వెంటాడే దృశ్యాలు

ABN , First Publish Date - 2022-05-11T06:31:26+05:30 IST

సోమవారం ప్రకటించిన ఈ ఏడాది పులిట్జర్ పురస్కారాల్లో రాయిటర్స్ సంస్థకు చెందిన నలుగురు ఫోటోగ్రాఫర్లు ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో విజేతలుగా నిలిచారు...

వెంటాడే దృశ్యాలు

సోమవారం ప్రకటించిన ఈ ఏడాది పులిట్జర్ పురస్కారాల్లో రాయిటర్స్ సంస్థకు చెందిన నలుగురు ఫోటోగ్రాఫర్లు ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో విజేతలుగా నిలిచారు. అద్నన్ అబిదీ, సన్నా ఇర్షాద్, అమిత్ దవేలతో పాటు దానిశ్ సిద్దిఖీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని మరణానంతరం అందుకున్నారు. భారతదేశానికి చెందిన ఈ ఫోట్రోగాఫర్ ఏడాదిక్రితం అఫ్ఘానిస్థాన్ యుద్ధసమయంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారతదేశంలో కొవిడ్ కల్లోలాన్నీ, మరణాలనూ తమ చిత్రాలతో అద్దంపట్టినందుకు వీరికి ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. అవార్డు ఎంత గొప్పదైనా, అందుకున్నవాళ్ళలో ఇండియన్లున్నా, ఆ చిత్రాలు తమకు నచ్చని నిజాలను ప్రపంచానికి చూపాయి కనుక పాలకులనుంచి మెప్పుకోళ్ళేమీ ఉండవు. సిద్దిఖీ కన్నుమూసినప్పుడే అయ్యో పాపం అనడానికి కూడా వారికి మనసు రాలేదు.


పులిట్జర్ పురస్కారం సిద్దిఖీ గెలుచుకోవడం ఇది రెండోసారి. నాలుగేళ్ళక్రితం ఆయన రోహింగ్యా శరణార్థుల ఫోటోకు తొలి పులిట్జర్ పొందారు. రోహింగ్యా శరణార్థులు మయన్మార్ సైన్యం దాడులనుంచి తప్పించుకొని పడవలో బంగ్లాదేశ్ సముద్రతీరానికి తరలివచ్చిన సమయంలో ఒక మహిళ నేలను చేతితో తాకుతున్న దృశ్యమది. రాయిటర్స్ లో ఫోటోజర్నలిస్టుగా ఉన్న పదేళ్ళకాలంలో ఆయనది సాహసోపేతమైన ప్రయాణం. హాంకాంగ్ అల్లర్లు, రోహింగ్యా ఊచకోతలు ఆయనకు మరింత పేరు తెచ్చాయి. గత ఏడాది కాందహార్‌లోని స్పిన్ బోల్డక్ ప్రాంతాన్ని తాలిబాన్లు వశంచేసుకున్నాక అఫ్ఘాన్ దళాలతో సాగిన పోరాటాన్ని నివేదించేందుకు అక్కడకు చేరుకున్న సిద్దిఖీ పదిహేనుగంటలు సుదీర్ఘంగా పనిచేసిన తరువాత ఓ పావుగంట అలా పచ్చికమీద విశ్రమించిన దృశ్యాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు కూడా. ఆ తరువాత కాల్పుల్లో ఆయన మరణించడంతో ప్రపంచం విస్తుపోయింది. జరిగిన పొరపాటుపై తాలిబాన్ వివరణ ఇచ్చి ఆవేదన వెలిబుచ్చింది. రాయిటర్స్ సంస్థతో పాటు సిద్దిఖీ తల్లిదండ్రులూ తమకు సాధ్యమైనరీతిలో ఏవో న్యాయపోరాటాలు చేశారు కానీ, భారత ప్రభుత్వం నోరుమెదపలేదు, ఆయ్యోపాపం అనలేదు. భారత్‌లో కరోనా మహమ్మారి రెండోదశ ఉధృతి ఎంత భయానకమైనదో ఆయన చిత్రాలు పట్టిచ్చాయి. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయి, స్మశానాలు నిండిపోయి, సామూహిక దహనాలు సాగిపోతున్న నిజాన్ని ఆయన తన ఫోటోలతో ప్రజల ముందుంచాడు. మందులకోసం, ఆక్సిజన్ కోసం పరుగులు, ఆత్మీయుల వెంపర్లాటలు, ఆవేదనలు, వైద్యసిబ్బంది పరుగులు...ఇలా ప్రతీ చిత్రం సంక్షోభంలోని ప్రతీ పార్వ్వాన్నీ తెలియచెప్పింది. హృదయాలను కదిలించే ఆ చిత్రాలు పాలకుల గుండెలు రగిలించాయి. ప్రజలకు ఏది తెలియకూడదని కోరుకున్నారో అదే జరగడం మహమ్మారిపై అద్భుతపోరాటం చేస్తున్నామనీ, భారత్ కరోనాని ఓడించిందనీ చెప్పుకుంటున్నవారికి ఆగ్రహం కలిగించినట్టుంది. అమెరికా అధ్యక్షుడినుంచి, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వరకూ, అనేక దేశాల అధినేతలూ, ప్రపంచస్థాయి మీడియా సంస్థలూ విచారం వ్యక్తంచేసినా వీరికి మనసు కరగలేదు.


సిద్దిఖీ, ఆయనతోపాటు పులిట్జర్ పురస్కారాలు అందుకున్న మిగతా సభ్యులు తమ చిత్రాలతో కరోనా నిజాలు తెలియచెప్పి సరిగ్గా ఏడాది అయింది. మహమ్మారితో పోరాటం విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు ఇటీవలి ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక మళ్ళీ ఊతం ఇస్తున్నది. భారతదేశంలో గత ఏడాది చివరినాటికి కనీసం 47లక్షలమంది కరోనా కారణంగా మరణించారనీ, ప్రభుత్వ అధికారిక లెక్కలకు కనీసం పదిరెట్ల మరణాలను దేశం చవిచూసిందనీ ఆ నివేదిక చెబుతున్నది. ప్రపంచ ఆరోగ్యసంస్థ  నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో మనదేశానిదే అగ్రస్థానం. ఆరోగ్యసంస్థ అధ్యక్షుడు భారత్‌లో పర్యటించినప్పుడు ఆయనకు మోదీ ఎంతో ప్రేమగా తులసీభాయ్ అని నామకరణం చేశారు. పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు. ఇరువురి ఆప్యాయతల మధ్యనే ఈ నివేదికపై తెరవెనుక పోరాటాలు కూడా జరిగాయి. నివేదికను నిలువరించడం ఎలాగూ సాధ్యం కాదు కనుక, అది విడుదలైన వెంటనే, అప్పటికే సిద్ధంచేసుకున్న ప్రతివిమర్శతో భారత్ దానిని కొట్టిపారేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలకూ ఒకే విధానాన్ని అమలు చేసినా భారత్‌కు మాత్రం అది లోపభూయిష్టంగా కనిపించింది. లెక్కలు తప్పని తీసిపారేసినప్పటికీ, సిద్దిఖీ ఆయన తోటివారి చిత్రాలు మనలను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.

Read more