Apr 11 2021 @ 16:03PM

నాని మార్కెట్ దాటిపోయిందా..?

నేచురల్ స్టార్ నాని నిర్మాతల హీరో అని ముందు అందరూ చెప్పుకుంటారు. అందుకు కారణం నానితో సినిమా తీసిన నిర్మాత గ్యారెంటీగా సేఫ్ జోన్‌లో ఉండటమే. మినిమం గ్యారెంటీ హీరోగా నానికి పేరుండటంతో నానికి యావరేజ్ హిట్స్ వస్తున్నా కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతలు కూడా నానితో సినిమాలు నిర్మించడాని ఎప్పుడూ రెడీగానే ఉంటున్నారు. నాని గత చిత్రం వి కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదన్న మాట వినిపించింది. అయినా నాని చేతిలో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

ఏప్రిల్ 26న టక్ జగదీష్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా టక్ జగదీష్ తెరకెక్కగా జగపతి బాబు కీలక పాత్రలో నటించాడు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. కాగా ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింఘరాయ్ సెట్స్ మీద ఉంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని నాని సన్నిహితుడు వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే నాని మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సెట్స్‌లో జరుపుతుండటంతో పరిధి దాటి బడ్జెట్ పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. మరి పెట్టిన పెట్టుబడి తిరిగి శ్యామ్ సింఘరాయ్ రాబడతాడా లేదా అన్నది చూడాలి.