారా’ అని ఎద్దేవాచేశారు. సంవత్సరాల తరబడి ఒంగోలు డెయిరీని అడ్డుపెట్టుకొని తీవ్రంగా నష్టం చేసింది ఎవరన్నది జిల్లా ప్రజలందరికీ తెలుసని తెలిపారు. పార్టీ మీటింగ్‌లకు డెయిరీ మజ్జిగ, పాలు, డబ్బులు వాడుకొని నాశనం చేసింది చాలక ఇప్పుడు మాపై అభాండాలు వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై కూడా మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనలాగా జనం దగ్గర డబ్బులు తీసుకుని తాను మోసం చేయలేదన్నారు. ఆయనలాగా రోడ్లపై రోడ్లు వేసి అక్రమాలకు పాల్పడలేదని ధ్వజమెత్తారు. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా మాట్లాడనని, కానీ తనపై వ్యక్తిగతంగా వస్తే అదేవిధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒంగోలులోని 33వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి భర్త మురళిని ఒక చీటింగ్‌ కేసులో పోలీసులు అరెస్టు చేయడంపై తానే ముందు స్పందించానని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఐకి సూచించానన్నారు. దానిని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చీరాలలో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. సమావేశంలో  నేతలు సింగరాజు వెంకట్రావు, కాకుమాను రాజశేఖర్‌, కఠారి శంకర్‌, పంది రత్నరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:14:16+05:30 IST