విద్వేష క్రీడలు తెలంగాణలో చెల్లవు!

ABN , First Publish Date - 2022-05-17T06:22:42+05:30 IST

పాదయాత్ర సందర్భంగా ప్రసంగాలలో అసత్యాలు, దినపత్రికలకు రాస్తున్న వ్యాసాలలో (మే, 12) అవాస్తవాలు అలవోకగా వండివారుస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరు ప్రజల ఆమోదం పొందలేదు...

విద్వేష క్రీడలు తెలంగాణలో చెల్లవు!

పాదయాత్ర సందర్భంగా ప్రసంగాలలో అసత్యాలు, దినపత్రికలకు రాస్తున్న వ్యాసాలలో (మే, 12) అవాస్తవాలు అలవోకగా వండివారుస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరు ప్రజల ఆమోదం పొందలేదు. జనాల అనుభవంలోకి వచ్చిన వాటిని, అబద్ధాల ప్రచారంతో మరిపించడం, మరోవైపుకి మళ్ళించడం రాజకీయంగా సులభతరంకాదు. ఏరు, ఊరుకు మధ్య కరువును పరిచిన నిన్నటి వివక్షాపూరిత పాలన గురించి, స్వరాష్ట్రంలో పరిస్థితులు మారి కాళ్ళు వచ్చిన కాలువల గురించి కష్టజీవులు తమ ముచ్చట్లలో విశ్లేషించుకుంటూనే ఉన్నారు. వర్తమానంలో పాలమూరుకు, తెలంగాణకు వొరిగిందేమీలేదని, సకల సమస్యలను పరిష్కరించే అల్లావుద్దీన్ అద్భుతదీపం కమలంపువ్వు మాత్రమేనని ఊదరగొడితే ప్రజలు కాషాయం పార్టీ వలలో పడిపోతారా!


వలసజీవికి ఉండే విశ్లేషణ సామర్థ్యం, పోల్చి చూసుకొని వాస్తవాలను అర్థం చేసుకునే అవకాశం స్థిర నివాసంలో భద్రజీవితం గడిపినవారికి ఉండదు. జాతీయ పార్టీలు, సీమాంధ్ర పాలకుల పాపాల పాలనా పుణ్యమా అని పాలమూరు ప్రజలు బతుకుదెరువుకు ‘దేశంబోయి’, పొలిమేరకు అవతల, పొలిమేర లోపల బతుకులపై పుస్తకాల్లో దొరకని విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తరాల కరువు తగిలించిన రుగ్మతలైన అమాయకత్వం, భయం, ప్రలోభాలు వదిలించుకొని, వాస్తవాలే ప్రామాణికంగా, అక్కరకొచ్చేవారినే ఆత్మీయులుగా సంపాదించుకునే నేర్పును పాలమూరు పల్లెలు పట్టేసుకున్నాయి. అందుకే గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో తెరాస అభ్యర్థులకు అద్భుతమైన మెజారిటీని అందించారు.


వాస్తవానికి పాలమూరు జిల్లాలో అందుబాటులో ఉన్న 28 లక్షల సాగుయోగ్యమైన భూమిలో దాదాపు 20 లక్షలకు పైగా ఎకరాలకు, రెండు పంటలకు సాగునీరు అందించే శాస్త్రీయ నీటిపారుదల ప్రణాళికలను సీఎం కేసీఆర్‌ గడిచిన ఏడేళ్ళుగా అమలు చేస్తున్నారు. సీమాంధ్ర పాలనలో శిథిల శిలాఫలకాలు, పాడుబడ్డ బావుల్లా మారిన ఎత్తిపోతల పథకాలను ఎత్తిపట్టి, గ్రామాలకు జలకళను, జీవకళను సమకూర్చే పాలనా చర్యలను దృఢసంకల్పంతో అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.


వాటి ఫలితంగానే రాష్ట్ర ఆవిర్భవానికి మునుపు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందని దుస్థితిని దాటి నేడు దాదాపు 15 లక్షల ఎకరాలకు రెండు పంటలకు పక్కాగా సాగునీరు అందుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు నెట్టెంపాడు కింద సాగుకు నోచుకున్నది 2వేల మూడు వందల ఎకరాలే. కానీ ప్రభుత్వం ప్రాణం పెట్టి పెండింగు పనులను పూర్తి చేయడం వల్లనే నేడు ఈ ఎత్తిపోతల క్రింద ఆయకట్టు 2 లక్షల ఎకరాలకు పైగా పెరిగింది. అలాగే 780 కోట్లు కేటాయించి, తుమ్మిళ్ళ మొదటిదశ పనులు కేవలం పదినెలలో పూర్తిచేయడం వల్లనే ఆర్టీఎస్‌ పరివాహక ప్రాంతంలో నూతనంగా 50 వేల ఎకరాలకు సాగునీరు సాకారమయ్యింది.


కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2014 సంవత్సరం నాటికి నీరు అందింది కేవలం 13 వేల ఎకరాలకే. స్వరాష్ట్రంలో నీటి కేటాయింపులను 25 టిఎంసీల నుంచి 40 టిఎంసీలకు పెంచి, జొన్నలగడ్డ, గుడిపల్లి రిజర్వాయర్ల వద్ద లిఫ్టులు నిర్మించి, సాగు లక్ష్యాన్ని రెండింతలు చేసింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు కింద నేడు 3 లక్షల 50 వేల ఎకరాలకు పైగా సాగు నీరు సమకూరుతున్నది. వనపర్తి జిల్లాలో 64 వాగులపై దాదాపు 400 కోట్ల రూపాయలతో చెక్‌డ్యాంలు నిర్మించడం వల్లనే, ఈ ప్రాంతంలో సుమారు 1 లక్షా 90 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. దీనికితోడు బీమా ఎత్తిపోతల పెండింగు పనులు పూర్తి చేయడం వల్ల జిల్లాలో 2 లక్షల 2 వేల ఎకరాలు, కోయిల్‌సాగర్‌ను సరిదిద్దడం వల్ల మరో 50 వేల ఎకరాలు రెండు పంటలకు సాగునీటిని పొందుతున్నాయి. వీటికి తోడు సముద్రమట్టానికి దాదాపు 500 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే సాంకేతిక అద్భుతం, దాదాపు ఇప్పటికే 75శాతం పనులు పూర్తయిన జీవితాలు మార్చే జలశిఖరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే అదనంగా మరో 13 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. గట్టు ఎత్తిపోతలతో పాటు మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులు, ప్రణాళికలకు నోచుకొని, సర్వేలు పూర్తయి, పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.


పారే ప్రతి నీటిబొట్టును వొడిసిపట్టి, పొలాలవైపు మళ్ళించి, వలస బతుకులకు విముక్తి బాటపరిచే పకడ్బందీ పాలనా వ్యూహాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పంపిణీ చేయకుండా కుట్రపూరితంగా ఆలస్యం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే కదా. వివక్షాపూరిత పాత ట్రిబ్యునళ్ళ కేటాయింపుల ఆదారంగా, నూతన ప్రాజెక్టులకు డిపిఆర్‌లు సమర్పించాలని పట్టుబడుతూ, సాగునీటి ప్రాజెక్టుల పనులు ఆపాలని ఆదేశించి అన్యాయం చేసింది కూడా కేంద్ర సర్కారే కదా. కర్ణాటక సర్కార్‌ 194 గేట్లతో కృష్ణా నదిపైన బీమా ఎగువన గుర్జాపూర్‌ వద్ద నిర్మిస్తున్న నీటి కేటాయింపులు లేని బ్యారేజీని ఆపమని కోరుతున్నా, పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నదీ కేంద్ర పాలకులే కదా. ఈ నిజాలన్నింటికీ మసిపూసి నోటితో నీటిపై అసత్యాలు రాయగలమని భారతీయ జనతా పార్టీ నాయకత్వం భ్రమలు పడటం విడ్డూరంగా ఉంది.


అయినా జనామోదం దొరికే ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా చర్చకు పెట్టకుండా, నూతన, భిన్నమైన రాజకీయ వ్యూహాలను రూపొందించుకోకుండా, కేసీఆర్‌ ఎజెండా చుట్టే బొంగరంలా గగ్గోలు పెడుతూ తిరిగితే, ప్రతిపక్షాలు పరిగలేరుకోవడానికే పరిమితమవుతాయి. కలలు ఆకాశంలో, కార్యాచరణ పాతాళంలో ఉన్నంతకాలం మెరుగైన ఫలితాలు సాధించడం ప్రతిపక్షాలకు సాధ్యపడదు. గంగాజమునా తెహజీబ్‌ తరహా జీవన విధానాన్ని అలవాటు చేసుకున్న గడపల ముందు వాలి, వినసొంపుగాలేని గొంతుకలతో విద్వేష ఎజెండాను వినిపిస్తే ప్రజలు నవ్వుకుంటారేగాని వెంటనడవరు.


సభలు, సమావేశాలలో తెలంగాణ గుండెతడి లేకుండా, రాజకీయ అలజడి మాత్రమే కనపడినంతకాలం ప్రతిపక్షాలు ఈ నేలమీద విజయాలను నమోదు చేయజాలవు. సామాజిక మాధ్యమాలను నమ్ముకొని, ఆమోదం లభించని పదజాలంతో జనాలను ఆకట్టుకుంటామనుకోవడం భ్రాంతి మాత్రమే. ఏ సంస్థకైనా భావజాల వ్యాప్తికి, కార్యాచరణ అమలుకు పునాదిగా ఉండాల్సింది విస్తృతంగా ప్రజల జీవితాల్లోంచి సేకరించిన సమాచారం మాత్రమే. అదే తెలంగాణ రాష్ట్ర సమితిని నేల నలుచెరుగులకూ చేర్చగలిగింది.


కానీ ప్రతిపక్షాలు భిన్నమైన వైఖరితో ఏనాడో గ్రామాలకు దూరమైన, పట్టణ ప్రాంత మేధావులతో కలిసి రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. పునాదుల్లోంచి సమాచార సేకరణ, వాస్తవాలకు దగ్గరగా ఉండే విశ్లేషణ, సామాన్యులను భాగస్వాములను చేసే కార్యాచరణ మాత్రమే ఏ రాజకీయ పార్టీకైన సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిపెడుతుంది. దానికి విరుద్ధంగా పాత పౌరాణిక సినిమాలలో బలాఢ్యుడైన భీముడిలా, గద విన్యాసాలతో రాజకీయ యుద్ధంలో జెండాలను ఎగరేస్తామని అనుకోవడం వలన హాస్యాస్పద ఫలితాలు మాత్రమే దక్కుతాయి. చరిత్ర పొడుగునా తెలంగాణ నిజాలవెంట మాత్రమే అడుగులు వేసింది. రాజకీయాల్లో వివేకవంతులు అర్థం చేసుకోవలసింది దీన్ని మాత్రమే కదా.

డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌

రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు

Updated Date - 2022-05-17T06:22:42+05:30 IST