హ్యాట్సాఫ్‌... పోలీస్‌

ABN , First Publish Date - 2020-03-29T09:46:30+05:30 IST

కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు పోలీసులు చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘హ్యాట్సాఫ్‌ పోలీస్‌’ అంటూ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

హ్యాట్సాఫ్‌... పోలీస్‌

ఎండను సైతం లెక్కచేయకుండా విధులు

ఆహారం, మంచినీరు అందకున్నా సడలని సంకల్పం


గుంటూరు, మార్చి 27: కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు పోలీసులు చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘హ్యాట్సాఫ్‌ పోలీస్‌’ అంటూ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రజలందరిలో కరోనా అంటే ఒక రకమైన భయం నెలకొంది. అంతేకాక గుంటూరు నగరంలో మూడు రోజుల క్రితం ఓ కరోనా పాజిటివ్‌ వెలుగు చూడడం తాజాగా అదే కుటుంబంలో మరో కేసు ఉన్నట్లు వెల్లడి కావడం జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. ఇటువంటి పరిస్ధితుల్లో ఏమాత్రం అధైర్యపడకుండా విధి నిర్వహణలో పోలీసులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు. 


ఈనెల 22న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజు నుంచి జిల్లావ్యాప్తంగా పోలీసులు కుటుంబాలకు దూరమయ్యారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది అందరూ రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు ఆయా ప్రాంతాల్లో నిలువు నీడా లేకపోయినా గంటల కొద్దీ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలను రోడ్లపైకి రాకుండా ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో పలువురితో వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజల నుంచి అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ లాఠీలకు పని చెబితే ఎక్కడ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోననే భయంతో కోపాన్ని తమలో తామే అణచుకుంటున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోయినప్పటికీ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారిని కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.


 గడిచిన రెండు మూడు రోజుల్లో పూర్తి కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉండడంతో అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో తినడానికి తిండి సంగతేమో కానీ తాగడానికి మంచినీరు లేక వారు తమకు కేటాయించిన ప్రదేశం నుంచి పక్కకు వెళ్ళలేక విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉదయం 7 గంటలకు డ్యూటీకి వెళితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులు నిర్వహించాలి. తరువాత భోజనానికి వెళ్ళి తిరిగి రాత్రి 9 గంటలకు విధులకు హాజరై తెల్లవారు 7గంటల వరకు పని చేయాలి. ఆ విధంగా రాత్రి డ్యూటీ చేసిన వారు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నారు. రెండు షిఫ్ట్‌లలో సరైన నిద్ర కూడా లేకుండా పనిచేస్తున్నారు. ఏపీఎస్పీ బలగాలగైతే స్ధానిక పోలీస్‌స్టేషన్‌ అధికారులే భోజన వసతి కల్పిస్తున్నారు. 


ఆయా కుటుంబాల్లో భయాందోళన

ప్రజలంతా ఇళ్ళకే పరిమితంగా ఉండి, గడప దాటితే పోతారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న హెచ్చరికలతో పోలీసు కుటుంబాల్లో భయాందోళన నెలకొంది. పోలీసులు మనుషులు కాదా, వీరు రోడ్లపై ఉంటే వీరికి వైరస్‌ సోకదా అంటూ వారి కుటుంబంలోని భార్య, పిల్లలు ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కుటుంబాలను సైతం లెక్క చేయకుండా సంకల్పంతో ముందుకుసాగుతున్నారు.


కరోనా మహమ్మారి కట్టడి ద్వారా ప్రజల ప్రాణాలే తమ లక్ష్యం అన్నట్లుగా పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుండడంపై పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులకు యావత్‌ సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వారిలో, వారి కుటుంబాల్లో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఈ విషయంలో అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ చేస్తున్న కృషి, పోలీసులకు ఇస్తున్న మనోధైర్యంతో వారు మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-03-29T09:46:30+05:30 IST