Abn logo
Mar 30 2020 @ 03:02AM

వీరికి హ్యాట్సాఫ్‌!

రోష్మా వామదేవన్‌... కేరళలోని కోళికోడ్‌ బీచ్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో గ్రేడ్‌-1 స్టాఫ్‌ నర్స్‌. భుజానికి ఒక బ్యాగు తగిలించుకుని ఒంటరిగా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఆమె గుండె నిండా దిగులే. బాధతో కూడిన రకరకాల ఆలోచనలు... ఈ రోజు వార్డులో కరోనా బాధితులు ఎలా ఉంటారోనని. కరోనా వైరస్‌ టెస్ట్‌లు పూర్తి కాగానే బాధితులను ఐసోలేషన్‌ గదిలో ఉంచుతారు. ఆ గదికి ఒకే ఒక్క కిటికీ ఉంటుంది. ఆ గదికి ఇంఛార్జ్‌గా ఆమె బాధితులతో పాటు వారి బాగోగులు చూస్తూ ఉండాల్సి ఉంటుంది.


ఈ క్రమంలో వామదేవన్‌ ఎదుర్కొనే అతి కష్టమైన టాస్క్‌ ఏమిటంటే, క్వారంటైన్‌లో ఉన్న వారిని సముదాయించడం. సౌదీ అరేబియా నుంచి కరోనా వైరస్‌తో వచ్చి, అక్కడ చేరిన 68 ఏళ్ల వృద్ధురాలికి 14 రోజుల పాటు ధైర్యం నూరిపోయడం అంటే ఆషామాషీ కాదు. ‘‘నా ఇద్దరు కొడుకుల్లో ఒకరు 5, మరొకరు 8వ తరగతి చదువుతున్నారు. వాళ్లిద్దర్నీ మా అమ్మ దగ్గరకు పంపించేసి, నేను ఒంటరిగా ఉంటున్నా’’ అని వామదేవన్‌ అంటున్నారు. దేశంలో ఈ వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఆమె తన మిత్రులు, కుటుంబసభ్యులతో కేవలం ఫోన్‌లోనే టచ్‌లో ఉన్నారు. ‘‘వాళ్లంతా నన్ను కలవాలంటే భయపడుతున్నారు. నా పరిస్థితి, ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఒకేలా ఉంటుంది’’ అని విచారాన్ని వ్యక్తం చేస్తారామె. వైరస్‌ నుంచి రక్షణ కోసం ఆమెకు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేకమైన దుస్తులను ఇచ్చాయి. ‘‘రక్షణ కోసం ధరించే గ్లౌజులు, మాస్కులు, మోకాళ్ల వరకు ఉండే బూట్లను గంట కన్నా ఎక్కువసేపు వేసుకోలేం. అందులోనూ గాలి సరిగా ఆడని గదిలో. మా రక్షణ కోసమే అయినా బరువుగా, అసౌకర్యంగా ఉంటాయి. ఆ దుస్తుల్లో మేము వాష్‌రూమ్‌లోకి వెళ్లాలన్నా, నీళ్లు తాగాలన్నా కష్టమే. అందుకే షిఫ్ట్‌ అయిపోయేదాకా నేను ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. వాటిని తీసేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, శరీరానికి అంటుకోకుండా తీసి బయో హజార్డ్‌ బ్యాగులో ప్యాక్‌ చేయాలి’’ అన్నారామె.


కర్తవ్యం తర్వాతే కుటుంబం...

ఐసోలేషన్‌ గదిలో ఉన్న కరోనా బాధితులకు ప్రతిరోజూ మందులు, పోషక విలువలున్న ఆహారం, శానిటైజర్లు, మాస్క్‌లు అందించి వారిని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడమే వామదేవన్‌ పని కాదు. అంతకన్నా ఎక్కువగా బాధితుల ఒంటరితనాన్ని పోగొట్టి, వారి మానసిక బలాన్ని పెంచాలి. ‘‘అందుకే నేను వారిని తరచూ సన్నిహితులతో, కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడమని ప్రోత్సహిస్తుంటా. సైకాలజిస్టులతో కూడా మాట్లాడమని చెబుతుంటా. వారిలో కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపాలని చూస్తుంటా’’ అంటారు వామదేవన్‌.

