‘ఏటీజీ’ని వైసీపీ తెచ్చిందా!?

ABN , First Publish Date - 2022-08-06T09:00:54+05:30 IST

‘ఏటీజీ’ని వైసీపీ తెచ్చిందా!?

‘ఏటీజీ’ని వైసీపీ తెచ్చిందా!?

టైర్ల కంపెనీని తామే తెచ్చినట్టు ప్రచారం.. కానీ, టీడీపీ హయాంలో రాష్ట్రానికి ఏటీజీ

అచ్యుతాపురం సెజ్‌లో భూమి పరిశీలన

రాయితీల కల్పనకు చంద్రబాబు సమ్మతి

ఇంతలో ఎన్నికలు రావడంతో బ్రేకులు

ప్రక్రియనంతా ఆపేసిన వైసీపీ సర్కారు

ఇప్పుడేమో సోషల్‌మీడియాలో క్రెడిట్‌ గేమ్‌ 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘సొమ్మొకరిది...సోకొకరిది’’ అన్నట్టుగా ఉంది వైసీపీ ప్రభుత్వం తీరు. జపాన్‌ కంపెనీ ‘అలియన్స్‌ టైర్‌ గ్రూప్‌’ను (ఏటీజీ) ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చిన కష్టమంతా తనదేనని సోషల్‌మీడియాలో చేసుకుంటున్న ప్రచారం అధికార వర్గాలనే విస్తుపోయేలా చేస్తోంది. ఏటీజీ గ్రూపు ఏపీకి రావాలని, ఇక్కడ  కొత్త యూనిట్‌ పెట్టాలని భావించి 2019 ప్రారంభంలోనే పలు ప్రాంతాలను సందర్శించింది. నాటి ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఏపీఐఐసీకి చెందిన సెజ్‌లో ఐదు వేల ఎకరాల భూమి అప్పటికి ఖాళీగా ఉంది. అందులో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువస్తే అన్ని రాయుతీలు ఇస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడంతో ఏటీజీ ప్రతినిధులు వచ్చి సెజ్‌లో భూములను పరిశీలించారు. తమకు 100 ఎకరాలు కావాలని, డీనోటిఫై చేసి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కోరారు. దానికి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. ఆ తదుపరి ఒప్పందం చేసుకునే సమయానికి ఎన్నికలు రావడంతో ప్రక్రియ అక్కడ ఆగింది. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్ని పారిశ్రామిక ఒప్పందాలను, ప్రతిపాదనలను తిరగదోడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏటీజీ ప్రతినిధులు వైసీపీ పెద్దలను సంప్రతించి, వారి షరతుల మేరకు ఒప్పందం చేసుకున్నారు. డీనోటిఫై చేసిన భూమి ఎకరా 95.18 లక్షల చొప్పున 80 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మొదటి దశలో రూ.1,050 కోట్లు, రెండో దశలో రూ.700 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ స్పష్టంచేసింది. ప్రత్యక్షంగా 800 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. ఒప్పందం జరిగిన తరువాత కరోనా వచ్చినా సరే పనులన్నీ పూర్తిచేసి ఇప్పుడు ఉత్పత్తి తయారీకి రంగం సిద్ధం చేసింది. అన్నీ కుదిరితే ఒకటి, రెండు నెలల్లో కంపెనీని ప్రారంభించే అవకాశం ఉంది. 


అంతా ఊక దంపుడే..   

వాస్తవం ఇలా ఉండగా, వైసీపీ నాయకులు  ‘ఇది పూర్తిగా తమ కష్టమే’ అంటూ సోషల్‌ మీడియాలో ఊదరగొడుతున్నారు. చంద్రబాబు నిర్వహించిన సదస్సులతోనో, దావో్‌సలో లోకేశ్‌ చర్చలతోనో ఇది రాలేదని వాదిస్తున్నారు. వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ఈ ఒప్పందం జరిగింది. అప్పటికి జగన్‌ ఏ సదస్సులు పెట్టలేదు. ఎవరినీ ఆహ్వానించలేదు.  వాస్తవాలన్నీ పక్కన పెట్టి ‘ఏటీజీ’ ఘనత తమదేనని వైసీపీ తెగ ప్రచారం చేస్తోంది. 

Updated Date - 2022-08-06T09:00:54+05:30 IST