రూ.21 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ABN , First Publish Date - 2021-03-08T08:52:36+05:30 IST

ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, పూజలు చేస్తే అవి దక్కుతాయని నమ్మించి ఓ మహిళను నిండా ముంచారు కేటుగాళ్లు.

రూ.21 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

గుప్త నిధులున్నాయని మహిళకు టోపీ

కడెం, మార్చి 7: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని,  పూజలు చేస్తే అవి దక్కుతాయని నమ్మించి ఓ మహిళను నిండా ముంచారు కేటుగాళ్లు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెద్దూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆరు నెలల క్రితం జన్నారం, మంచిర్యాల్‌, మేడారానికి చెందిన ముగ్గురు కోయ పూజారులు పెద్దూర్‌ గ్రామానికి వచ్చి ఆ మహిళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు ఇంట్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. తవ్వకాల్లో దేవుని ప్రతిమ, ఇత్తడి బిందె, కొంత బంగారం లభించాయని, వాటినివారం రోజుల పాటు ఊరి బయట పూజలు నిర్వహించి విప్పితే ఇంకా పెద్ద మొత్తంలో గుప్తనిధులు దక్కుతాయని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. ఇందు కోసం ఆ వ్యక్తులు ఆ మహిళ వద్ద వివిధ వాయిదాల్లో రూ.21 లక్షలు తీసుకెళ్లారు. బాధితురాలు చివరకు వారు చెప్పినట్లు చేసినా నిధులు దక్కలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని కడెం ఎస్‌ఐ రాజు తెలిపారు.

Updated Date - 2021-03-08T08:52:36+05:30 IST