ఈ క్రమంలో ఈ 36 ఏళ్ల నర్సు తన పిల్లలను బాగా మిస్సవుతుంది. అయితే కర్తవ్యం ముందు అవేవీ గుర్తుకు రావంటుంది. సమాజ రక్షణ కోసం తనవంతు కృషి చేయడం తప్పనిసరి అనేది వామదేవన్‌ భావన.  మరోవైపు వైరస్‌ నుంచి క్షేమంగా బయటపడినవారు, వారి తల్లిదండ్రులు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫోన్‌ చేస్తుంటారు. ‘వారి మాటలు వృత్తిపట్ల మరింత అంకితభావంతో పనిచేసేలా స్ఫూర్తినిస్తాయ’ని చెబుతున్నారీ స్టాఫ్‌ నర్స్‌.


తొమ్మిది నెలల బిడ్డకు దూరంగా...

డాక్టర్‌ రేష్మీ... కేరళలోని పత్తనంతిట్ట జిల్లా కంట్రోల్‌ సెల్‌లో ‘కొవిడ్‌-19’ సర్వీలెన్స్‌ టీమ్‌కు ఇంఛార్జ్‌గా పనిచేస్తున్నారు. శబరిమలను దర్శించుకునేందుకు ఇటలీ నుంచి ఫిబ్రవరి 29న వచ్చిన ఒక ఇటలీ కుటుంబానికి ఎయిర్‌పోర్ట్‌లో స్ర్కీనింగ్‌ చేయడంతో ఈ జిల్లా వార్తల్లోకి ఎక్కింది. వెంటనే డాక్టర్‌ రేష్మీ బృందం వారిని తమ అదుపులోకి తీసుకుంది. 28 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంచి, పరిణామాలను గమనించాలనుకుంది. ‘‘డిసెంబర్‌ 2019లో చైనాలో కొవిడ్‌ -19 విజృంభిస్తున్నప్పటి నుంచే మేము అప్రమత్తంగా ఉన్నాం. అయితే ఇటలీ ఫ్యామిలీకి పాజిటివ్‌ వచ్చిందని (మార్చి 8న) తెలియగానే రక్షణ చర్యలు చేపట్టాం. వారు అప్పటికే జిల్లా వ్యాప్తంగా 17 ప్రదేశాలు తిరిగారని గుర్తించాం.


వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచాం. కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత వారంతా ఇండియాకు వచ్చిన తర్వాత ఎవరెవర్ని కలిశారో తెలుసుకున్నాం. రిజిస్టర్లు, బిల్లులు, సీసీటీవీ ఫుటేజ్‌ సాయంతో సుమారు వెయ్యిమందిని వాళ్లు కాంటాక్ట్‌ చేసినట్టుగా తేలింది. దాంతో సమస్య మరింత జఠిలమయ్యింది’’ అన్నారు రేష్మీ. వివరాలు సేకరించిన తర్వాత అందర్నీ సెల్స్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కౌన్సెలింగ్‌ ఇచ్చారు రేష్మీ. ఆ సమయంలో అహోరాత్రులు వారిని కాచుకుని ఉండాల్సి వచ్చింది. ‘‘మేము 24 గంటలూ వారిని కనిపెట్టుకుని ఉండటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్ని వారాలుగా నేను తొమ్మిది నెలల వయసున్న నా బిడ్డకు దూరంగా ఉంటున్నా. కరోనా అనేది కేవలం ఏ ఒక్కరి ఆరోగ్య సమస్యనో కాదు... దాన్ని సామాజికంగానే అందరం కలిసికట్టుగా పారద్రోలాలి’’ అంటున్నారు డాక్టర్‌ రేష్మీ. 


కరోనా మహమ్మారితో పోరాడుతున్నవారిలో వైద్య సిబ్బంది మొదటి వరుసలో ఉన్నారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. అంతు చిక్కని వైరస్‌ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో రాత్రనక, పగలనక సేవలను అందిస్తున్నారు. ‘కొవిడ్‌ 19’ను కట్టడి చేసేందుకు క్వారంటైన్‌, ఐసొలేషన్‌ వార్డుల్లో కరోనా బాధితులకు తోడుగా ఉంటున్నారు. కొవిడ్‌తో యుద్ధం చేస్తున్న అలాంటి ఇద్దరు హెల్త్‌కేర్‌ వర్కర్ల అనుభవాలివి...


Advertisement
Advertisement
Advertisement